logo

కొత్తగా కనిపెడదాం.. రండి..!

విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నూతన ఆవిష్కరణలకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు ఐడియా ల్యాబ్‌ (ఐడియా డెవలప్‌మెంట్‌, ఎవల్యూషన్‌ అండ్‌ అప్లికేషన్‌ ల్యాబ్‌) ఉపకరిస్తుంది.

Updated : 09 Feb 2023 06:16 IST

అందుబాటులోకి ‘ఐడియా ల్యాబ్‌’

న్యూస్‌టుడే, కూర్మన్నపాలెం(దువ్వాడ): విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నూతన ఆవిష్కరణలకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు ఐడియా ల్యాబ్‌ (ఐడియా డెవలప్‌మెంట్‌, ఎవల్యూషన్‌ అండ్‌ అప్లికేషన్‌ ల్యాబ్‌) ఉపకరిస్తుంది.

ఐఓటీ పరిజ్ఞానంతో మెకానికల్‌ విద్యార్థులు తయారు చేసిన కన్వేయర్‌ బెల్ట్‌

‘ఆత్మనిర్భర్‌ భారత్‌’లో భాగంగా ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) ఆర్థికసాయంతో సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథ్స్‌లో(ఎస్‌టీఈఎం) విద్యార్థులకు ప్రాథమిక శిక్షణ ఇచ్చి ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఐడియా ల్యాబ్‌లను ప్రవేశపెట్టింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఆసక్తి గల కళాశాలలను ఎంపిక చేసింది. మన రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతంలో ఉన్న దువ్వాడ విజ్ఞాన్‌ ఇంజినీరింగ్‌ కళాశాలను ఎంపిక చేసింది. ఇక్కడ వివిధ పాఠశాలలు, కళాశాలలు, పరిశ్రమల్లో పని చేసే ఆశావహులకు శిక్షణ ఇస్తారు.

* ఇండస్ట్రీ 4.0 : ఐఓటీ ఆధారిత కన్వేయర్‌ బెల్ట్‌ రూపొందిస్తున్నారు. పరిశ్రమల్లో వినియోగించే కన్వేయర్‌ బెల్ట్‌ విధానాన్ని ఐఓటీ అనుసంధానం చేసి, చరవాణితో పని చేసేలా సిద్ధం చేశారు. విశాఖ పోర్టు ట్రస్టు అవసరాలకు అనుగుణంగా ఈ నమూనా తయారు చేసినట్టు విద్యార్థులు తెలిపారు.

* 3డీ ప్రింటింగ్‌ : కంప్యూటర్‌లో అవసరమైన మాడ్యూల్‌ సిద్ధం చేసి, దానికి 3డీ ప్రింటింగ్‌కు అనుసంధానం చేస్తే ఆకర్షణీయమైన ప్రింటింగ్‌ వస్తుంది. టీ షర్టులు, గ్లాసులు, కీ చైన్స్‌..తదితర పరికరాలపై మనకు నచ్చిన బొమ్మలు ముద్రించుకునేలా తయారు చేశారు.

అడుగు పడిందిలా...

* ల్యాబ్‌ల ఏర్పాటుకు దేశ వ్యాప్తంగా ఉన్న కళాశాల నుంచి ఏఐసీటీఈ ఆన్‌లైన్‌ ప్రతిపాదనలు ఆహ్వానించింది. ఇందులో విజ్ఞాన్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో కళాశాల యాజమాన్యం, స్థానిక పరిశ్రమల భాగస్వామ్యంతో రూ.1.98 కోట్ల నిధులతో ల్యాబ్‌ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

* స్థానికంగా పరిశ్రమల భాగస్వామ్యం లేకపోవడంతో ఏఐసీటీఈ రూ.55 లక్షలు, కళాశాల వాటాగా రూ.50 లక్షలు మొత్తం కలిపి రూ.1.05 కోట్లతో ఈ ఏడాది
జనవరి 11న ల్యాబ్‌ ప్రారంభించారు. ఐఓటీ పరిజ్ఞానంతో మెకానికల్‌ విద్యార్థులు తయారు చేసిన కన్వేయర్‌ బెల్ట్‌

రూపొందించిన పరికరాలు..

* ల్యాబ్‌లో మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌), 3డీ- ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ), కృత్రిమ మేధ (ఆర్టిఫిషీయల్‌  ఇంటిలిజెన్స్‌-ఏఐ) వినియోగించి అత్యాధునికి ఉత్పత్తుల తయారీకి శిక్షణ ఇస్తున్నారు.ఐఓటీ సాయంతో హోమ్‌ ఆటోమెషిన్‌, హోమ్‌ సెక్యూరిటీ సిస్టంలు రూపొందించారు.

* హోమ్‌ ఆటోమెషిన్‌ : ఇంట్లో ఉన్న విద్యుత్‌ దీపాల్ని చరవాణి సాయంతో వెలిగించి, ఆర్పేసేలా (ఆన్‌/ఆఫ్‌) పరికరాన్ని తయారు చేశారు. ఇంట్లో ఉన్నా, ఇంటికి దూరంగా ఉన్నా ప్రతిసారి స్విచ్‌ బోర్డు దగ్గరకు వెళ్లకుండానే చరవాణితో నిర్వహణకు వీలుంటుంది.

* హోమ్‌ సెక్యూరిటీ సిస్టం : చోరీలు నియంత్రించేలా కొత్త పరికరం రూపొందించారు. ఇంట్లో నివాసితులు బయటకు వెళ్లినప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా తాళాలు విరగ్గొటి,  దొంగతనానికి ప్రయత్నిస్తే ఇంట్లో అయిదుగురు సభ్యుల చరవాణులకు సంక్షిప్త సమాచారం అందుతుంది. వారు వెంటనే పోలీసులను అప్రమత్తం చేసి... చోరీల నియంత్రణకు తోడ్పడవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని