logo

సొంత ఊరు.. సత్తా చాటేదెవరు?

లోక్‌సభ ఎన్నికలు అగ్రనేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ప్రతి పార్లమెంటు స్థానంలో గెలుపే అత్యంత కీలకంగా ప్రచారాలు సాగుతున్నాయి.

Published : 06 Apr 2024 00:53 IST

అగ్రపార్టీల నేతలకు సవాల్‌

 లోక్‌సభ ఎన్నికలు అగ్రనేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ప్రతి పార్లమెంటు స్థానంలో గెలుపే అత్యంత కీలకంగా ప్రచారాలు సాగుతున్నాయి. రాష్ట్రంలో ప్రధానంగా మూడు కూటమి పార్టీలు, ఎన్టీకేతో కలిపి చతుర్ముఖ పోరు నడుస్తోందనే చెప్పాలి. ఆయా పార్టీల అధినేతలు పుట్టిన సొంత నియోజకవర్గాల్లో ఎదురీదే పరిస్థితి కనిపిస్తోంది.

ఈనాడు-చెన్నై


ఓటెవరికెళ్తుందో..?

పేరు: ఎం.కె.స్టాలిన్‌
పార్టీ: డీఎంకే
హోదా: రాష్ట్ర ముఖ్యమంత్రి
జన్మస్థలం: మద్రాస్‌(చెన్నై)
పార్లమెంటు స్థానం:

చెన్నై 3 నియోజకవర్గాలుస్టాలిన్‌ సొంత నగరం చెన్నై మాత్రం ఆయనకు కొంత కంగారు పుట్టిస్తోందనే చెప్పాలి. ప్రత్యేకించి లోక్‌సభ ఎన్నికల్లో ఫలితాలు తారుమారవుతూ వస్తుండటమే అందుకు కారణం. ఇక్కడి ప్రజలు విలక్షణ తీర్పులిస్తూ వస్తున్నారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర, మధ్య చెన్నైలు డీఎంకే ఖాతాలోకి వచ్చినా దక్షిణ చెన్నై అన్నాడీఎంకే ఖాతాలోకి వెళ్లిపోయింది. ఈ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి సి.రాజేంద్రన్‌ 32,935 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014 ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. నగరంలో డీఎంకే ఒక్క సీటూ గెలవలేకపోయింది. 3 పార్లమెంటు స్థానాల్లో అన్నాడీఎంకే అభ్యర్థులు టి.జి.వెంకటేశ్‌బాబు(ఉత్తర), జె.జయవర్ధన్‌(దక్షిణ), ఎస్‌.ఆర్‌.విజయకుమార్‌(మధ్య) తిరుగులేని విజయాలు సొంతం చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో మాత్రం డీఎంకే పాగా వేసింది. దయానిధిమారన్‌ (మధ్య), కళానిధి వీరసామి(ఉత్తర), తమిళచ్చి తంగపాండియన్‌(దక్షిణ) భారీ మెజారిటీలతో గెలిచారు. ఈ భరోసాతోనే మళ్లీ వారినే ఆయా నియోజకవర్గాల్లో బరిలో ఉంచారు ముఖ్యమంత్రి స్టాలిన్‌. వారికి పోటీగా భాజపా, అన్నాడీఎంకే గట్టి అభ్యర్థులనే ఎంచుకుంది. ఈసారి ఓటర్లు ఎలా మొగ్గుచూపుతారనేది ఆసక్తిగా ఉంది. స్టాలిన్‌ తన ప్రచారాన్ని కూడా ఎన్నికల తేదీకి దగ్గరగా పెట్టుకోవడం కూడా ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు చేసినట్లుగా కనిపిస్తోంది.


పూర్వస్థితికి.. ఆరాటం

పేరు: ఎడప్పాడి పళనిసామి
పార్టీ: అన్నాడీఎంకే
హోదా: పార్టీ ప్రధాన కార్యదర్శి
జన్మస్థలం: శిలువంపాళయం
పార్లమెంటు స్థానం: సేలం

2009 ఎన్నికల్లో అన్నాడీఎంకే నుంచి ఎస్‌.సెమ్మెలై 46,491 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014లోనూ భారీ విజయం ఆ పార్టీ సొంతమైంది. వి.పన్నీరుసెల్వం 2,67,610 ఓట్ల భారీ మెజారిటీని మూటగట్టుకున్నారు. 2019 ఎన్నికలకు వచ్చేసరికి అంతా తారుమారైంది. అన్నాడీఎంకే చిత్తుగా ఓడిపోయింది. డీఎంకే రికార్డుస్థాయి గెలుపు సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి ఎస్‌.ఆర్‌.పార్తిబన్‌ 1,46,926 ఓట్ల మెజారిటీతో అక్కడ పాగా వేశారు. ఈ ఫలితాలు ఎడప్పాడి పళనిసామిని ఓ రకంగా కలవరానికి గురిచేశాయనే చెప్పాలి. ఈసారి ఇక్కడ పట్టుకోసం ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సొంత నియోజకవర్గంలో తరచూ మకాం వేస్తూ పార్టీని బలపరిచే కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రస్తుతం బరిలో పి.విఘ్నేష్‌ను పార్టీ తరపున ఉంచారు. గత ఎన్నికల్లో దక్కిన ఓట్లు చూస్తే.. డీఎంకే కన్నా 12శాతం ఓట్లు తక్కువగా ఉన్నాయి. ఆయన పూర్వస్థితిని రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.


ఓటు బ్యాంకు లేదు

పేరు: సీమాన్‌ పార్టీ: ఎన్టీకే
హోదా: పార్టీ చీఫ్‌ కోఆర్డినేటర్‌
జన్మస్థలం: అరణైయూర్‌
పార్లమెంటు స్థానం: శివగంగై

2009లో కాంగ్రెస్‌ నుంచి పి.చిదంబరం స్వల్ప మెజారిటీతో (3,354) అన్నాడీఎంకే అభ్యర్థి ఆర్‌.ఎస్‌.రాజకన్నప్పన్‌పై గెలిచారు. అప్పట్లో అన్నాడీఎంకే ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు పెద్దఎత్తునే పోటీపడింది. వారి ప్రయత్నం 2014 ఎన్నికల్లో ఫలించింది. పార్టీ అభ్యర్థి పి.ఆర్‌.సెంథినాథన్‌ భారీ మెజారిటీతో ఈ నియోజకవర్గాన్ని కానుకగా ఇచ్చారు. డీఎంకే అభ్యర్థి దురైరాజ్‌ శుభపై 2,29,385 ఓట్ల తేడాతో గెలిచారు. ఈ ఎన్నికను మించి 2019లో ప్రజలు తీర్పు ఇచ్చారు. డీఎంకే బలపరిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి పి.చిదంబరం తనయుడు కార్తి పి.చిదంబరం అఖండ మెజారిటీతో వార్తలకెక్కారు. 3,32,244 ఓట్ల మెజారిటీ కైవసం చేసుకున్నారు. గత ఎన్నికల్లో ఎన్టీకే నుంచి వి.శక్తిప్రియను బరిలో ఉంచినా.. కేవలం 6.68శాతం ఓట్లే వచ్చాయి. ఈసారి కూడా ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు.


బలం అంతంతే..

పేరు: కె.అన్నామలై
పార్టీ: భాజపా
హోదా: పార్టీ రాష్ట్ర అధ్యక్షులు
జన్మస్థలం: కరిసలూర్‌ గ్రామం
పార్లమెంటు స్థానం: తెన్‌కాశి

అన్నామలై సొంత పార్లమెంటు నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్‌కు కేటాయించారు. ఇక్కడ వామపక్ష పార్టీలు బలంగా ఉన్నాయి. 2009లో సీపీఐ అభ్యర్థి పి.లింగం 34,677 ఓట్ల మెజారిటీతో సమీప కాంగ్రెస్‌ అభ్యర్థిపై గెలిచారు. అన్నాడీఎంకే మద్దతుతో సీపీఐ గెలుపుబావుటా ఎగురవేసింది. 2014లో ఈ స్థానంలో అన్నాడీఎంకే స్వయంగా పోటీకి దిగింది. ఎం.వాసంతి 1,61,774 ఓట్ల భారీ మెజారిటీతో నియోజకవర్గాన్ని కానుకగా ఇచ్చారు. ఈమెకు ప్రత్యర్థిగా పుదియ తమిళగం(పీటీ) పార్టీ అధినేత కె.కృష్ణసామి ఉన్నారు. 2019లో అన్నాడీఎంకే తలకిందులైంది. ఈ స్థానంలో డీఎంకే పాగా వేసింది. ఆ పార్టీ అభ్యర్థి ధనుష్‌ ఎం.కుమార్‌ 1,20,286ఓట్ల మెజారిటీ సాధించారు. ఈసారి కూడా ప్రత్యర్థి కె.కృష్ణసామినే. ఇప్పుడు పీటీ పార్టీ భాజపాతో పొత్తులో ఉంది. దీంతో లాభపడాలని అన్నామలై ఎత్తులు వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో భాజపా, అన్నాడీఎంకే బలపరిచిన కృష్ణసామికి 33.67శాతం ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడీ స్థానంలో భాజపా నేరుగా పోటీ చేస్తోంది. తమ అభ్యర్థిగా బి.జాన్‌ పాండియన్‌ను అనూహ్యంగా రంగంలోకి దించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని