logo

ఐటీడీఏను వెళ్లగొట్టారు..!

‘నా ఎస్సీలు..నా ఎస్టీలు..నా బీసీలు’ అంటూ ముఖ్యమంత్రి జగన్‌ ప్రసంగాల్లో ప్రేమ కురిపిస్తారు. వారి అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నట్లు నమ్మిస్తారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ప్రభుత్వం నుంచి కనీస భరోసా దక్కడం లేదు.

Published : 10 May 2024 06:32 IST

గిరిజనులపై ప్రేమ ఇదేనా  జగన్‌?
జిల్లాకు దూరంగా, ఆదివాసీలకు భారంగా..
న్యూస్‌టుడే, కొత్తూరు

‘నా ఎస్సీలు..నా ఎస్టీలు..నా బీసీలు’ అంటూ ముఖ్యమంత్రి జగన్‌ ప్రసంగాల్లో ప్రేమ కురిపిస్తారు. వారి అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నట్లు నమ్మిస్తారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ప్రభుత్వం నుంచి కనీస భరోసా దక్కడం లేదు. జిల్లాలో గిరిజనులు ఎక్కువగా ఉన్నా సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) లేదు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త జిల్లాల ఏర్పాటుతో ఈ పరిస్థితి తలెత్తింది.

మ్మడి శ్రీకాకుళం జిల్లాకు సీతంపేటలో ఐటీడీఏ ఉండేది. ప్రస్తుతం ఆ ప్రాంతం పార్వతీపురం మన్యం జిల్లాలో ఉంది. సిక్కోలు పరిధిలోని గిరిజనులకు అక్కడి నుంచే సేవలందిస్తుండటంతో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మెళియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటుకు గల అవకాశాలను గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పరిశీలించారని సమాచారం. విభాగాల ఏర్పాటుకు ఎంత ఖర్చు అవుతుంది? ఇతర అంశాలపై సమగ్రంగా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది.

అభివృద్ధికి నోచుకోని కొత్తూరు మండలంలోని గిరిజన గ్రామం అడ్డాయిగూడ


ఇదీ పరిస్థితి..

సీతంపేట ఐటీడీఏ పరిధిలో 2011 లెక్కల ప్రకారం 1.6 లక్షల గిరిజన జనాభా ఉంది. ఇందులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారే లక్ష వరకు ఉంటారు. 20 గిరిజన ఉప ప్రణాళిక మండలాలు ఉండగా జిల్లాలో 16 మండలాలు ఉన్నాయి. ట్రైబల్‌ ప్రాజెక్టు మానిటరింగ్‌ యూనిట్లు (టీపీఎంయూ) ఏడు ఉండగా.. ఇక్కడే ఐదు మండలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాకు ప్రత్యేకంగా ఐటీడీఏ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పార్వతీపురం మన్యం జిల్లాలో సీతంపేట, పార్వతీపురంలో ఐటీడీఏలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాకు విడిగా ఐటీడీఏ లేకపోవంతో గిరిజనులు నష్టపోతున్నారు. వైకాపా ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటులో చూపిన చొరవ ఐటీడీఏ విషయంలో కొరవడిందని గిరిజనులు మండిపడుతున్నారు. జిల్లాకు సీతంపేట దూరంగా ఉండటం.. ఐటీడీఏ ఛైర్మన్‌గా వ్యవహరించే కలెక్టర్‌ చేయాల్సిన పనుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంటోంది.  

జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని ఉద్యమిస్తున్న గిరిజనులు


పట్టించుకోని పాలకులు

జిల్లాలో ఇద్దరు మంత్రులు, సభాపతి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నా ఐటీడీఏ ఏర్పాటు విషయమై పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. గిరిజనులకు ఉపయోగపడేలా ఇక్కడ ఐటీడీఏ ఏర్పాటు చేసేలా కృషి చేయడంలో విఫలమయ్యారు. గిరిజన సంఘాలు ఉద్యమించినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు.


కొరవడిన పర్యవేక్షణ

జిల్లా కేంద్రం నుంచి ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉన్నా.. ఐటీడీఏ మండలాల్లో ప్రత్యేకంగా పర్యవేక్షణ విభాగం ఉంటుంది. విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, వెలుగు వంటి పథకాలను ఇక్కడి నుంచే పర్యవేక్షించేవారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతిగృహాలు, గురుకుల పాఠశాలలపై అధికారుల పర్యవేక్షణ తగ్గింది. ఐటీడీఏ ఉప ప్రణాళిక మండలాల్లో ఐటీడీఏ పీవో, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో స్థాయి అధికారులు నిత్యం వైద్యంపై సమీక్షించేవారు. ఇప్పుడు పట్టించుకోవడం లేదు. గిరిజన గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రత్యేకంగా ఈఈ, డీఈఈ, ఏఈలు పర్యవేక్షణలో జరిగేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.  


ఉన్నతాధికారులకు నివేదించాం..
- రోషిరెడ్డి, ఏపీవో, ఐటీడీఏ, సీతంపేట

శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాలి. గిరిజన ప్రజల నుంచి వచ్చిన వినతులపై కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి నివేదించాం. మెళియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటుకు ఉన్నతాధికారులు ఆరా తీశారు. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం.


తక్షణ చర్యలు అవసరం
సవర సురేష్‌, ఆదివాసీ సంఘ జిల్లా నాయకుడు, దొండమానుగూడ

జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటుకు తక్షణం చర్యలు చేపట్టాలి. 16 మండలాలున్న మన్యం జిల్లాకు రెండు ఐటీడీఏలు ఉన్నాయి. 30 మండలాలున్న శ్రీకాకుళం జిల్లాకు ఐటీడీఏ ఏర్పాటు చేయకపోవడం అన్యాయం. ఈ విషయమై వైకాపా పెద్దలు స్పష్టమైన హామీ ఇచ్చి గ్రామాల్లో తిరగాలి. లేకుంటే గిరిజనుల ఆగ్రహానికి గురవుతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు