logo

జగన్‌ వాహన మిత్రద్రోహి

ఆటోలు, టాక్సీలు, మ్యాక్సీ క్యాబ్‌లు నడుపుతూ జీవనం సాగించే వారికి ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటిస్తూ జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న వాహన మిత్ర పథకం.. వాహన చోదకుల పాలిట శాపంగా మారింది.

Published : 27 Apr 2024 04:17 IST

వాహన చోదకులకు ఒక చేత్తో సాయం.. మరో చేత్తో వడ్డింపు

పెందుర్తి, వేపగుంట, సబ్బవరం, పరవాడ, న్యూస్‌టుడే: ఆటోలు, టాక్సీలు, మ్యాక్సీ క్యాబ్‌లు నడుపుతూ జీవనం సాగించే వారికి ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటిస్తూ జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న వాహన మిత్ర పథకం.. వాహన చోదకుల పాలిట శాపంగా మారింది. ఒక చేత్తో ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయం అందిస్తున్న వైకాపా ప్రభుత్వం మరో చేత్తో పన్నులు, పోలీసు కేసుల పేరుతో డ్రైవర్ల నుంచి భారీగా డబ్బులు గుంజుకుంటోంది. ఆర్థిక సాయం  మాటెలా ఉన్నా కేసులు, అపరాధ రుసుముల బెడద అధికమైంది. దీంతో ఆటోలు, టాక్సీలు నడుపుతూ జీవిస్తున్న వారికి ఎన్నడూ లేని తంటాలు ప్రారంభమయ్యాయి.

కేసుల భారం పెరిగింది..

వైకాపా ప్రభుత్వంలో పోలీసుల కేసులు భారీగా పెరిగాయి. ఎక్కడపడితే అక్కడ ఫొటోలు తీస్తూ చలాన్లు వేస్తున్నారు. ఇవి కాకుండా బీమా, ఇతర ఖర్చులకు రూ.10 వేలు పైనే చెల్లించాల్సి వస్తోంది. వాహనం ఉన్న యజమానులకు మాత్రమే ఈ పథకం అమలవుతోంది. ఆటో అద్దెకు తీసుకుని నడిపే వారికి ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదు. గత ప్రభుత్వంలో పన్ను, బ్యాడ్జీలను రద్దు చేశారు.  

సతీశ్‌, ఆటో డ్రైవర్‌

పెట్రోలు ధర పెరుగుదలతో..

ప్రభుత్వ సహాయం కుటుంబానికి ఉపయోగపడేలా ఉండాలి. ఆటోవాలాలకు రూ.10 వేలు ఆర్థిక సహాయం చేసి రెండింతలు భారం మోపారు. పెట్రోలు ధరలు పెరిగాయని ఛార్జీలు పెంచితే ప్రయాణికులు ఒప్పుకోవడం లేదు. ధరలు పెంచలేక ఆటోవాలాలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం చమురు ధరలు తగ్గించాలి.

రామకృష్ణ, ఆటోడ్రైవర్‌

జరిమానాల రూపంలో లాగేశారు..

వైకాపా ప్రభుత్వం ఏడాదికి రూ.10 వేలు ఇచ్చి పలురకాల జరిమానాల రూపంలో ఆ సహాయాన్ని లాగేసింది. ఈ ఐదేళ్ల కాలంలో రహదారులకు మరమ్మతులు చేపట్టకపోవడంతో గోతులు పడి నెలలో ఒక్కసారైనా ఆటోను షెడ్‌కు తీసుకెళ్లాల్సి వస్తోంది. అలా వెళ్తే కనీసం రూ.2 వేల నుంచి రూ.3 వేలు వరకు ఖర్చవుతోంది. 

నాగరాజు, ఆటో డ్రైవర్‌

కేసులు అధికమయ్యాయి..

వాహనమిత్ర పేరుతో ఇచ్చేది రూ.10 వేలు అయినా అంతకు డబుల్‌ మా నుంచి వైకాపా ప్రభుత్వం లాగేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ట్రక్కులు, ఆటోలు, కార్ల మీద కేసులు అంతగా ఉండేవి కాదు. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత వాహనాలు నడిపే వారిపై కేసులు అధికమయ్యాయి.

పోతల సత్యనారాయణ, ఆటో డ్రైవర్‌

తెల్లరేషను కార్డు లేకపోవడంతో..

మాది నిరుపేద కుటుంబం. నేను ఆటో నడిపి కుటుంబాన్ని పోషించాలి. నాలుగున్నరేళ్ల క్రితం నా తండ్రి పేరిట ఉన్న తెల్ల రేషను కార్డు రద్దు చేశారు. ఎన్నిచోట్లకు తిరిగినా కార్డు పునరుద్ధరించలేదు. నా తండ్రి మరణించారు. రేషను కార్డు లేకపోవడంతో వాహన మిత్ర ఇవ్వలేదు. అన్ని అర్హతలు ఉన్నా ఎలాంటి ప్రయోజనం పొందలేని దుస్థితి.

మహేశ్‌, ఆటో డ్రైవర్‌

ఇచ్చినట్లే ఇచ్చి..

వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో, టాక్సీ డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేలు అందిస్తామంటూ గొప్పలు చెప్పిన సీఎం తర్వాత కొర్రీలు పెట్టడంతో చాలామంది అనర్హులుగా మిగిలిపోయారు. రూ.10 వేలు ఇచ్చి మరలా వివిధ ఛార్జీలు, కేసుల రూపంలో ఇచ్చినదానికంటే ఎక్కువే లాగేస్తున్నారు. రోజంతా ఆటో తిప్పినా పెరిగిన నిత్యావసరాల ధరలతో కుటుంబ పోషణ కష్టంగా మారుతోంది.  

పైలా శ్రీరామ్మూర్తి, ఆటో డ్రైవర్‌

రూ.2 వేలు అపరాధ రుసుం

ఆటోలో ఇద్దరు పాసింజర్లు ఎక్కువయ్యారని రూ.2 వేల చొప్పున అనేక పర్యాయాలు కేసులు రాసిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడున్న పెట్రోలు ధరలతో నిర్ణీత సంఖ్యలో ప్రయాణికులను తీసుకెళ్తే గిట్టుబాటు కాదు. ఒక చేత్తో రూ.10 వేలు ఇచ్చి రెండో చేత్తో కేసుల మీద కేసులు పెట్టి అపరాధ రుసుములు వసూలు చేస్తున్నారు.

గొట్టివాడ సన్యాసిరావు, ఆటో డ్రైవర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు