logo

చేనేత ఊపిరి తీసిన జగన్‌..!

సంప్రదాయ వస్త్రాలను ఉత్పత్తి చేసే నేతన్నల బతుకు భారంగా మారింది. ఐదేళ్ల పాలనలో జగన్‌ కనీస ప్రోత్సాహం అందించలేదు. చేనేత గ్రామాలుగా పేరుగాంచిన ప్రాంతాల్లో మగ్గం చప్పుడు వినిపించడం లేదు.

Published : 07 May 2024 04:47 IST

మగ్గం బతుకులపై పాలకుల కక్ష  
నూలు, ఇతర రాయితీలకు మంగళం
న్యూస్‌టుడే, సోంపేట

సంప్రదాయ వస్త్రాలను ఉత్పత్తి చేసే నేతన్నల బతుకు భారంగా మారింది. ఐదేళ్ల పాలనలో జగన్‌ కనీస ప్రోత్సాహం అందించలేదు. చేనేత గ్రామాలుగా పేరుగాంచిన ప్రాంతాల్లో మగ్గం చప్పుడు వినిపించడం లేదు. నేతన్నలు వృత్తిని వదిలి భవన నిర్మాణ పనులు, రోజువారీ కూలీలుగా వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఆప్కో ద్వారా కొనుగోళ్లు నిలిచిపోవడం, పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తులు, ప్రభుత్వ అవసరాల కోసం చేనేత వస్త్రాలు కొనుగోలు చేయకపోవడం, చేనేతకు ప్రోత్సాహం అందించకపోవడం, నూలు రాయితీ చెల్లించకపోవడంతో కార్మికులు వలస బాట పట్టారు. సహకార సంఘాలు నిర్వీర్యమవడం, కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌లు మూతపడటంతో జీవనోపాధికి అవస్థలు పడుతున్నారు.

ఊతమివ్వని కామన్‌ ఫెసిలిటీ సెంటర్లు

చేనేత కార్మికుల కోసం గత ప్రభుత్వం రూ.10 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌లు నిరుపయోగంగా మారాయి. సోంపేట, బుడితి, తామరాపల్లి, నరసన్నపేట, తిలారు, అంపోలు, కొత్తపేట, పెనుబాక, కంచరాం, లావేరు, ఎఫ్‌బీపేట, కొప్పర, పొందూరు తదితర 19 ప్రాంతాల్లో ఒక్కో సెంటర్‌ కోసం రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఖర్చు చేసి నిర్మించారు. వస్త్రాల ఉత్పత్తి, మార్కెట్‌, సమావేశాలు, ఇతర అవసరాలకు ఉపయోగపడేలా వసతులు సమకూర్చారు. ఒక్కో కేంద్రంలో 10 నుంచి 20 వరకు మగ్గాలు ఏర్పాటు చేశారు. రాయితీపై నూలు ఇవ్వకపోవడం, ఆప్కో ద్వారా కొనుగోళ్లు లేకపోవడం, ప్రభుత్వ పరంగా వినియోగించే దుస్తులు, ఇతర వస్త్రాలకు ప్రోత్సాహం లేకపోవడంతో ఈ కేంద్రాలు నిరుపయోగంగా ఉన్నాయి.పని కల్పించకపోవడంతో నేత కార్మికులు సెంటర్‌ల వద్దకు రావడం లేదు. మగ్గాలకు చెదలు పడుతున్నాయి. కేంద్రాలు తెరుచుకోకపోవడంతో పరికరాలు దెబ్బతింటున్నాయి.


సొంత మగ్గం ఉంటేనే నేతన్ననేస్తం...

చేనేత కార్మికులకు ప్రభుత్వం అందించే నేతన్న నేస్తం సొంత మగ్గాలు ఉన్నవారికే పరిమితం చేసింది. మూడో వంతు కార్మికులకు మాత్రమే సాయం అందుతోంది. తగిన ప్రోత్సాహం లేకపోవడంతో ఉత్పత్తులు గణనీయంగా తగ్గిపోయాయి. ఆప్కో ద్వారా కొనుగోళ్లు లేకపోవడంతో సొంతంగా మగ్గం నేసే కార్మికులు తగ్గిపోయారు. నేతన్న నేస్తం లబ్ధి కొంతమందికే అందుతోంది. జిల్లాలో ప్రస్తుతం పని చేస్తున్న నేతన్నలలో ఎక్కువ మంది మాస్టర్‌ వీవర్స్‌, వ్యాపారుల షెడ్‌ల వద్ద కూలీలుగా ఉన్నారు.  


ప్రోత్సాహం కరవు

 - కాశిన ప్రసాద్‌, చేనేత సంఘం ప్రతినిధి, అంపోలు

కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌లు తెరవకపోవడం, రాయితీపై నూలు ఇవ్వకపోవడంతో చేనేత రంగానికి ప్రోత్సాహం కరవైంది. ఇంటి వద్ద ఒక మగ్గంపై పని చేయడానికి నలుగురైదుగురు కార్మికులు ఉండాల్సి ఉండగా ఒకరికే నేతన్న నేస్తం పథకం అందుతోంది. ఆరోగ్య బీమా సాయం నిలిచిపోయింది. త్రిఫ్ట్‌ ఫండ్‌ సాయం అందడం లేదు. సహకార సొసైటీలకు రాయితీ ఇవ్వకపోవడంతో చేనేత రంగం కుదేలైంది.   


అందని రాయితీలు

- ఎం.కృష్ణారావు, జాతీయ చేనేత సలహా సంఘం మాజీ సభ్యుడు

గత ప్రభుత్వం చేనేత కార్మికులకు ఏటా రూ.24 వేల వరకు నూలు రాయితీపై అందజేసి వృత్తి పని చేసుకోడానికి ప్రోత్సాహం అందించింది. పింఛను, ఆదరణ పరికరాల పంపిణీ, ఆప్కో కొనుగోళ్లతో పరిశ్రమను నిలబెట్టింది. వైకాపా ఐదేళ్ల పాలనలో బీమా, ఇతర సాయం నిలిపివేశారు. చేనేతపై ఆధారపడి బతికే కుటుంబాలు వలస బాట పట్టాయి. భవన నిర్మాణ కార్మికులు, రోజువారీ కూలీలుగా మారారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని