logo
Published : 28/11/2021 05:00 IST

అప్పుచేసి పప్పుకూడు

వసతిగృహాలకు ఏడు నెలలుగా అందని డైట్‌ బిల్లులు
ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం

సంక్షేమశాఖల వసతిగృహాలకు చెల్లించాల్సిన డైట్‌ బిల్లుల బకాయిలు పేరుకుపోయాయి. ఈ ఏడాది వసతిగృహాలు తెరిచిన తరువాత నుంచి ఇప్పటి వరకు ఒక్క నెల బిల్లు కూడా మంజూరు కాలేదు. గత విద్యా సంవత్సరంలో రెండు నెలలు బిల్లులు అందాల్సి ఉంది.

వసతిగృహ సంరక్షకులు అప్పులు చేయలేక, విద్యార్ధులకు భోజనాలు పెట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నిత్యావసరాలు, కూరగాయలు, గుడ్లు, మాంసం వ్యాపారులు కూడా బకాయిలు చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తున్నారు.   దీంతో అధిక వడ్డీలకు అప్పులు చేసి వసతిగృహాలను నిర్వహించాల్సి వస్తోందని సంక్షేమాధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బకాయిలు.. రూ.కోట్లలో
జిల్లావ్యాప్తంగా సాంఘిక సంక్షేమ శాఖకు 32 ప్రీమెట్రిక్‌, 23 పోస్టుమెట్రిక్‌ వసతిగృహాలున్నాయి. ప్రస్తుతం వీటిలో 3,450 మంది విద్యార్ధులు వసతి పొందుతున్నారు. బీసీ సంక్షేమ శాఖకు 53 ప్రీమెట్రిక్‌, 30 పోస్టుమెట్రిక్‌ వసతిగృహాలుండగా, ప్రీమెట్రిక్‌ వసతిగృహాల్లో 3700 మంది, పోస్టుమెట్రిక్‌లో 2300 మంది విద్యార్థులున్నారు. ఒక్కో వసతి గృహానికి నెలకు రూ.80 వేల నుంచి రూ.1.05 లక్షల వరకు ఆహారం నిమిత్తం ఖర్చవుతోంది. గత ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు ఈ రెండు సంక్షేమ శాఖల వసతిగృహాలకు సుమారు రూ.9.5 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది.

మెనూ అమలుపై పట్టింపేది..
డైట్‌ ఛార్జీలు అందకపోవడంతో వార్డెన్లు కూడా మెనూ సక్రమంగా అమలు చేయడం లేదు. ప్రీమెట్రిక్‌ విద్యార్థులకు వారానికి నాలుగు సార్లు కోడిగుడ్లు, మూడుసార్లు కోడిమాంసం, నాలుగు సార్లు అరటిపండ్లు, రోజూ మిల్లెట్‌ చెక్కీలు, రాగిజావ, పెరుగుతో కూడిన మెనూ అమలుచేయాలి. అయితే బిల్లులు అందలేదన్న కారణంగా కొంతమంది గుడ్లు, మాంసంలో కోతపెడుతున్నారు. పాలు పరిమాణం తగ్గిస్తున్నారు. అరటి పళ్లు తెప్పించడమే మానేశారు. దీంతో పోషకాహారం అందడం లేదు. మెను సక్రమంగా అమలవుతుందా లేదానని పరిశీలించాల్సిన అధికారులు కూడా బిల్లు బకాయిలుండగా వారినేమి అడుగుతామంటూ మిన్నకుండిపోతున్నారు.

గతంలో పప్పు, నూనె, చింతపండు, కారం, ఎండుమిర్చి, ఉప్మానూక, ఇడ్లీనూక, చోడి పిండి వంటివి వసతి గృహాలకు సరఫరా చేసేవారు.
కొవిడ్‌ తర్వాత నిత్యావసర ధరలు పెరగటంతో వీటి సరఫరా కూడా నిలిచిపోయింది. వీటితో పాటు కూరగాయలు, గుడ్లు, మాసం, పాలు బయ వ్యాపారుల నుంచే కొనుగోలు చేసి పెట్టాల్సి వస్తోంది.
నిర్వహణ విషయమై సాంఘిక సంక్షేమ శాఖ జేడీ  రమణమూర్తి వద్ద ప్రస్తావించగా డైట్‌ ఛార్జీలు రాకపోవడంతో కొంత ఇబ్బందులు పడుతుంది నిజమేనన్నారు. అయినా మెనూ అమలు చేయాల్సిందేనని, బిల్లులు కాస్త ఆలస్యమైనా వస్తాయన్నారు. మెనూలో మార్పులకు ఉన్నతాధికారుల నుంచి ఆమోద రాలేదన్నారు.

ఇటీవల మెనూలో సవరణలు
చేయడానికి కొన్ని ప్రతిపాదనలు పెట్టినా కలెక్టర్‌ అనుమతించలేదు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని చెప్పడంతో సంక్షేమాధికారులు మెనూ అమలుపై చేతులెత్తేస్తున్నారు.

డైట్‌ ఛార్జీలు ఇలా.. (రూపాయల్లో)
3 నుంచి 7 తరగతులు 1000
8 నుంచి 10 విద్యార్థులకు 1250
పోస్ట్‌మెట్రిక్‌ విద్యార్థులకు1400

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని