logo

పన్ను భారం.. ఇదెక్కడి ఘోరం.. వాత వేసి వెన్న పూస్తున్న వైకాపా ప్రభుత్వం

జీవన పోరాటంలో నిత్యం తలమునకలయ్యే సగటు జీవికి ఒక చేత్తో సంక్షేమ పథకాలంంటూ ఆశలు చూపి మరో చేత్తో పన్నుల బాదుడుతో కుదేలు చేస్తోంది వైకాపా ప్రభుత్వం. జగనన్న తీరు వాత వేసి వెన్న పూస్తున్న చందంగా ఉందని జనాలు గగ్గోలు పెడుతున్నారు.

Updated : 11 Apr 2024 07:42 IST

పెందుర్తి, వేపగుంట, పరవాడ, న్యూస్‌టుడే

జీవన పోరాటంలో నిత్యం తలమునకలయ్యే సగటు జీవికి ఒక చేత్తో సంక్షేమ పథకాలంంటూ ఆశలు చూపి మరో చేత్తో పన్నుల బాదుడుతో కుదేలు చేస్తోంది వైకాపా ప్రభుత్వం. జగనన్న తీరు వాత వేసి వెన్న పూస్తున్న చందంగా ఉందని జనాలు గగ్గోలు పెడుతున్నారు. గత మూడేళ్ల నుంచి ఆస్తి పన్ను విధింపులో విచిత్రమైన విధానాన్ని అమలు చేస్తూ విశాఖ నగర ప్రజలపై మోయలేని భారం మోపింది జగనన్న ప్రభుత్వం. గతంలో ఉన్న సంప్రదాయ విధానం కాకుండా 2021-22 సంవత్సరం నుంచి విలువ ఆధారిత ఆస్తి పన్ను విధానాన్ని అమలు చేస్తూ ఏటా పన్ను పెంచుకుంటూ ప్రజలను పిండేస్తున్నారు. ఏటా 15 శాతం పన్ను పెంచేలా నిర్ణయం తీసుకున్నారు. పన్ను పెంపు విధానాన్ని ప్రతిపక్ష నాయకులు, ప్రజలు వ్యతిరేకించినా ఏ మాత్రం పట్టించుకోకుండా నిరంకుశంగా పెంచడమే లక్ష్యంగా జీవీఎంసీ పాలకవర్గం ముందుకెళ్తోంది. పన్నుల భారం కారణంగా చెల్లించలేని వారికి నోటీసులు జారీ చేస్తూ వారిని మానసిక క్షోభకు గురి చేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


అమ్మో ఇదెక్కడి బాదుడు..

వైకాపా ప్రభుత్వం విధిస్తున్న ఆస్తి పన్ను బాదుడు చూస్తుంటే గుండె గుబేల్‌మంటోంది. నాకో చిన్న ఇల్లు ఉంది. 2022లో ఆస్తి పన్ను రూ.1218 ఉండేది. తాజాగా ఈ ఏడాది రూ.1683 అయింది. ఇలా ఏటా పన్ను పెరుగుతూ పోతే పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. కొత్త పన్ను విధానం వలన నాలాంటి సగటు జీవిపై భరించలేని భారం పడుతోంది. ఈ పద్ధతిని పునఃసమీక్షించి ప్రజలకు మేలు చేసే నిర్ణయం తీసుకోవాలి.

బి.వి.రమణమూర్తి, సుజాతనగర్‌


70 శాతం పెరిగింది..

నేను వెయ్యి గజాలలోపు ఇంట్లో నివాసం ఉంటున్నాను. గతంలో సుమారు రూ.1,100 ఇంటి పన్ను చెల్లించేవాడిని. ఈ ఏడాది రూ.1870 కట్టాల్సి వచ్చింది. సుమారు 70 శాతం మేర పన్ను పెంచారు. ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఇల్లు అమ్ముకుని అద్దె ఇంటికి వెళ్లాల్సిన దుస్థితి ప్రజలకు వస్తుంది. పన్నుల వసూళ్లపై చూపిన శ్రద్ధ మౌలిక వసతుల కల్పనలో జీవీఎంసీ చూపడం లేదు.

ఎ.వెంకటేశ్‌, పాపయ్యరాజుపాలెం


ఏటా 15 శాతం అంటే కష్టమే..

నేను ఓ ప్రైవేట్‌ కంపెనీలో అరకొర జీతానికి పని చేస్తున్నాను. 2020 వరకు ఆస్తి పన్ను మాకు తక్కువగానే వచ్చేది. 2021 నుంచి వైకాపా ప్రభుత్వం ఒక్కసారిగా ఆస్తి పన్నును పెంచేసింది. ఏటా 15 శాతం పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికి మూడు పర్యాయాలు 45 శాతం పన్ను పెరిగిపోయింది. నాకు వచ్చిన జీతంలో పన్నులు చెల్లించేందుకే సరిపోతోంది. నాలాంటి పేద, మధ్య తరగతి ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. వెంటనే ఆస్తి పన్నును తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గాలి కృష్ణమూర్తి, నరవ


నెలవారీ బడ్జెట్‌పై మరింత భారం

నేను, నా భార్య ఇద్దరం వృద్ధులు. మేము అద్దె ఇంటిలో ఉంటున్నాం. 2020 వరకు అద్దె తక్కువగానే ఉండేది. కొవిడ్‌ అనంతరం యజమాని ఒక్కసారిగా మా ఇంటి అద్దెను పెంచేశారు. ఇదేమిటని అడిగితే వైకాపా ప్రభుత్వం పన్నులు పెంచడం వల్ల తాము తప్పక పెంచాల్సి వచ్చిందని చెబుతున్నారు. దీంతో నెలవారీ బడ్జెట్‌పై భారం మరింత రెట్టింపయింది. చాలామంది అద్దె ఇళ్లల్లో ఉన్నవారంతా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాల నడ్డి విరిచేలా పెంచిన ఆస్తి పన్నును వెంటనే తగ్గించాలి.

భాస్కరరావు, శ్రీసాయిమాధవనగర్‌


అధికారంలోకి రాగానే మడమ తిప్పేశారు..

మాట తప్పం.. మడం తిప్పం అని చెప్పిన జగన్‌ అధికారంలోకి రాగానే మడమ తిప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పన్నులు పెంచమని చెప్పి తర్వాత ఏటా 15 శాతం పెంచుకుంటూ ప్రజలపై ఎనలేని భారం మోపారు. ప్రభుత్వం పన్నులు పెంచడమే లక్ష్యంగా పెట్టుకుని వసతుల కల్పనలో విఫలమైంది. ఇలా చేయడం అన్యాయం. మా ఊరిలోని ప్రధాన రహదారిలో ఇప్పటికీ కొళాయి పైపులైన్‌ వేయలేదు. పన్నులు మాత్రం సకాలంలో వసూలు చేస్తున్నారు. రానున్న ప్రభుత్వంలోనైనా పన్నులు తగ్గుతాయని ప్రజలు ఆశాభావంతో ఉన్నారు.

పాల నగేశ్‌, పాలవలస

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు