logo

మా బాధ్యత నెరవేర్చాం.. మరి మీరు!

సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి తమ ప్రజాస్వామ్య బాధ్యతను నెరవేర్చడానికి సినీ తారలు పోలింగ్‌ బూత్‌లకు తరలివచ్చారు. క్యూలో నిలబడి తమ వంతురాగానే ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Updated : 20 Apr 2024 05:21 IST

సినీ, రాజకీయ ప్రముఖుల అవగాహన
కుటుంబీకులతో కలిసి వచ్చి ఓటు నమోదు

సైకిల్‌పై వస్తున్న విశాల్‌

చెన్నై, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి తమ ప్రజాస్వామ్య బాధ్యతను నెరవేర్చడానికి సినీ తారలు పోలింగ్‌ బూత్‌లకు తరలివచ్చారు. క్యూలో నిలబడి తమ వంతురాగానే ఓటు హక్కు వినియోగించుకున్నారు. తారల రాకతో పోలింగ్‌ బూత్‌లలో సందడి నెలకొంది. పోయెస్‌ గార్డెన్‌ ప్రాంతంలోని స్టెల్టా మేరిస్‌ కళాశాల పోలింగ్‌ బూత్‌లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఓటు వేశారు. తేనాంపేట ఎల్డామ్స్‌ రోడ్డులోని ప్రభుత్వ పాఠశాల పోలింగ్‌ బూత్‌లో నటుడు, మక్కళ్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌, బెసెంట్‌నగర్‌లోని పోలింగ్‌ బూత్‌లో నటుడు విక్రమ్‌ ఓటు వేశారు.



తొలి వ్యక్తిగా అజిత్‌

ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో దానికి సుమారు అరగంట ముందే నటుడు అజిత్‌కుమార్‌ తిరువాన్మియూర్‌లోని భారతిదాసన్‌ వీధిలో ఉన్న చెన్నై మహోన్నత పాఠశాల పోలింగ్‌ బూత్‌కు చేరుకున్నారు. అరగంట నిరీక్షించి పోలింగ్‌ ప్రారంభమైన వెంటనే తొలి వ్యక్తిగా ఓటు వేశారు. 2021 శాసనసభ ఎన్నికల్లోనూ పోలింగ్‌ ప్రారంభంకావడానికి అరగంట ముందే బూత్‌కు రావడం గమనార్హం. సీనియర్‌ నటుడు శివకుమార్‌, ఆయన తనయులైన నటులు సూర్య, కార్తి కుటుంబ సభ్యులతో త్యాగరాయ నగర్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు. సూర్య సతీమణియైన నటి జ్యోతిక రాలేదు. ఆమె నేపాల్‌ పర్యటనలో ఉన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. అన్నానగర్‌లోని పోలింగ్‌ బూత్‌లో విశాల్‌ ఓటు వేశారు. నల్ల టీషర్టు ధరించి సైకిల్‌పై ఆయన బూత్‌కు వెళ్లిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. నటుడు ప్రభు కూడా తన కుటుంబ సభ్యులతో త్యాగరాయ నగర్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు. టీటీకే రోడ్డులోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ జేవియర్‌ మాధ్యమిక పాఠశాల పోలింగ్‌ బూత్‌లో ధనుష్‌, వళసరవాక్కంలోని గుడ్‌ షెప్పర్డ్‌ మెట్రిక్యులేషన్‌ ఉన్నత పాఠశాల పోలింగ్‌ బూత్‌లో శివకార్తికేయన్‌, ఆయన సతీమణి ఆర్తి, పద్మ శేషాద్రి బాలభవన్‌ మహోన్నత పాఠశాల పోలింగ్‌ బూత్‌లో ఆనందరాజ్‌, ఆయన కుటుంబ సభ్యులు, వళసరవాక్కం ప్రభుత్వ మహోన్నత పాఠశాల పోలింగ్‌ బూత్‌లో హాస్యనటుడు యోగిబాబు, ఆయన సతీమణి మంజు భార్గవి, కీళ్పాక్కంలో విజయ్‌ సేతుపతి, విరుగంబాక్కంలో దర్శకుడు వెట్రిమారన్‌, త్యాగరాయ నగర్‌లోని రామకృష్ణ నర్సరీ పాఠశాల పోలింగ్‌ బూత్‌లో సంగీత దర్శకుడు ఇళయరాజా ఓటు వేశారు.

  • చెన్నై టీటీకే రోడ్డులోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ జేవియర్‌ మాధ్యమిక పాఠశాల పోలింగ్‌ బూత్‌లో నటి త్రిష ఎప్పటిలాగే తన తల్లితో కలిసి వచ్చి ఓటు వేశారు. పమ్మల్‌లోని అన్నై వేళంకణ్ణి మెట్రిక్యులేషన్‌ పాఠశాలలో నటి రమ్యా పాండియన్‌ ఓటు వేశారు.
  • చెన్నై: బిహార్‌లోని తన ఓటును దక్షిణ చెన్నై నియోజకవర్గానికి మార్చుకున్న గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి శుక్రవారం వేళచ్చేరిలోని పోలింగ్‌ బూత్‌లో తన సతీమణి లక్ష్మితో కలిసి ఓటు వేశారు. ప్రజాస్వామ్య అతిపెద్ద పండగలో పాల్గొన్నందుకు సంతోషిస్తున్నానని, గర్విస్తున్నానని తన ఎక్స్‌ పేజీలో ఆయన వెల్లడించారు. తేనాంపేటలోని ఎస్‌ఐఈటీ మహిళా కళాశాలల పోలింగ్‌ బూత్‌లో ముఖ్యమంత్రి స్టాలిన్‌, ఆయన సతీమణి దుర్గా స్టాలిన్‌ క్యూలో నిలబడి ఓటు వేశారు. ఈ సందర్భంగా విలేకర్లతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... తన ఓటుహక్కుకు సంబంధించిన ప్రజాస్వామ్య బాధ్యతను నెరవేర్చానన్నారు. ‘ఇండియా’ కూటమికి గెలుపు తథ్యమని తెలిపారు. ఇదే బూత్‌లో ఆయన తనయుడైన మంత్రి ఉదయనిధి తన సతీమణి కిరుత్తికతో కలిసి ఓటు వేశారు. అన్నానగర్‌ జోన్‌లోని వళ్లియమ్మాళ్‌ మహోన్నత పాఠశాల పోలింగ్‌ బూత్‌లో స్థానిక స్వపరిపాలన, జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి కార్తికేయన్‌, ఆయన సతీమణి ఓటు వేశారు. జిల్లా ఎన్నికల అధికారియైన మహనగర చెన్నై కార్పొరేషన్‌ కమిషనరు డాక్టర్‌ రాధాకృష్ణన్‌ తిరువాన్మియూర్‌లోని భారతిదాసన్‌ రోడ్డులో ఉన్న పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఒకట్రెండు చోట్ల ఈవీయంలు మొరాయించగా వాటిని వెంటనే సరిదిద్దారన్నారు. కంట్రోల్‌ రూమ్‌ నుంచి 65 సమస్యాత్మక పోలింగ్‌ బూత్‌లను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఎన్నికల విధుల్లో పాల్గొన్న 18 వేల మంది సిబ్బందిలో సుమారు 11 వేల మంది మహిళలేనన్నారు. మైలాపూర్‌లోని పోలింగ్‌ బూత్‌లో డీఎంకే ఉప ప్రధానకార్యదర్శి, తూత్తుకుడి అభ్యర్థి కనిమొళి తన తల్లి రాజాత్తి అమ్మాళ్‌తో వచ్చి ఓటు వేశారు. తమిళనాడు, పుదుచ్చేరిలోని 40 నియోజకవర్గాల్లోనూ ‘ఇండియా’ కూటమికి ఘనవిజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సాలిగ్రామంలోని పోలింగ్‌ బూత్‌లో డీఎండీకే ప్రధానకార్యదర్శి ప్రేమలత, ఆమె కుమారుడైన విరుదునగర్‌ అభ్యర్థి విజయప్రభాకరన్‌, మరో కుమారుడైన నటుడు షణ్ముగ పాండియన్‌ ఓటు వేశారు. తొలిసారి తండ్రి లేకుండా బూత్‌కు వచ్చి ఓటు వేస్తున్నానని విజయ ప్రభాకరన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

నిరాశ చెందిన సూరి

ఓటరు జాబితాలో పేరు లేకపోవడంతో నటుడు సూరి నిరాశ చెందారు. దీని గురించి తన ఎక్స్‌ పేజీలో.. బూత్‌కు వెళ్లగా ఓటరు జాబితాలో తన భార్య పేరు ఉందని, తన పేరు గల్లంతయ్యిందని తెలిపారు. ప్రజాస్వామ్య బాధ్యత నెరవేర్చడానికి వచ్చినా ఓటు వేయడానికి సాధ్యపడకపోవడం మనోవేదన కలిగించిందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని