logo

ఇంటింటిపై జగన్‌ బాదుడు

శ్రీకాకుళం నగరం ఇందిరానగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న విజయ్‌భాస్కర్‌ దంపతులు ప్రైవేటు సంస్థల్లో విధులు నిర్వహిస్తున్నారు. నెలకు రూ.40 వేల వరకు సంపాదిస్తున్నారు. వృద్ధురాలైన తల్లి, కుమార్తెతో కలిసి సొంతింటిలో జీవనం సాగిస్తున్నారు.

Published : 10 May 2024 06:26 IST

ఐదేళ్లలో భారీగా పెరిగిన నిత్యావసర సరకుల ధరలు
కట్టడి చేయడంలో వైకాపా ప్రభుత్వం విఫలం
అదనపు భారంతో సామాన్య కుటుంబాల విలవిల
న్యూస్‌టుడే పాతశ్రీకాకుళం

శ్రీకాకుళం నగరం ఇందిరానగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న విజయ్‌భాస్కర్‌ దంపతులు ప్రైవేటు సంస్థల్లో విధులు నిర్వహిస్తున్నారు. నెలకు రూ.40 వేల వరకు సంపాదిస్తున్నారు. వృద్ధురాలైన తల్లి, కుమార్తెతో కలిసి సొంతింటిలో జీవనం సాగిస్తున్నారు. ఐదేళ్ల కిందట నెలవారీ సామగ్రికి రూ.4,500 ఖర్చు చేయగా ప్రస్తుతం రెట్టింపు అయింది. విద్య, వైద్యానికి చేస్తున్న వ్యయం అదనం. భవిష్యత్తు అవసరాలకు చేయాల్సిన పొదుపు గణనీయంగా తగ్గిపోయిందని ఆ దంపతులు ఆవేదన చెందుతున్నారు.

సగటు జీవి కుదేలు

రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర సరకుల ధరలతో అరకొర ఆదాయంపై ఆధారపడే సగటు జీవి కుదేలవుతున్నాడు. చిరుద్యోగులు, కూలీలు, ఇతర రంగాలపై ఆధారపడిన వారి కుటుంబాలకు పూట గడవడం కష్టంగా మారింది. బియ్యం, వంట నూనెలు, పప్పులు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో బెంబేలెత్తుతున్నారు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో పిల్లలు ఇళ్లలోనే ఉంటున్నారు. వారికోసం చిరుతిళ్లు సిద్ధం చేయాలనుకున్నా ధరల భారంతో చాలామంది తల్లులు వెనకడుగు వేస్తున్నారు. సామాన్యుల కష్టాలు తెలిసినా జగనన్న మాత్రం చిరునవ్వులు చిందిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించానని ప్రగల్భాలు పలుకుతున్నారు.


నియంత్రణ చర్యలు శూన్యం

గత ఐదేళ్లలో నిత్యావసర సరకుల ధరలు రెట్టింపు కావడంతో సాధారణ, మధ్య తరగతి వర్గాలకు చెందిన ఇళ్లల్లో బడ్జెట్ తారుమారవుతోంది. కొనలేని..అలాగని తినకుండా ఉండలేని దుస్థితిని వారంతా ఎదుర్కొంటున్నారు. ధరలపై ఎప్పటికప్పుడు సమీక్షించి నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోలేదు. సరకులు నల్లబజారుకు తరలకుండా పర్యవేక్షించడం, డిమాండ్‌ మేరకు పంటలు పండించేలా రైతుల్ని ప్రోత్సహించడం వంటి కార్యాచరణపై దృష్టి సారించిన దాఖలాలు లేవు. ఎండీయూ వాహనాల ద్వారా పప్పులు, పంచదార, వంటనూనె వంటి సరకులను తక్కువ ధరలకు విక్రయించడం, రైతు బజారులను విస్తృతం చేయడం, పన్నులు తగ్గించడంపై శ్రద్ధ చూపలేదు. ఫలితంగా నెలవారీ ఖర్చులు పెరిగిపోయి ఆర్థికంగా భారమవడంతో సామాన్య ప్రజలు వైకాపా ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


ఆదుకోని రేషన్‌  

తెదేపా హయాంలో రేషన్‌ దుకాణాల్లో రూ.80కు రెండు కిలోల కందిపప్పు పంపిణీ చేశారు. గోధుమలు, పంచదార, వంటనూనె ప్యాకెట్లు నామమాత్ర ధరలకు అందుబాటులో ఉండేవి. ప్రస్తుత ప్రభుత్వం రెండు కిలోల కందిపప్పు రూ.124కు విక్రయించినా కొంతకాలానికే నిలిపివేసింది. పంచదార, వంటనూనె వంటి సరకులను ఇవ్వకుండా కావాలని ప్రజలపై అదనపు భారం మోపుతోందన్న విమర్శలు ఉన్నాయి. ఎండీయూ వాహనాల ద్వారా సరఫరా చేస్తున్న బియ్యం వినియోగానికి తగినట్లు నాణË్యత ఉండటం లేదు. పంపిణీ సమయంలో కార్డుదారులు తీసుకుంటున్నా తరువాత విక్రయిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో బియ్యానికి రూ.50 నుంచి రూ.60 వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు.


కాలం గడిపేసింది..: నిత్యావసర సరకుల ధరల నియంత్రణ బాధ్యత ప్రభుత్వానిదే. పప్పుల నుంచి కూరగాయల వరకు అన్నీ భారంగా మారాయి. పరిస్థితి ఇలా ఉంటే సామాన్య ప్రజలు జీవనం సాగించడం కష్టమే. ధరలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన వైకాపా ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకుండా ఐదేళ్లూ గడిపేసింది.

తమ్మన రమేష్‌, మహాలక్ష్మినగర్‌ కాలనీ, శ్రీకాకుళం

జిల్లాలో గడిచిన ఐదేళ్లలో నిత్యావసరాల ధరలు పెరిగిన తీరు ఇలా..(ధర కేజీకు.. రూ.ల్లో..)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు