logo

వృథా నీటితో ఆదాయం

కార్బన్‌ జీరో ఛాలెంజ్‌(సీజడ్‌సీ) పాన్‌ ఇండియన్‌ కార్యక్రమం గురువారం ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్‌(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్‌మెంట్’ పేరిట జరిగింది.

Updated : 26 Apr 2024 05:07 IST

ఐఐటీఎంలో సీజడ్‌సీ 4.0

25 మంది బృందంతో ఆచార్యులు ఇందుమతినంబి తదితరులు

వడపళని, న్యూస్‌టుడే: కార్బన్‌ జీరో ఛాలెంజ్‌(సీజడ్‌సీ) పాన్‌ ఇండియన్‌ కార్యక్రమం గురువారం ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్‌(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్‌మెంట్’ పేరిట జరిగింది. టాప్‌ 25 బృందాల పేర్లను ఐఐటీ ప్రకటించింది. జనవరిలో సీజడ్‌సీ లాంఛనంగా ప్రారంభమైంది. 13 స్టార్టప్స్‌, 42 మంది పరిశోధకులు, 8 మంది అధ్యాపకులు ఎంట్రప్రెన్యూర్‌లుగా అయ్యేందుకు సీజడ్‌సీ ప్రత్యేక చొరవ తీసుకుంది. 25 బృందాల్లో ప్రారంభదశలో ఉన్న స్టార్టప్స్‌, అధ్యాపకులు, పరిశోధకులు.. నీరు, వృథా నీటి ద్వారా ఆదాయం సమకూర్చుకోవడానికి మార్గాలు, పునరుత్పాదక విద్యుత్తు, వ్యర్థాల నిర్వహణవంటివి ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. ఈ బృందానికి ఆరు నెలల శిక్షణతో పాటు వారి శక్తి సామర్థ్యాలను వెలికి తీసుకొచ్చేందుకు రూ.5 లక్షల ఆర్థిక సహకారం అందనుంది. ఇందుకు ఫ్రెంచి మల్టీ నేషనల్‌ సంస్థ థేల్స్‌, ఐఐటీఎంలోని ఆక్వామాప్‌ సెంటర్‌ ఫర్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్ సహకరించనున్నాయి.

ప్రసంగిస్తున్న ఏఆర్‌ రాహుల్‌నాథ్‌

850 దరఖాస్తులు

తాజాగా విడుదలైన సీజడ్‌సీ 4.0 ఎడిషన్‌కు 850 దరఖాస్తులందాయి. 25 రాష్ట్రాలు, 25 బృందాలు రాసిన పరిశోధనలను 50 మంది నిపుణులు పరిశీలించారు. స్థిరత్వం కలిగిన పరిశోధనలకు సీజడ్‌సీ 4.0 అనేది థీమ్‌లా ఉంటుందని ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పర్యావరణ, వాతావరణ మార్పుల విభాగ డైరెక్టరు ఏఆర్‌ రాహుల్‌నాథ్‌ అన్నారు. పరిశోధకులు పర్యావరణం, వాతావరణంలో మార్పుల కోసం చేస్తున్న కృషిని అభినందించారు. అనంతరం ఐఐటీ డైరెక్టరు, ఆచార్యులు వి.కామకోటి మాట్లాడుతూ ఐఐటీఎంలో వందశాతం నీటిని శుద్ధి చేస్తున్నామన్నారు. సస్టెయినబులిటీ(స్థిరత్వం) అనేది అన్ని రంగాలకు ఎంతో అవసరమని చెప్పారు. ఐఐటీఎంలోని స్కూల్‌ ఆఫ్‌ సస్టెయినబులిటీలో 80మందికిపైగా అధ్యాపకులు, వంద మంది విద్యార్థులున్నారని, వారంతా నీటి కోసం పబ్లిక్‌ పాలసీ, పునరుత్పాదక విద్యుత్తు, బ్యాటరీ విధానం, విద్యుత్తు వాహనాలు వంటి వాటిపై పని చేస్తున్నారని చెప్పారు. పరిశోధనల ద్వారా కొత్త స్టార్టప్స్‌లను మార్కెట్‌లోకి తీసుకురావాలన్నదే లక్ష్యంగా ఉందని కామకోటి అన్నారు. సీజడ్‌సీ కో-ఆర్డినేటర్‌, ఆచార్యులు, ప్రిన్సిపల్‌ ఇందుమతి నంబి, స్కూల్‌ ఆఫ్‌ సస్టెయినబులిటీ అసోసియేట్ ఫ్యాకల్టీ, ఆచార్యులు రజనీష్‌కుమార్‌ తదితరులు ప్రసంగించారు.

వి.కామకోటి

ఎంపికైన బృందాలివి..

ఐఐటీ కార్బన్‌ ఎయిర్‌ పరిశోధక బృందం, నోయిడా అమిటీ వర్సిటీ జి.ఎల్‌ఈడీ పరిశోధకులు, యోటహ్‌ ఎనర్జీ ఎర్లీ స్టేజ్‌ స్టార్టప్స్‌ యోటహ్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఐఐటీ ప్రవాహన్‌ విద్యార్థులు, బెంగళూరు ప్రీయిన్‌క్యుబాటెడ్‌ ఎర్లీ స్టేజి స్టార్టప్స్‌ క్విక్‌హిల్‌ తదితర 25 బృందాలను ఎంపిక చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని