logo

పెళ్లికెందుకు తొందర.. చదువుకోనీ ముందర..

‘ఎంతో ఖర్చు చేశాం. ఇప్పుడు పెళ్లి ఆపేస్తే పరువు పోతుంది. ఇబ్బంది పెట్టవద్దంటూ వేడుకున్నారు. అయినా అధికారులు వినలేదు.

Published : 04 May 2023 05:09 IST

బాల్యంలో ‘మూడు ముళ్లు’ పడకుండా..
అనకాపల్లి కేంద్రంగా పర్యవేక్షణ విభాగం
నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే

‘ఎంతో ఖర్చు చేశాం. ఇప్పుడు పెళ్లి ఆపేస్తే పరువు పోతుంది. ఇబ్బంది పెట్టవద్దంటూ వేడుకున్నారు. అయినా అధికారులు వినలేదు. మాట వినకపోతే పెళ్లి కుదిర్చిన వారు, సహకరించిన వారు, పెళ్లి చేస్తున్న వారు అందరూ చట్టపరమైన చర్యలకు గురవుతారని హెచ్చరించారు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో పెళ్లి ఆపేశారు. గత ఏడాది నర్సీపట్నం పురపాలక సంఘంలో చోటు చేసుకున్న ఘటన ఇది.

ఒక పక్క పెళ్లి బాజాలు మోగుతున్నాయి. వధూవరులు మండపానికి వచ్చేశారు. ఇంకో పక్క బంధువులంతా విందు భోజనాలు చేస్తున్నారు. ఎవరు సమాచారం ఇచ్చారో తెలియదు. ఐసీడీఎస్‌ అధికారులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అక్కడకు వచ్చేశారు. పెళ్లికుమార్తెకు పద్దెనిమిదేళ్లు నిండలేదు. బాల్య వివాహం చట్టరీత్యా నేరమని తల్లిదండ్రులకు స్పష్టం చేశారు. ‘ఇంతదాకా వచ్చాక.. ఇప్పుడెలా పెళ్లి ఆపగల’మంటూ ఇరువర్గాల వారు అధికారులతో వాగ్వాదానికి దిగారు.

పదిహేను నుంచి పదిహేడేళ్ల వయసులోనే.... ఆడపిల్లలకు పెళ్లి చేయాలని కొంతమంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. పేదరికం, నిరక్షరాస్యత, చట్టాలపై అవగాహన లేమి, త్వరగా పెళ్లి చేసి బరువు బాధ్యతలు తీర్చుకోవాలనుకోవడమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. బాలికల రక్షణ, సంరక్షణ కార్యక్రమాలు ఇప్పటి వరకు ఉమ్మడి విశాఖ జిల్లా కేంద్రంగానే కొనసాగుతున్నాయి. అనకాపల్లి జిల్లా కేంద్రంగా ఈ కార్యక్రమాలను కొనసాగించేలా ఐసీడీఎస్‌ అధికారులకు ఆదేశాలు వచ్చాయి. మిగతా శాఖలనూ సమన్వయం చేసుకుంటూ చైతన్య కార్యక్రమాలను ముమ్మరం చేయాలన్న సూచనలున్నాయి. బాల్య వివాహాల వల్ల అనర్థాలను వివరించేందుకు, ఆడపిల్లలకు పద్దెనిమిదేళ్లు, మగ పిల్లలకు 21 ఏళ్లు నిండితేనే వివాహం చేయాలని చట్టం చెబుతోంది. పరిస్థితులు ఎలాంటివైనా ఈలోపు వయసున్న వారికి పెళ్లి చేయడానికి యత్నించిన వారు, సహకరించిన వారు శిక్షార్హులు.

ఫిర్యాదు అందగానే అధికారుల బృందం వెళ్లి పెళ్లిని అడ్డుకుంటున్నా.. కొద్దిరోజుల తర్వాత గుట్టుగా గుడిలో మూడు ముళ్లు వేయిస్తున్న పరిస్థితులున్నాయి. మరింత అప్రమత్తంగా వ్యవహరించడం ద్వారా ఇలాంటి వాటిని అరికట్టేందుకు ఆస్కారం ఉంటుంది.

బాల్య వివాహాలపై ప్రచార గోడపత్రిక

ఎదిగీఎదగని వయసులో ఆడపిల్లల మెడలో పడే మూడు ముళ్లు ఎన్నో పీటముడులకు కారణమవుతాయి. పద్దెనిమిదేళ్లలోపు వయసులో పెళ్లయితే పుస్తకాలు పక్కనపెట్టి పిల్లల్ని, కుటుంబ బాధ్యతలను మోయక తప్పదు. పెన్ను పట్టాల్సిన చేయి గరిటె తిప్పకా తప్పదు. బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలపై అధికారులు ఎంతగా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. బాలికా విద్యను ప్రభుత్వాలు ఎంతగా ప్రోత్సహిస్తున్నా.. ఒక్కటో ఒకచోట అనర్థాలు జరిగిపోతూనే ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో జిల్లాలో 42 బాల్య వివాహాలను స్త్రీ, శిశు సంక్షేమ అధికారులు గుర్తించి అడ్డుకున్నారు. వీరి దృష్టికి రాకుండా అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి.


ఉపేక్షించేది లేదు: బాల్య వివాహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. ఇవి జరగకుండా అన్ని స్థాయిల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వివాహ ముహూర్తాలున్న నేపథ్యంలో ప్రత్యేకంగా దృష్టిసారిస్తాం. ఇరువర్గాల తల్లిదండ్రులకు ముందుగానే చట్టాలను, చిన్న వయసులో పెళ్లి చేస్తే ఎదురయ్యే కష్టనష్టాలను వివరిస్తాం.

జి.ఉషారాణి, సంచాలకురాలు, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని