logo

కాలుష్యం.. కాస్త నయం!

వాహనాలు, పరిశ్రమలు, అభివృద్ధి పనులు.. నగరవ్యాప్తంగా కాలుష్య కారకాలుగా మారుతున్నాయి. ఈ ఇక్కట్లు చెన్నై వాసులు నిత్యం అనుభవిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇతర నగరాలతో పోల్చి చూస్తే చెన్నై కొంత నయమన్నట్లుగానే ఉందనే భావన కలుగుతోంది.

Published : 06 May 2024 06:51 IST

కొన్నేళ్లుగా తక్కువ స్థాయిలోనే నమోదు
అంతర్జాతీయ ప్రమాణాలు అందుకోవడంలో ఇబ్బందులు
నగర ప్రజల్లో తగ్గని ఆందోళన

వాహనాలు, పరిశ్రమలు, అభివృద్ధి పనులు.. నగరవ్యాప్తంగా కాలుష్య కారకాలుగా మారుతున్నాయి. ఈ ఇక్కట్లు చెన్నై వాసులు నిత్యం అనుభవిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇతర నగరాలతో పోల్చి చూస్తే చెన్నై కొంత నయమన్నట్లుగానే ఉందనే భావన కలుగుతోంది. ఈ విషయం కాస్త ఉపశమనం ఇస్తున్నా.. ఆరోగ్యపరంగా ప్రజల ప్రాణాలు ప్రధానం కాబట్టి.. ప్రమాణాలకు లోబడే ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈనాడు-చెన్నై: చెన్నై నగరం దిల్లీతో పోల్చుకుంటే సుమారు 5రెట్లు మేలుగా కనిపిస్తోంది. అక్కడికంటే ఇక్కడ కాలుష్య కారకాల తీవ్రత బాగా తక్కువగా ఉన్నట్లు నివేదికలు వెల్లడవుతున్నాయి. 2023లో దిల్లీలో సగటు పీఎం 2.5 రేణువుల తీవ్రత మైక్రోగ్రాముకు 102.1 క్యూబిక్‌మీటర్‌గా ఉండగా, చెన్నైలో మాత్రం ఇది కేవలం 28గా మాత్రమే ఉంది. తద్వారా సహజమైన గాలి ప్రమాణం ఇక్కడ బాగున్నట్లు తెలుస్తోంది. మరో పరిశీలన ప్రకారం.. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో పోల్చితే చెన్నై పర్వాలేదనే భావన కలుగుతోంది. గత ఆరేళ్ల సగటు కాలుష్యం లెక్కకడితే.. దిల్లీ, కోల్‌కతా, ముంబయి, హైదరాబాద్‌, బెంగళూరుతో పోల్చితే చెన్నైలో తక్కువ కాలుష్యం నమోదవుతూ వస్తోంది. ఇది ఇక్కడి నగర ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగించే అంశంగా మారింది.

ఇక్కడ తక్కువెందుకు..

ఇతర మెట్రో నగరాల్లోని తీవ్రతతో పోల్చితే చెన్నైలో ఎందుకు తక్కువగా ఉందనే విషయమై పర్యావరణ నిపుణులు పరిశీలనలు చేశారు. ఇక్కడి నైసర్గిక స్వరూపం కారణంగా కాలుష్యం గాలిలో కొట్టుకుపోతోందని, ఇతరత్రా మార్గాల్లో కనుమరుగవుతోందని అంటున్నారు. ప్రత్యేకించి ఈశాన్య రుతుపవనాల సమయంలో గాలులు ఇక్కడి కాలుష్యాన్ని నైరుతి దిశగా తీసుకెళ్తున్నాయి. పైగా అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య కురిసే వర్షాలతో కాలుష్య కారకాలన్నీ నేలపాలవుతున్నాయి. ఫలితంగా గాలిలో పీఎం 2.5 కారకాలుగా తక్కువగా కనిపిస్తున్నాయని అన్నా యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఇతర మెట్రో నగరాలతో పోల్చితే ఇక్కడ వాహనాల ట్రాఫిక్‌ తక్కువని ఐఐటీ మద్రాస్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఫలితంగా తక్కువ కాలుష్యమే వెలువడుతోందని వివరిస్తున్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఎక్కువ వస్తోందని, మిగిలిన ఏడాదంతా ఫర్వాలేదన్నట్లుగా ఫలితాలున్నాయని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెబుతున్నారు. ఇక్కడితే ఆనందించాల్సిన అవసరంలేదని, మరింత తగ్గాల్సి ఉందని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఎంతో శ్రమించాలి

పీఎం10 కాలుష్య కారకాలతో పోల్చితే పీఎం 2.5 కారకాలు సూక్ష్మంగా ఉంటాయి. ఇవే దీర్ఘకాలిక వ్యాధులకు కారణమయ్యే అవకాశముంది. మరోవైపు కాలుష్యాన్ని అనుసరించి అప్పటికప్పుడు ఇతరత్రా శ్వాస, చర్మ, ఇతర సమస్యలు రావొచ్చు. ఈ కారకాలు ఊపిరితిత్తుల్లో, రక్తంలోకి అవలీలగా వెళ్తాయి. ఫలితంగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తరచూ వాటి స్థాయిలపై హెచ్చరికలు చేస్తూ ఉంటుంది. ఏడాది సగటు మైక్రోగ్రాముకు 40 క్యూబిక్‌ మీటర్‌ మించకూడదని చెబుతూ ఉంటారు. దీనికి లోబడే ప్రభుత్వ, ప్రైవేటు యంత్రాంగాల ఏర్పాట్లు ఉండాలని చెబుతుంటారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఏటా 5కు మించకుంటే అత్యంత సురక్షితం అంటున్నారు. దీన్ని సాధించాలంటే నగరాలు ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఇందుకు కసరత్తు జరుగుతోంది.

కాగ్‌.. ఓ పరిశీలన

సిటిజెన్‌ కన్జ్యూమర్‌ అండ్‌ సివిక్‌ యాక్షన్‌ గ్రూప్‌(కాగ్‌) నగరంలో వినూత్న పరిశీలన చేసింది. కాలుష్యకారకాలు మనిషిని తీవ్ర అసహనానికి గురిచేస్తాయని, మానసిక ప్రవర్తనపై ప్రభావం చూపుతాయని జనాల్లో అపోహ ఉండటంతో.. వాటిని నివృత్తి చేసేందుకు.. నగరానికి సంబంధించి గత 25ఏళ్ల పాటూ ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో కాలుష్యాలు, అక్కడ నమోదవుతున్న నేరాల్ని పోల్చుతూ పరిశీలన చేసింది. ఫలితాల్ని బట్టి.. ఎక్కడా నేరాలకు, కాలుష్యానికి పొంతనే లేదని స్పష్టత ఇచ్చారు. మరోపక్క నగరంలో కాలుష్య పరిస్థితుల్ని వివరించింది. గత 5ఏళ్ల నుంచి నైట్రోజన్‌ డయాక్సైడ్‌ కారకాలు పెరుగుతున్నాయని, దీనిపై అధికారులు అప్రమత్తమవ్వాలని హెచ్చరించారు. కీల్పాక్కం, మనలి, నుంగంబాక్కం, టీనగర్‌ ప్రాంతాల్లో పీఎం10 కారకాలు పెరుగుతున్నాయని అప్రమత్తం చేస్తోంది. గాలి కాలుష్యాన్ని కొలిచేందుకు మరిన్ని యంత్రాలు నగరంలో అవసరమని గుర్తుచేసింది. ప్రజల ఆరోగ్యం ఇబ్బందుల పాలయ్యే పరిస్థితులు ఇక్కడున్నట్లు వివరించారు. యంత్రాంగం అప్రమత్తవ్వాలని కాగ్‌ చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని