logo

జగన్‌ మోపిన భారం.. ఇసుకే బంగారం!!

ఆర్థిక రాజధాని విశాఖలో నిర్మాణ రంగం చాలా కీలకమైనది. ఎన్నో పరిశ్రమల్లో, భారీ నిర్మాణాల్లో నిరంతరం పనులు జరుగుతూనే ఉంటాయి. వీటితో పాటు పెద్ద సంఖ్యలోనే ఇళ్లు, ఇతరత్రా నిర్మాణాలు సాగుతుంటాయి.

Updated : 25 Apr 2024 06:27 IST

రూ. వేలు కుమ్మరిస్తేనే ఇంటికి ఇసుక
సామాన్యుల కష్టాలు పట్టని సీఎం
నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం

ఆర్థిక రాజధాని విశాఖలో నిర్మాణ రంగం చాలా కీలకమైనది. ఎన్నో పరిశ్రమల్లో, భారీ నిర్మాణాల్లో నిరంతరం పనులు జరుగుతూనే ఉంటాయి. వీటితో పాటు పెద్ద సంఖ్యలోనే ఇళ్లు, ఇతరత్రా నిర్మాణాలు సాగుతుంటాయి. ఈ క్రమంలో కీలకమైన ఇసుక దొరక్క ప్రతి ఒక్కరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైకాపా ప్రభుత్వం అలాంటి పరిస్థితి తీసుకువచ్చింది.   గతంలో తెదేపా ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందించి ప్రజలను ఆదుకుంటే... జగన్‌ సర్కారు ఆ విధానం రద్దు చేసి అష్టకష్టాల పాల్జేసింది.

ఈనాడు, విశాఖపట్నం: జగన్‌ పాలనలో ఇసుక బంగారం అయిపోయింది. భారీ ధరలు జనం రక్తన్నా పీల్చిపిప్పిచేస్తున్నాయి. పలువురు నేతలు ఇసుక నిల్వలను తమ గుప్పిట్లో పెట్టుకొని...చెప్పిన ధరకు కొనాలి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. సామాన్యులకు అందుబాటులో లేకుండా చేసి ప్రైవేటుగా కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి తెచ్చారు.

  • భారీ భవన సముదాయాలు, అపార్టుమెంట్లు నిర్మించే వ్యాపారులు అధిక మొత్తంలో తెప్పించుకోవడం కొంత సులువే అయినా...సామాన్యులు మాత్రం ఇసుక లభించక గగ్గోలు పెడుతున్నారు. ఈ ప్రభుత్వం జనం గురించి ఆలోచించదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
  • జిల్లా పరిధిలో స్థానికంగా రేవులు లేకపోవడం, పొరుగు జిల్లాలపై ఆధారపడడం వల్ల అవసరానికి సరిపడా అందుబాటు ధరలో లభించడం లేదు. ఇతర జిల్లాల నుంచి తెచ్చుకోవాలంటే ఎక్కువ డబ్బులు చెల్లించాల్సిందే. శ్రీకాకుళం, రాజమహేంద్రవరం నుంచి లారీల ద్వారా తెచ్చే క్రమంలో జాతీయ రహదారిపై టోలు ఛార్జీలు తప్పడం లేదు. విజిలెన్స్‌, పోలీసు, రవాణా, గనుల శాఖలతో అభ్యంతరాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో అదనంగా అయ్యే మొత్తాల భారం అంతా కొనుగోలుదారులే భరించాల్సి వస్తోంది. తెదేపా హయాంలో  ఏడాదికి దాదాపు రూ.126 కోట్ల ఇసుక     కొంటే... అంతే పరిమాణానికి ఇప్పుడు రూ.252 కోట్లు వ్యయం చేయాల్సి వస్తోంది.

నిల్వ కేంద్రాలను ఎత్తేసిన ప్రభుత్వం..

విశాఖ జిల్లాలోని ఇసుక నిల్వ కేంద్రాలను వైకాపా ప్రభుత్వం ఎత్తేసింది. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు వ్యక్తులతో తెప్పించుకోవాల్సి వస్తోంది. దీనివల్ల అదనపు భారం పడుతోంది. గతంలో ముడసర్లోవ, భీమిలి, లంకెలపాలెంలో నిల్వ కేంద్రాలు ఉండేవి. ఇక్కడికి శ్రీకాకుళం, రాజమహేంద్రవరం జిల్లాల నుంచి ఇసుక తీసుకొచ్చి నిల్వ చేసేవారు. కొద్ది రోజుల పాటు నిర్వహించి ఆ తర్వాత మూసేశారు. ప్రస్తుతం ఎక్కడా ఇసుక లభ్యత లేదు. ప్రైవేటుగా లారీల ద్వారా రప్పించుకోవాల్సిందే. ఇది సామాన్యులకు తలకుమించిన భారమవుతోంది.

ధర ఎంతంటే..

టన్ను ఇసుక కావాలంటే రూ.1,600 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. భారీగా కొనుగోలు చేస్తే టన్నుకు రూ.1,400 నుంచి రూ.1,500 వరకు వసూలు చేస్తున్నారు. 16 టైర్ల లారీలో 32 టన్నుల ఇసుక పడుతుంది. టన్ను రూ.1400 చొప్పున కొనుగోలు చేస్తే రూ.44,800 అవుతుంది. దీనికి టోల్‌ ఛార్జీలు అదనం.

అందుబాటులో ఉంటుంది: 5 వేల టన్నులకన్నా తక్కువే

  • తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో రాజమహేంద్రవరం నుంచి టన్ను ఇసుక తెచ్చేందుకు రూ.700లు ఖర్చు అయ్యేది. ఇప్పుడు అదే ఇసుక రూ.1400కు చేరింది. గతంలో ఇసుకను ఉచితంగా అందించడం వల్ల కేవలం రవాణా ఖర్చులే పడేవి. ఇప్పుడు యూనిట్‌ ఇసుకకు ధర నిర్ణయించి అమ్మేస్తున్నారు. తెదేపా హయాంలో 32 టన్నుల ఇసుక లారీకి రూ.22,700 ఖర్చయ్యేది. జగన్‌ ఏలుబడిలో రెట్టింపై రూ.44,800లకు చేరింది.

విశాఖలో ఒక రోజుకి కావాల్సిన ఇసుక: పది వేల టన్నులు (సుమారు)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని