Published : 28 Nov 2021 04:27 IST
ఉక్కు కర్మాగారానికి.. అపూర్వ హోదా
ఈనాడు, విశాఖపట్నం: విశాఖ ఉక్కు కర్మాగారానికి ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్’(డి.జి.ఎఫ్.టి.) అధికారులు ‘ఫోర్స్టార్ ఎక్స్పోర్ట్ హౌస్’గా అపూర్వ హోదా ప్రకటించారు. భారత విదేశీ వాణిజ్య విధాన ప్రకారం వరుసగా రెండు ఆర్థిక సంవత్సరాల కాలం పాటు ఏటా 500 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన ఎగుమతులు చేస్తే ‘ఫోర్స్టార్’ హోదా దక్కుతుంది. విశాఖ ఉక్కు కర్మాగారం చరిత్రలో ఇప్పటివరకు ఆ స్థాయి ఎగుమతులు చేయలేదు. దీంతో ‘త్రీస్టార్’ కేటగిరీలోనే ఉండిపోయింది. తాజాగా 500 మిలియన్ డాలర్ల ఎగుమతుల మార్కును వరుసగా రెండేళ్లపాటు దాటిన నేపథ్యంలో డి.జి.ఎఫ్.టి. అధికారులు ‘ఫోర్స్టార్’ హోదా ప్రకటించారు. ఆమేరకు సంస్థకు లేఖను పంపారు. తాజా హోదా 2026 అక్టోబరు 21వ వరకు కొనసాగుతుంది. సంస్థ మార్కెటింగ్ విభాగానికి ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు.
Tags :