logo

ఇంటింటి నుంచి బయోమెట్రిక్‌..!

మాకు ప్రభుత్వ పథకం ఒక్కటీ అందడం లేదు. ఎటువంటి ధ్రువీకరణ పత్రమూ కోరుకోవడం లేదు. అయినా బయోమెట్రిక్‌ వేయాలని, ఫొటో తీసుకుంటామని ఎందుకు అడుగుతున్నారు.

Published : 18 Jul 2023 04:51 IST

పథకాలు అందకపోయినా వేయాల్సిందే
ఒత్తిడి తెస్తున్న వాలంటీర్లు
కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

* మాకు ప్రభుత్వ పథకం ఒక్కటీ అందడం లేదు. ఎటువంటి ధ్రువీకరణ పత్రమూ కోరుకోవడం లేదు. అయినా బయోమెట్రిక్‌ వేయాలని, ఫొటో తీసుకుంటామని ఎందుకు అడుగుతున్నారు. ఒక వేళ అది దుర్వినియోగమైతే ఎవరు బాధ్యత వహిస్తారు’ ఇటీవల చినముషిడివాడలో స్థానికుల నుంచి వాలంటీర్లకు ఎదురైన ప్రశ్న ఇది? ఎటువంటి లబ్ధి చేకూరకపోయినా బయోమెట్రిక్‌ తీసుకోవాలని పైస్థాయి నుంచి ఆదేశాలు, ఒత్తిళ్లు ఉన్నాయని వాలంటీర్లు చెబుతున్నారు.

* వైకాపా ప్రభుత్వం చేపట్టిన ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ప్రజల నుంచి ఇష్టానుసారంగా వ్యక్తిగత సమాచారం సేకరిస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకం కింద 12 రకాల సేవలను ప్రజలకు ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాలంటీరు తన పరిధిలో ఉన్న ఇళ్లకు వెళ్లి, నివాసితులకు కావాల్సిన ధ్రువీకరణపత్రాల కోసం ఆరా తీయడంతోపాటు, దరఖాస్తు చేయిస్తున్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను పరిధిలో ఉన్నవారు, కుల, ఇతర ధ్రువీకరణ పత్రాలు అవసరంలేని వారి ఇళ్లకు వెళ్లి బయోమెట్రిక్‌, ఛాయాచిత్రం తీసుకోవడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో బయోమెట్రిక్‌ను ఉపయోగించి ఆధార్‌ నెంబరు సాయంతో బ్యాంకు ఖాతాల నుంచి నగదు కాజేసిన ఘటనలు వెలుగు చూశాయని పలువురు గుర్తు చేస్తున్నారు.

* వాలంటీర్లు ఇంటింటికి వెళ్లారో లేదో తెలుసుకోవడానికే ఈ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని అధికారులు చెబుతున్నారు. పథకాలు పొందని వారు, ఎటువంటి ధ్రువీకరణపత్రాలు కోరని వారు బయోమెట్రిక్‌ వేయాల్సిన అవసరం లేదని వివరిస్తున్నారు. అయితే కొంత మంది వాలంటీర్లు ‘జగనన్న సురక్ష’లో ఎలాంటి ధ్రువీకరణపత్రాలు ఇస్తారు, ఏయే కార్యక్రమాలు అమలు చేస్తారనే విషయాలను లబ్ధిదారులకు వివరించకుండానే, యాప్‌లో ఉన్న కాలమ్స్‌ అన్నీ నింపి, బయోమెట్రిక్‌ సేకరిస్తుండటంతో ప్రజల్లో అనుమానాలు బలపడుతున్నాయి.

కొరవడిన పారదర్శకత

* అధికారులు చెప్పేది ఒకటి..వాలంటీర్లు చేసేది మరొకటిగా ఉండడంతో అసలు ఏమి జరుగుతుందో అర్థం కాక, తమ వ్యక్తిగత సమాచారం ఎంత వరకు భద్రంగా ఉందో తెలియక నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదని, వారికి ఎటువంటి జవాబుదారీతనం ఉండదని, వారికిచ్చిన సమాచారం ఎవరికి వెళుతుందో తెలియడం లేదని పలువురు పేర్కొంటున్నారు. పారదర్శకత లేకపోవడం, వ్యక్తిగత సమాచారానికి బాధ్యత వహిస్తున్నామని ఏ ఒక్కరూ చెప్పకపోవడంతో ప్రజల్లో మరిన్ని సందేహాలు తలెత్తుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని