logo

ఆఖరి మజిలిలోనూ ‘అవస్థలే’..!

నరసన్నపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో సుమారు 400లకు పైగా శ్మశాన వాటికలు ఉన్నాయి. వీటిలో అత్యధిక శాతం రూపురేఖలే కోల్పోయాయి. దీంతో దహన సంస్కారాలకు వెళ్లేందుకు అవస్థలు పడాల్సి వస్తోంది.

Published : 07 May 2024 04:31 IST

న్యూస్‌టుడే, నరసన్నపేట గ్రామీణం, నరసన్నపేట, జలుమూరు, సారవకోట  

రసన్నపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో సుమారు 400లకు పైగా శ్మశాన వాటికలు ఉన్నాయి. వీటిలో అత్యధిక శాతం రూపురేఖలే కోల్పోయాయి. దీంతో దహన సంస్కారాలకు వెళ్లేందుకు అవస్థలు పడాల్సి వస్తోంది. వర్షాకాలమైతే ఇబ్బందులు అన్నీ ఇన్నీకావు. కనీసం నిలబడేందుకు సైతం స్థలం లేని పరిస్థితి ఉంది. అధికారులు స్పందించి రుద్రభూములను బాగుచేయాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ప్రతి గ్రామంలోనూ వర్గాల వారీగా స్వర్గథామాలు ఉన్నా చాలా చోట్ల ఆక్రమణలకు గురయ్యాయి. చాలా వరకు చెరువు గర్భాల్లో, నదీ తీరాల్లో ఉన్నాయి. పలుమార్లు ప్రజలు ఈ సమస్యలపై అధికారులకు వినతులు ఇచ్చి మొరపెట్టుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు.


సమస్యల నిలయాలు

జలుమూరు మండలంలో 40 పంచాయతీల్లో 102 గ్రామాలున్నాయి. చాలా గ్రామాల్లోని శ్మశానాలు ఆక్రమణల చెరలో ఉన్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీముఖలింగంలో రుద్రభూమి లేదు. కొమనాపల్లి, అంధవరం, పర్లాం, మాకివలస గ్రామాల్లో వంశధార నది గట్టు పైన, రాణాలో వంశధార ఎడమ ప్రధాన కాలువ గట్టును శ్మశాన వాటికగా వినియోగిస్తున్నారు. మండల కేంద్రం జలుమూరులో 15 స్మశాన వాటికలు ఉన్నప్పటికీ సరైన రహదారి సౌకర్యం లేక అవస్థలు తప్పడం లేదు.


కనీస సౌకర్యాలు కరవు

వైకుంఠధామాల్లో ఎక్కడా కనీస సౌకర్యాలు ఉండటం లేదు. దహన సంస్కారాలు నిర్వహించేందుకు, షెడ్‌, భవనం ఉండాలి. ఎక్కడో ఒక చోట దాతలు నిర్మిస్తే తప్ప పాలకులు ఆ ఊసే ఎత్తడం లేదు. సారవకోట మండలంలోని అన్ని గ్రామాలకు శ్మశానాలు ఉన్నప్పటికీ సౌకర్యాలు మాత్రం శూన్యం. కుమ్మరిగుంట, కిడిమి, వెంకంపేట గ్రామాల్లో రహదారి సౌకర్యం లేదు. వర్షం పడితే పొలాల గట్లపై నుంచే రాకపోకలు సాగించవలసి వస్తుంది. కోదడ్డపనస, వాబ, కేజేపురం, నౌతళ, గొర్రెబంద, సారవకోట, బుడితి, అలుదు గ్రామాల్లో పలు సమస్యలు ఉన్నాయి.


మరుభూములు కనుమరుగు

గతంలో ఉర్లాంలో మరుభూమి ఒక ఎకరం విస్తీర్ణంలో ఉండేది. కాలక్రమంలో ఆక్రమణలకు గురై ప్రస్తుతం నాలుగో వంతు మాత్రమే ఉంది. వర్షాలు, ఎండ సమయాల్లో వానకు తడుస్తూ, ఎండకు మాడుతూ దహన సంస్కారాల సమయాల్లో ఇబ్బంది పడవలసి వస్తుందని గ్రామస్థులు వాపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని