logo

నాడు-నేడు.. ఐదేళ్లు సరిపోలేదు

నాడు-నేడు పథకం ద్వారా పాఠశాలలకు మహర్దశ పట్టిస్తామని చెప్పిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిధులు విడుదల చేయకుండా చేతులెత్తేశారు. ఏడాదిన్నరగా రెండో దశ పనులు నత్తనడకన సాగుతున్నాయి.

Updated : 18 Apr 2024 05:42 IST

అసంపూర్తి భవనాలతో అగచాట్లు
పెందుర్తి, వేపగుంట, పరవాడ, సబ్బవరం, న్యూస్‌టుడే

నాడు-నేడు పథకం ద్వారా పాఠశాలలకు మహర్దశ పట్టిస్తామని చెప్పిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిధులు విడుదల చేయకుండా చేతులెత్తేశారు. ఏడాదిన్నరగా రెండో దశ పనులు నత్తనడకన సాగుతున్నాయి. అసంపూర్తి పనులతో పాఠశాలల ఆవరణలో నిర్మాణ సామగ్రి, దుమ్మూ ధూళితో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. కొన్ని పాఠశాలలను పూర్తిగా తొలగించి కొత్త నిర్మాణాలు ప్రారంభించడంతో వసతి లేక అద్దె గదుల్లో తరగతులు నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది. పథకంలో భాగంగా పెందుర్తి మండలంలో 52 పాఠశాలలను అభివృద్ధి చేయడానికి ఎంపిక చేశారు. ఏడాదిన్నరగా నిధుల జాప్యం కారణంగా అసంపూర్తి భవనాలే దర్శనమిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆరు పాఠశాలలు మాత్రమే పనులు పూర్తయ్యాయి. వాటికి కూడా ఇంకా సున్నాలు, రంగులు వేయలేదు.

ఇంకా పునాది దశలోనే..

- పీలా జితేంద్ర

పాత పెందుర్తి జెడ్పీ ఉన్నత పాఠశాల పనులు అరకొరగానే జరిగాయి. ప్రాథమిక పాఠశాల పనులు ఇంకా పునాది దశలోనే ఉన్నాయి. దుమ్ము ధూళి కారణంగా విద్యార్థులు భోజనాలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు.


నాణ్యతా లోపం

- శంకర్రావు, విశ్రాంత ఉద్యోగి

నరవ పాఠశాలలో ఇప్పటికీ ఒక అదనపు భవనం నిర్మాణ దశలో ఉంది. తొలి దశలో నిర్మించిన భవనాల్లో నాణ్యత లోపం కారణంగా ఎక్కడికక్కడ బీటలు వారాయి. నిధులు విడుదల చేయకపోవడంతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి.


రహదారుల దుస్థితీ అంతే..

- గోపీ, విశ్రాంత ఉద్యోగి

నాడు-నేడు అంటూ పాఠశాలలకే కాకుండా రహదారులను కూడా అభివృద్ధి చేసి చూపిస్తామని పాలకులు చెప్పారు. కానీ శివారు ప్రాంతాలైన నరవ, కోటనరవ, సత్తివానిపాలెం, గవరజగ్గయ్యపాలెం ప్రాంతాలను కలుపుతూ వెళ్లే ప్రధాన రహదారి అభివృద్ధి పనులు తూతూమంత్రంగానే జరిగాయి.


మూడేళ్లగా తుపాను భవనంలోనే

- ఒలిశెట్టి అప్పలరాజు, జాలారిపేట

పరవాడ మండలం జాలారిపేట ప్రాథమిక పాఠశాలకు సొంత భవనం లేకపోవడంతో మూడేళ్లుగా తుపాను భవనంలోనే నెట్టుకొస్తున్నారు. పాఠశాల భవనం శిథిలం కావడంతో 2020లో సర్వశిక్షా అభియాన్‌ నిధులు వెచ్చించి కొత్తభవనం నిర్మాణ పనులను ప్రారంభించి మధ్యలోనే వదిలేశారు. తుపాను భవనం పరిసరాలు పిచ్చి మొక్కలు, చెత్తతో అధ్వానంగా మారింది. విష పురుగుల సంచారంతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు.


ప్రచార ఆర్భాటమే

- పైలా అప్పలనాయుడు, పరవాడ

నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు రూ.వేలాది కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రచార ఆర్భాటమే తప్ప క్షేత్రస్థాయిలో అందుకు తగ్గ పనులు మాత్రం చేయట్లేదు. పరవాడ జడ్పీ బాలుర పాఠశాలలో నిర్మిస్తున్న అదనపు భవనం పనులు గత రెండేళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. పాఠశాలకు మైదానం లేదు.


పాత గోడలకే రంగులు

-  జెట్టి లీలా వర ప్రసాద్‌, సబ్బవరం

నాడు నేడు పథకం అన్నారు. పాత గోడలమీద రంగులు వేశారు. పాత నిర్మాణాలు ఎంతకాలం పదిలంగా ఉంటాయి. ఎక్కడికక్కడ బీటలు వారాయి. దీంట్లో ఫర్నీచర్‌, విద్యుత్‌, గ్రీన్‌బోర్డులు తదితర అన్నీ వారు పెట్టుకున్న కాంట్రాక్టర్లు మాత్రమే చేయాలి. సిమెంట్‌, ఇసుక అన్నింటినీ ప్రభుత్వం సరఫరా చేసే వ్యక్తుల నుంచే తెచ్చుకోవాలి. దీని వల్ల ప్రయోజనం ఏముంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని