logo

ప్రాణస్నేహితుల్లా మెలిగాం

డీఎంకేపై వ్యరేతికతతో పార్టీలో చేరిన గణేశమూర్తి ఎంపీ అయ్యారని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో గుర్తు చేశారు. ఆయన కోవై విమానాశ్రయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు.

Published : 29 Mar 2024 01:48 IST

గణేశమూర్తి మృతిపై వైగో కంటతడి

విలేకరులతో మాట్లాడుతున్న వైగో

విల్లివాక్కం, న్యూస్‌టుడే: డీఎంకేపై వ్యరేతికతతో పార్టీలో చేరిన గణేశమూర్తి ఎంపీ అయ్యారని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో గుర్తు చేశారు. ఆయన కోవై విమానాశ్రయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. 50 ఏళ్లుగా ఇద్దరం ప్రాణస్నేహితుల్లా మెలిగామని వైగో చెప్పారు. ఇద్దరి లక్ష్యాలు ఒకటేనన్నారు. గణేశమూర్తి కొద్దిరోజులుగా మనోవేదనలో ఉన్నట్లు ఈరోడ్‌ జిల్లా పార్టీ నిర్వాహకులు తనతో చెప్పారన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తనకు తగిన ప్రాధాన్యం ఇచ్చి రెండుసీట్లు కేటాయించేలా పరిశీలించాలని గణేశమూర్తి కూడా కోరినట్లు గుర్తుచేశారు. ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలియడంతో దిగ్భ్రాంతి చెందానని కంటతడి పెట్టుకున్నారు. ఆయన బలవన్మరణానికి ఎంపీ సీటు ఇవ్వకపోవడం కారణం కాదని చెప్పారు. అనంతరం గణేశమూర్తి కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. మృతదేహాన్ని ఈరోడ్‌లోని పెరుందురై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గణేశమూర్తి స్వగ్రామం కుమరవలసులో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

పలువురి సంతాపం..

చెన్నై, న్యూస్‌టుడే: ఈరోడ్‌ ఎంపీ గణేశమూర్తి మృతికి ముఖ్యమంత్రి స్టాలిన్‌ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ముఖ్యమంత్రి తన సంతాప ప్రకటనలో... గణేశమూర్తి మృతివార్త దిగ్భ్రాంతి, ఆవేదన కలిగించిందని తెలిపారు. రాజకీయ ప్రస్థానాన్ని డీఎంకేలో ప్రారంభించిన ఆయన తర్వాత వైగోతో కలిసి ప్రయాణించారని పేర్కొన్నారు. ఎండీఎంకే కార్యకర్తలు, ద్రావిడ ఉద్యమ సానుభూతిపరులకు, గణేశమూర్తి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెలపెరుంతగై తన ప్రకటనలో.. ఎండీఎంకే ప్రారంభించినప్పటి నుంచి వైగోకు యుద్ధ దళాధిపతి తరహాలో గణేశమూర్తి వెన్నంటే ఉన్నారని తెలిపారు. ఈరోడు అభివృద్ధికి అండగా ఉన్నారని పేర్కొన్నారు. ఆయన మృతి బాధాకరమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని