logo

అర్ధరాత్రి నుంచి అమల్లోకి ఈ-పాస్‌ విధానం

పాఠశాలలకు వేసవి సెలవులు కావడం, ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో రాష్ట్రంలోని ప్రముఖ చల్లని పర్యాటక ప్రాంతాలైన ఊటీ, కొడైకెనాల్‌కు పర్యాటకులు వరుసకట్టారు.

Published : 08 May 2024 00:11 IST

నీలగిరి చెక్‌పోస్టులో ఈ-పాస్‌లు పరిశీలిస్తున్న రెవెన్యూ సిబ్బంది

విల్లివాక్కం, ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: పాఠశాలలకు వేసవి సెలవులు కావడం, ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో రాష్ట్రంలోని ప్రముఖ చల్లని పర్యాటక ప్రాంతాలైన ఊటీ, కొడైకెనాల్‌కు పర్యాటకులు వరుసకట్టారు. ఏటా ఏప్రిల్‌, మే నెలల్లో పర్యాటకుల రద్దీ ఉంటుంది. వారి వాహనాలతో ట్రాఫిక్‌ సమస్య అధికంగా ఉంటుంది. అంతే కాకుండా వసతి గృహాలు, మరుగుదొడ్ల సౌకర్యాల లేమితో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యల పరిష్కారానికి ఈ ఏడాది జిల్లా యంత్రాంగం 7వ తేదీ నుంచి జూన్‌ 30 వరకు ఊటీ, కొడైకెనాల్‌కు వచ్చేవారికి ‘ఈ-పాస్‌’ తప్పనిసరి చేసింది. అందుకుగాను మార్గదర్శకాలు కూడా విడుదల చేశారు.

కొడైకెనాల్‌ చెక్‌పోస్టులో..

ఆ మేరకు మంగళవారం ‘ఈ-పాస్‌’ విధానం అమల్లోకి వచ్చింది. బయటి ప్రాంతాల నుంచి నీలగిరి వస్తున్న వాహనాలకు ‘ఈ-పాస్‌’ ఉంటేనే అనుమతిస్తున్నారు. జిల్లా సరిహద్దు కల్లార్‌ చెక్‌పోస్టులో జిల్లా రెవెన్యూ అధికారులు మంగళవారం ఉదయం 6 గంటల నుంచే తనిఖీలు మొదలుపెట్టారు. జిల్లా సరిహద్దులోని 12 ప్రాంతాలలో ఈ తనిఖీలు చేపడుతున్నారు. పర్యాటకులు www.tnega.tn.gov.in  అనే వెబ్‌సైట్‌లో ‘ఈ-పాస్‌’కు దరఖాస్తు చేసుకోవచ్చు. మంగళవారం మొత్తం 21,446 వాహనాలకు ఈ-పాస్‌ ఇచ్చారు. పాస్‌ లేకుండా వచ్చిన వాహనాలను నీలగిరి జిల్లా సరిహద్దుల్లో అధికారులు తిప్పి పంపుతున్నారు. ఒకేసారి చాలామంది పాస్‌లు పొందేందుకు వెబ్‌సైట్‌లోకి వెళ్లడంతో సాంకేతిక సమస్య తలెత్తుతోంది. అదేవిధంగా స్థానిక వాహనదారులు పాస్‌ పొందడానికి ఇబ్బంది పడుతున్నారు. దిండుక్కల్‌ జిల్లా కలెక్టర్‌ పూంగుడి మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో... ఈ-పాస్‌కు సంబంధించి సందేహాలకు, స్థానిక వాహనదారులు లోకల్‌ ఈ-పాస్‌ పొందడంలో తలెత్తే సందేహాలను 0451 2900233, 94422 55737 అనే ఫోన్‌ నెంబర్లపై సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు