logo

తీర ప్రాంత రక్షణపై అవగాహన ర్యాలీ

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా తీర ప్రాంత రక్షణ, నారీశక్తి, అగ్నివీర్‌ పథకం తదితరాలపై అవగాహన కల్పించేందుకు భారత నావికాదళం ‘సముద్ర దేవా దీవించు’ పేరిట కార్ల ర్యాలీ ప్రారంభించింది.

Published : 31 Mar 2023 04:23 IST

బృంద సభ్యులతో నావికాదళ అధికారులు

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా తీర ప్రాంత రక్షణ, నారీశక్తి, అగ్నివీర్‌ పథకం తదితరాలపై అవగాహన కల్పించేందుకు భారత నావికాదళం ‘సముద్ర దేవా దీవించు’ పేరిట కార్ల ర్యాలీ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 7000 కిలోమీటర్ల దూరం కొనసాగనుంది. ఈ నెల 26న కోల్‌కతాలో ప్రారంభమైన ఈ యాత్ర గురువారం విశాఖపట్నం చేరుకుంది. ఆర్కే బీచ్‌ రోడ్డులోని నేవల్‌ కోస్టల్‌ బ్యాటరీ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ర్యాలీకి తూర్పు నావికాదళ ముఖ్య అధికారి వైస్‌ అడ్మిరల్‌ సంజయ్‌ వాత్సాయన్‌ జెండా ఊపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘లెగ్‌-2’లో భాగంగా విశాఖలో ప్రారంభమైన ర్యాలీ ఏప్రిల్‌ 3న తిరునల్వేలిలో ముగుస్తుందని తెలిపారు. గురువారం కాకినాడ, భీమవరం మీదుగా మచిలీపట్నం చేరుకుంటుందన్నారు. 36 మందితో కూడిన బృందం మన రాష్ట్రంతోపాటు పుదుచ్చేరి, తమిళనాడు తీర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. బృంద సభ్యులందరితో మాట్లాడి స్వచ్ఛందంగా ర్యాలీకి ముందుకు వచ్చినందుకు అభినందించారు. అంతకుముందు వారంతా తీరంలో స్వచ్ఛభారత్‌, గాజువాకలోని డిజైర్‌ సొసైటీ అనాథాశ్రమంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. యువత నావికాదళంలో చేరడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించడంతోపాటు విశ్రాంత అధికారులను ర్యాలీలోని సభ్యులు కలవనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని