logo

ఐదేళ్లూ మాటలే.. జనంతో ఆటలే!!

రోడ్లు విస్తరణ, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టకుండా ముక్కుపిండి నగరవాసుల నుంచి పన్నులు వసూళ్లు చేశారు. జి-20 పుణ్యమా అని వచ్చిన నిధులను సైతం నాణ్యత లేకుండా సుందరీకరణ పనుల పేరుతో ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు.

Published : 26 Apr 2024 03:23 IST

 కీలక ప్రాంతాల్లో రహదారులు నిర్మించలేని వైకాపా ప్రభుత్వం
 నెలలుగా సాగుతున్న పనులు
 ఎక్కడికక్కడ తవ్వేసి నరకం చూపుతున్న పాలకులు

జగదాంబ-పాతపోస్టాఫీస్‌ రహదారి పనులు ఇలా..

అభివృద్ధి చెందిన నగరాల చెంత విశాఖను నిలబెడతామంటూ డాంబికాలు మోగించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చివరికి నగరాన్ని అసౌకర్యాలతో నింపేశారు.

రోడ్లు విస్తరణ, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టకుండా ముక్కుపిండి నగరవాసుల నుంచి పన్నులు వసూళ్లు చేశారు. జి-20 పుణ్యమా అని వచ్చిన నిధులను సైతం నాణ్యత లేకుండా సుందరీకరణ పనుల పేరుతో ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజలను మభ్యపెట్టడానికి జీవీఎంసీ పరిధిలో రహదారుల విస్తరణ, పునరుద్ధరణ పనులు చేపట్టారు. అయితే ఇవన్నీ నత్తనడకన సాగుతూ.. అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

సింహాచలం భక్తులకు ట్రాఫిక్‌ కష్టాలు..: బీఆర్‌టీఎస్‌ (శీఘ్ర బస్సు రవాణా వ్యవస్థ) ఎస్టీసీ (సింహాచలం ట్రాన్సిస్ట్‌ కారిడార్‌)లో గోశాల నుంచి అడవివరం వరకు 2.5 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణ పనులు ఇటీవల ప్రారంభించారు. బాధితులకు టీడీఆర్‌ పత్రాలు ఇవ్వడంలో జాప్యం జరిగింది. పైగా పరిహారంలోనూ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. కాలువల నిర్మాణం, రహదారి పునరుద్ధరణ పనులకు వేర్వేరుగా టెండర్లు ఆహ్వానించారు. ప్రస్తుతం రూ.6 కోట్ల పనులు చేపట్టారు. ఈ అసంపూర్తి పనులతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో ట్రాఫిక్‌లో చిక్కుకుని నరకం చూస్తున్నారు.

జగదాంబ వద్ద బెదిరిపోయేలా..: జగదాంబ కూడలి నుంచి పాతపోస్టాఫీసు వరకు 2 కిలోమీటర్ల మేర 60 అడుగుల రహదారి విస్తరణ పనులు ప్రారంభించారు. ఆయా పనులను రూ.50 లక్షలుగా విడగొట్టి, వేర్వేరు గుత్తేదారులకు అప్పగించడంతో నత్తనడకన సాగుతున్నాయి. రూ.4 కోట్లతో ఇప్పటి వరకు టెండర్లు ఆహ్వానించిన జీవీఎంసీ.. పనుల్లో పురోగతి సాధించలేకపోయింది. వాచ్‌ హౌస్‌ నుంచి వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ వరకు రోడ్డు విస్తరణ పనులూ అలానే ఉన్నాయి. దీంతో బాగున్న రోడ్లు దెబ్బతిన్నాయి. రహదారికి రెండువైపులా ఉన్న భవనాలు విస్తరణలో కూల్చి వేయడం, డ్రైనేజీ కాల్వలకు మట్టి తవ్వి వదిలేయడంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ప్రతి రోజూ రూ.లక్షల వ్యాపారానికి నష్టం వాటిల్లుతోంది. మెడికల్‌ షాపులు, బ్యాంకుల్లోకి వెళ్లాలన్నా చిన్నపాటి చెక్క వంతెనలపై ప్రమాదకరంగా నడవాల్సి వస్తోంది. అసంపూర్తి పనులతో దుమ్మూధూళి కళ్లల్లో పడి వాహనచోదకులు అల్లాడుతున్నారు.
నగర శివారుపై శీతకన్ను..: వైకాపా ప్రభుత్వంలో కేవలం పార్టీ నాయకుల ఆస్తులకు వేసిన రహదారులు, బీటీ లేయర్‌ పనులే త్వరగా చేశారు. ప్రజలకు ఉపయోగకరమైన వాటిపై మాత్రం దృష్టి సారించలేదు. దీంతో నరవ, జగదాంబ, గాజువాక, వన్‌టౌన్‌ పరిధిలో అసంపూర్తి పనులు వెక్కిరిస్తున్నాయి. నగర శివారుల్లో నేటికీ దర్శనమిస్తున్న మట్టి రహదారులను బీటీ, సీసీ రోడ్లుగా అభివృద్ధి చేయలేకపోయారు.

బేరాల్లో నేతలు..

దుర్గంధంలో ప్రజలు: పెందుర్తి, గాజువాక ప్రాంతాలలో రూ.900 కోట్లతో చేపట్టిన భూగర్భ మురుగునీటి వ్యవస్థ ప్రాజెక్టు పనుల్లో రహదారులు తవ్వేసి పైపులైను పనులు పూర్తి చేసినా.. వీధుల్లోని రోడ్లను పునరుద్ధరించలేకపోతున్నారు.  సకాలంలో బిల్లులు చెల్లించలేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. తెదేపా హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టు పనులు ఈ ఐదేళ్లలో పురోగతి సాధించక రోడ్లు అధ్వానంగా మారాయి.

కూర్మన్నపాలెం-దువ్వాడ రైల్వేస్టేషన్‌ వద్ద చేపట్టిన రహదారి విస్తరణ పనులు వైకాపా నాయకులకు కాసులు కురిపిస్తున్నాయి. కొందరు వ్యాపారుల దుకాణాల వద్ద రోడ్డు వెడల్పు తగ్గించి విస్తరణ చేసేందుకు అడుగుకు రూ.లక్షలు వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం.  డబ్బులు తీసుకున్న చోట్ల పనులు పూర్తి చేయకుండా వదిలేయడంతో మురుగు పొంగి స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు