logo

మీరు కొట్టేస్తే.. నేను కట్టేస్తా!!

నగరంలో నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు జోరుగా సాగుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. కొన్ని చోట్ల అధికారులే అక్రమమని గుర్తించి చర్యలు చేపట్టినా.. మళ్లీ అక్కడే పనులు పూర్తిచేయడం గమనార్హం.

Published : 03 Feb 2023 03:41 IST

నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణ పనులు
నేతలు... అధికారుల సహకారంపై అనుమానాలు
న్యూస్‌టుడే, ఎన్‌ఏడీకూడలి

నగరంలో నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు జోరుగా సాగుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. కొన్ని చోట్ల అధికారులే అక్రమమని గుర్తించి చర్యలు చేపట్టినా.. మళ్లీ అక్కడే పనులు పూర్తిచేయడం గమనార్హం.

పట్టణ ప్రణాళిక అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతో భవన నిర్మాణదారులు నిబంధనలు అతిక్రమిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

* ఎన్‌ఏడీకూడలి 90వ వార్డు బుచ్చిరాజుపాలెం గవరవీధి సమీపంలో ఓ బహుళ అంతస్తు భవన నిర్మాణం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇరుకైన వీధిలో నాలుగు అంతస్తుల భవనాన్ని 8 ఫ్లాట్లుగా నిర్మిస్తున్నారు. గోపాలపట్నం మండల పరిధి యూఎల్సీ(అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌) కింద ఉన్న సుమారు 200 గజాల స్థలంలో భవన నిర్మాణం సాగుతుందని గతంలోనే స్థానికులు పట్టణ ప్రణాళిక అధికారులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేశారు. మండల రెవెన్యూ అధికారులు సర్వే పూర్తి చేసి యూఎల్సీ స్థలమని నిర్ధారించారు. అయితే రెండు శాఖల అధికారుల మధ్య సమన్వయ లోపంతో నివేదికను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించడంలో నిర్లక్ష్యం చోటు చేసుకుంది. ఇదే అదనుగా నిర్మాణ పనులు కొనసాగించారు. ఇరుకు మార్గంలో కనీసం నిర్ణీత స్థలం వదలకుండా పనులు పూర్తి చేయడంతో మరోసారి స్థానికుల నుంచి జీవీఎంసీ 8వ జోన్‌ పట్టణ ప్రణాళిక అధికారులకు ఫిర్యాదులు అందాయి. స్పందించిన అధికారులు గతేడాది అక్టోబర్‌ 27న భవనం పైకప్పునకు రెండు పెద్ద రంధ్రాలు చేసి, ఎలాంటి పనులు చేపట్టకూడదంటూ..నోటీసులు జారీ చేశారు. అధికార పార్టీకి చెందిన నేతలు, ప్రజాప్రతినిధుల అండ ఉన్నందునే మళ్లీ పనులు సాగించేశారని తెలుస్తోంది.

క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం..: ఇటీవలే ఏసీపీగా బాధ్యతలు చేపట్టా. ఈ నిర్మాణంపై గతంలో అధికారులు, సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదికలు పరిశీలిస్తాం. మరోసారి క్షేత్రస్థాయిలో తనిఖీ చేపట్టి.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటాం.

ఎస్‌.శాస్త్రి, 8వ జోన్‌ పట్టణ ప్రణాళిక ఏసీపీ


యూఎల్సీ స్థలాల్ని పరిరక్షిస్తాం..: యూఎల్సీ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా ఉపేక్షించేది లేదు. ఇటీవలే గోపాలపట్నంలో యూఎల్సీ స్థలంలో నిర్మిస్తున్న నిర్మాణాన్ని అడ్డుకున్నాం. బుచ్చిరాజుపాలెంలోనూ పరిశీలించి.. స్థల పరిరక్షణకు ఆదేశాలు జారీ చేస్తాం.

కె.జయ, గోపాలపట్నం మండల తహసిల్దార్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని