logo

Super Star Krishna: అనకాపల్లితో ఆత్మీయ అనుబంధం

సినీ నటుడు కృష్ణతో అనకాపల్లికి అనుబంధం ఉంది. ఆయన రెండుసార్లు ఇక్కడికి వచ్చారు. పట్టణంలో ఆయనకు వీరాభిమానులు ఉన్నారు. పలుసార్లు చెన్నై, హైదరాబాద్‌లోని కృష్ణ ఇంటికి వెళ్లి జన్మదిన వేడుకలు, ఇతర సందర్భాల్లో శుభాకాంక్షలు తెలిపేవారు.

Updated : 16 Nov 2022 09:26 IST

కృష్ణతో అనకాపల్లి అభిమానులు

సినీ నటుడు కృష్ణతో అనకాపల్లికి అనుబంధం ఉంది. ఆయన రెండుసార్లు ఇక్కడికి వచ్చారు. పట్టణంలో ఆయనకు వీరాభిమానులు ఉన్నారు. పలుసార్లు చెన్నై, హైదరాబాద్‌లోని కృష్ణ ఇంటికి వెళ్లి జన్మదిన వేడుకలు, ఇతర సందర్భాల్లో శుభాకాంక్షలు తెలిపేవారు. ఆయన చనిపోయారన్న వార్తను వారంతా జీర్ణించుకోలేకపోతున్నారు.

* అనకాపల్లి ప్రధాన రహదారిలో 1972లో నూతనంగా నిర్మించిన సత్యనారాయణ థియేటర్‌ను హీరో కృష్ణతో పాటు హీరోయిన్‌ విజయనిర్మల కలిసి ప్రారంభించారు. తొలిచిత్రంగా వీరిరువురు నటించిన ‘పండంటి కాపురం’ అప్పట్లో ప్రదర్శించారు. ఈసంద్భంగా కృష్ణ అభిమాన సంఘం అప్పటి అధ్యక్షులు కొణతాల వెంకటరావు సారథ్యంలో కల్యాణ మండపంలో సమావేశం నిర్వహించారు. ఆనాటి విశాఖ జిల్లాలోని కృష్ణ అభిమానులు భారీగా తరలివచ్చారు. వారందరినీ ఉత్సాహపరుస్తూ మాట్లాడారు. మరోసారి 1973లో ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చారు. ఈ చిత్రంలో కృష్ణ, ఎన్టీఆర్‌ కలిసి నటించారు. వాస్తవానికి 1965లో ఆయన నటించిన తొలి చిత్రం ‘తేనెమనసులు’ ప్రచారానికి అనకాపల్లి రావాలనుకున్నారు. అయితే ఆయన ప్రయాణించిన కారు సుంకరమెట్ట కూడలి వద్ద ప్రమాదానికి గురైంది. కృష్ణకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఇక్కడ ఆగకుండా విశాఖ వెళ్లిపోయారు.

మాడుగుల, న్యూస్‌టుడే: సూపర్‌స్టార్‌ కృష్ణ మరణ వార్తతో మాడుగులలో ఆయన అభిమానులు కన్నీటిపర్యంతమయ్యారు. ఆయన నటించిన చిత్రాలను గుర్తు చేసుకుని ఆవేదన చెందారు. కృష్ణ విశాఖలో ఓ షూటింగ్‌లో ఉన్నప్పుడు జి.జగన్నాథరావు, రాకీ శ్రీను, పెరుమాళ్ల వేంకటరావు, ఎన్‌.వి.రమణ వెళితే ఆదరంగా చూసి భోజనం పెట్టించారని తలచుకున్నారు. బస్టాండులో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీపీ రామధర్మజ, దంగేటి సూర్యారావు, జి.ఈశ్వరరావు పుట్టా బలరామ్‌, పుట్టా మురళీ కృష్ణ, రామకృష్ణ, ఎలమంచిలి అప్పారావు, మనోహర్‌, దంగేటి శ్రీను, భీమరశెట్టి పైడినాయుడు తదితరులు పాల్గొని కృష్ణ అమర్‌రహే అంటూ నినాదాలు చేశారు.

చిత్ర పరిశ్రమకు తీరని లోటు

కృష్ణ అభిమానుల ఆధ్వర్యాన స్థానిక నెహ్రూచౌక్‌లో సంతాప సభ నిర్వహించారు. ఆయన చిత్రపటానికి అభిమానులు రాజు, మాణిక్యం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ సినీ పరిశ్రమలో ఎన్నో ప్రయోగాలు చేసి విజయాలు సొంతం చేసుకున్నారన్నారు. కృష్ణ సినీ జీవితంలో మరిచిపోలేని చిత్రం అల్లూరి సీతారామరాజును మన ప్రాంతంలోని గిరిజన ప్రాంతంలో తీయడం మరవురానిదన్నారు.  
*  కృష్ణ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని మాజీ మంత్రి, నాటక రచయిత దాడి వీరభద్రరావు అన్నారు. సాహసోపేతమైన నటుడే కాకుండా సంచలన సినిమాలు తీసిన నిర్మాత అన్నారు. స్వశక్తితో ఎదిగారని, నిర్మాతల హీరోగా పేరు పొందారన్నారు.

రికార్డుల రారాజుసూపర్‌స్టార్‌

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: తెలుగు చలనచిత్ర చరిత్రలో పలు శాశ్వత రికార్డుల రారాజుగా సూపర్‌స్టార్‌ కృష్ణ చిరస్థాయిగా అందరి హృదయాల్లో నిలుస్తారని సినీ హీరోల అభిమానుల ఐక్యవేదిక పేర్కొంది. అనకాపల్లి పార్క్‌ సెంటర్‌లో మంగళవారం కృష్ణ చిత్రపటానికి ఐక్య వేదిక ఆధ్వర్యంలో నివాళులర్పించారు. అందరికీ సహాయం చేసిన వ్యక్తిగా, వివాదరహితుడిగా పేరుతెచ్చుకున్న కృష్ణ మరణం చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. నాగార్జున అభిమాన సంఘ ఉత్తరాంధ్ర జిల్లాల అధ్యక్షుడు మళ్ల సురేంద్ర, ఆంధ్రప్రదేశ్‌ వెంకటేష్‌ హెల్పింగ్‌ హ్యాండ్స్‌ కన్వీనర్‌ పి.చందు, మాజీ కౌన్సిలర్‌ కొణతాల మురళీకృష్ణ, పలు సంఘాల సంస్థల ప్రతినిధులు పి.కుమారరాజా, మళ్ల సూరిబాబు, బుద్ద భగవాన్‌, రవికుమార్‌, బుద్ద శ్రీను, సత్యనారాయణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

కృష్ణకు ఏయూ డాక్టరేట్‌

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే : ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి ఘట్టమనేని కృష్ణకు ఆంధ్ర విశ్వవిద్యాలయం 2008 జనవరి 16న 75వ స్నాతకోత్సవంలో డాక్టరేట్‌తో గౌరవించింది. అప్పటి ఉపకులపతి గోపాలకృష్ణారెడ్డి ఆయనకు డాక్టరేట్‌ అందించారు. ఈ కార్యక్రమంలో అప్పటి జాతీయ నాలెడ్జ్‌ కమిషన్‌ ఛైర్మన్‌ శ్యామ్‌ప్రిటోడా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కృష్ణతో పాటు ఇదే వేదికపై ప్రముఖ సినీ గేయ రచయిత జాలాది రవి, ప్రముఖ వైద్యులు డాక్టర్‌ సుంకరి ఆదినారాయణరావు, విద్యావేత్త దొడ్ల రామచంద్రరెడ్డి ఏయూ నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. కృష్ణ సినీరంగ ప్రవేశానికి ముందు ఏలూరు సి.ఆర్‌.రెడ్డి కళాశాలలో డిగ్రీ పూర్తిచేశారు. అప్పుడు సి.ఆర్‌.రెడ్డి కళాశాలలో ఏయూ పరిధిలో ఉండేది. దీంతో ఆయన ఏయూ పూర్వ విద్యార్థిగా ఈ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు అందుకోవడానికి వచ్చినపుడు విజయనిర్మలతో కలసి ఏయూని సందర్శించారు.
వీసీ సంతాపం: కృష్ణ మృతిపట్ల ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి సంతాపం తెలిపారు. తెలుగు ప్రజల మనసులో ఆయన స్థానం సుస్థిరమైనదని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

చోడవరంలో ఎన్నికల ప్రచారం..

చోడవరం, న్యూస్‌టుడే: సూపర్‌స్టార్‌ ఘట్టమనేని శివరామకృష్ణ (కృష్ణ) 1991లో చోడవరం వచ్చారు. అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా కాంగ్రెస్‌ నుంచి పోటీచేసిన కొణతాల రామకృష్ణకు మద్దతుగా ప్రచారం చేశారు. విజయనిర్మలతో కలిసి స్థానిక పోలీస్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని