logo

జగదభిరాముని కల్యాణం.. చూసిన కనులదే వైభోగం

కనకమహాలక్ష్మి ఆలయ దత్తత అంబికాబాగ్‌ ఆలయంలో బుధవారం సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

Published : 18 Apr 2024 04:55 IST

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: కనకమహాలక్ష్మి ఆలయ దత్తత అంబికాబాగ్‌ ఆలయంలో బుధవారం సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ మధ్యాహ్నం 12గంటల సమయంలో పరిణయోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. దాదాపు 4వేల మంది భక్తులు స్వామివారి ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ ఈఓ శ్రీనివాసులురెడ్డి, దేవాదాయశాఖ జిల్లా సహాయ కమిషనర్‌ శిరీష, ఏఈఓలు వి.రాంబాబు, తిరుమలేశ్వరరావు, ఈఈ సీహెచ్‌.వి.రమణ తదితరులు పాల్గొన్నారు. తెదేపా విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌, సతీమణి తేజస్విని, కుమారుడు ఆర్యవీర్‌తో కలిసి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి స్వామివార్లను దర్శించుకున్నారు.


పట్టువస్త్రాలు సమర్పించిన డీసీపీ

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : విశాఖ సిటీ పోలీసు బ్యారెక్సులోని రామాలయంలో శ్రీరామనవమి పురస్కరించుకుని సీతారాముల కల్యాణం జరిపారు. డీసీపీ (క్రైమ్‌) వెంకటరత్నం దంపతులు సంప్రదాయ పద్ధతిలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి కల్యాణంలో పాల్గొన్నారు. పోలీసు అధికారులు తమ కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు.


శ్రీరామచంద్రుడికి అప్పన్న కానుకలు

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా రామతీర్థం క్షేత్రంలో కొలువైన సీతారామ స్వామికి ప్రభుత్వం తరఫున సింహాద్రి అప్పన్న స్వామి నుంచి కానుకలు సమర్పించారు. సింహాచలం దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి దంపతులు పట్టు పీతాంబరాలు, ముత్యాల తలంబ్రాలు, ఇతర కానుకలు తీసుకుని రామతీర్థం వెళ్లారు. తొలుత స్వామి చెంతన కానుకలు ఉంచి పూజలు చేశారు. నాదస్వర మంగళవాయిద్యాల నడుమ బేడామండపం ప్రదక్షిణం చేశారు. అనంతరం రామతీర్థం వెళ్లి కానుకలు సమర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని