logo

శిలాఫలకాలు సిగ్గుపడుతున్నాయ్‌!

ఉమ్మడి జిల్లాలో పలు అభివృద్ధి పనులు కుంటుబడిపోయాయి. వివిధ పథకాలు, నిధులతో మంజూరైన పనులు ముందుకు కదలడం లేదు.

Published : 07 Mar 2023 03:12 IST

ఉమ్మడి జిల్లాలో పడకేసిన అభివృద్ధి పనులు
బిల్లులందక ముఖం చాటేస్తున్న గుత్తేదారులు
ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి, న్యూస్‌టుడే, గొలుగొండ, కశింకోట, నర్సీపట్నం/గ్రామీణం

కశింకోట శారదానదిపై కాలిబాట వంతెన నిర్మాణానికి 2020లో వేసిన శిలాఫలకం

ఉమ్మడి జిల్లాలో పలు అభివృద్ధి పనులు కుంటుబడిపోయాయి. వివిధ పథకాలు, నిధులతో మంజూరైన పనులు ముందుకు కదలడం లేదు. నిధుల కొరతకు తోడు చేసిన వాటికి బిల్లులు అందక అసంపూర్తిగా వదిలేస్తున్నవి కొన్ని.. టెండరు దశ దాటి ఒప్పందం చేసుకోని పనులు అనేకం ఉన్నాయి.


గత ప్రభుత్వ హయాంలోని ఆఖరి ఏడాదిలో మంజూరు చేసిన పనులన్నీ నిలిపేశారు. పోనీ ఈ ప్రభుత్వం వచ్చాక మొదలుపెట్టిన పనులైనా పూర్తిచేశారా అంటే అదీ లేదు. కొన్ని నియోజకవర్గాల్లో హంగూ ఆర్బాటాలతో పంచాయతీరాజ్‌, ర.భ.శా. పరిధిలో పలు అభివృద్ధి పనుల కోసం నేతలు చేసిన శంకుస్థాపనలు శిలాఫలకాలకే పరిమితమయ్యాయి. ఏళ్లు గడుస్తున్నా పనుల్లో కదలిక లేకపోవడంతో ఇప్పుడు ఆ శిలాఫలకాలే సిగ్గుపడుతున్నాయి.


గత ప్రభుత్వంలో పనులపై శీతకన్ను డివిజన్‌ కేంద్రం నర్సీపట్నంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో రూ.2.70 కోట్ల అంచనాతో కార్పొరేట్‌ స్థాయి అతిథి భవనాల నిర్మాణ పనులకు గత ప్రభుత్వ హయాంలో అప్పటి హోం మంత్రి చినరాజప్ప శంకుస్థాపన చేశారు. వీటి నిర్మాణ పనులు మొదలుపెట్టి గోతులు తవ్వుతుండగా గట్టి రాయి పడింది. దీంతో పనులు ముందుకు సాగలేదు. ఈలోగా ఎన్నికలు రావడంతో వీటికి బ్రేక్‌ పడింది. తరువాత ప్రభుత్వం మారడంతో ఈ పనులు నిలిచిపోయాయి.

నిరుపయోగంగా ఉన్న ప్రకృతి వైద్య భవనం

నర్సీపట్నంలో ప్రాంతీయ ఆసుపత్రిలో ‘యోగా, నేచురోపతి కేంద్రం’ పేరిట డిస్పెన్సరీ నిర్మాణానికి భవనం నిర్మించి దానిని నిరుపయోగంగా వదిలేశారు. గత ప్రభుత్వ హయాంలోనే ఈ భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ప్రహరీ నిర్మాణం, విద్యుత్తు సౌకర్యం తదితర పనులకు నిధులు సరిపోలేదంటూ భవనాన్ని నిరుపయోగంగా వదిలేశారు. ఇది వినియోగంలోకి వచ్చుంటే ఈ ప్రాంత ప్రజలందరికి యోగా నేర్చుకునే అవకాశంతో పాటు ప్రకృతి వైద్యం అందుబాటులోకి వచ్చేది.

శిలాఫలకానికే పరిమితమైన స్టేడియం

* నర్సీపట్నంలో ‘క్రీడా వికాస కేంద్ర స్టేడియం నిర్మాణం’ పేరిట గత ప్రభుత్వ హయాంలోనే నాటి క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో దీని నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయించారు. పనులు మొదలుపెట్టేనాటికే ఎన్నికల కోడ్‌ రావడం..ప్రభుత్వం మారిపోవడం జరిగింది. దీనికి ఎంపిక చేసిన స్థలం బాగా దూరమైందని చెప్పి ఆ తర్వాత ఎవరూ దీనిని పట్టించుకోలేదు. దీంతో క్రీడాకారులంతా తగిన మైదానం లేక అవస్థలు పడుతున్నారు.


అభ్యంతరాలున్నాయని ఆపేశారు

నర్సీపట్నం ధనిమిరెడ్డివారి వీధిలో రూ.5 లక్షల అంచనా విలువతో గ్రావెల్‌ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌ 2021 జనవరిలో శంకుస్థాపన చేశారు. గుత్తేదారు రోడ్డు నిర్మాణానికి వీలుగా 50 మీటర్లు చదును చేయగానే అభ్యంతరాలు ఎదురయ్యాయి. ఆస్థలంలో కొంత మత్స్యశాఖ పర్యవేక్షణలోని చెరువు గట్టు కావడం, మరికొంత స్థలంలో ప్రైవేట్‌ వ్యక్తులు అడ్డు చెప్పడంతో పనులు ఆగిపోయాయి. అభ్యంతరాలను పరిష్కరించి పనులు కొనసాగించే దిశగా అధికారులు దృష్టిపెట్టలేదు.

గ్రావెల్‌ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదించిన చెరువుగట్టు


మూడేళ్లుగా నత్తనడక..

ఎ.ఎల్‌.పురంలో 2019లో శంకుస్థాపన చేసి అసంపూర్తి నిర్మాణంతో సచివాలయం

గొలుగొండ మండలం మేజర్‌ పంచాయతీ ఎ.ఎల్‌.పురంలో రెండు అంతస్తుల సచివాలయ భవనానికి 2019లో శంకుస్థాపన చేశారు. అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకుడే ఈ పనులు చేపట్టారు.. నిధుల విడుదలలో సమస్య కారణంగా ఈ పనులు నత్తకు నడక నేర్పినట్లుగా మూడేళ్లుగా చేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన ఇక్కడ రెండు సచివాలయాలు ఉండాలి. శిథిలావస్థలో ఉన్న పాత పంచాయతీ కార్యాలయంలో ఒకటి,  మూతపడిన పాత ఎస్సీ వసతి గృహంలో మరొక సచివాలయ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.


కదలని కాలిబాట వంతెన..

కశింకోట శారదానదిపై గవరపేటరేవు వద్ద కాలిబాట వంతెన నిర్మాణానికి రూ.3 కోట్లతో 2020లో అప్పటి ర.భ.శా మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ శిలాఫలకం వేశారు. మూడేళ్లు గడుస్తున్నా ఈ పనుల్లో కదలిక లేకుండా పోయింది. గుత్తేదారు పునాధుల స్థాయిలో కొన్ని స్తంభాలు వేశారు. చేసిన పనులకు నిధులు రాకపోవడంతో అసంపూర్తిగా వదిలేశారు. ఈ పనుల బిల్లుల కోసం గుత్తేదారు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. సొమ్ములందినా తర్వాత పనులు ముందుకు సాగలేదు. వంతెన పూర్తయితే తమ కష్టాలు తీరుతాయని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది.  నదిలో నీటి ప్రవాహం పెరిగినప్పుడల్లా దోనెల్లోనే ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని