logo

సింహాచలం కొండపై.. ‘భూ’చోళ్లు

ఎన్నికల వేళ గుట్టుచప్పుడు కాకుండా సింహాచల దేవస్థాన భూముల ఆక్రమణకు పావులు కదిలాయి. వైకాపా పెద్దలు కొందరు ఇక్కడ చక్రం తిప్పుతున్నారు. స్థానికులు ప్రశ్నిస్తే సర్వే పేరుతో హడావుడి చేస్తున్నారు.

Updated : 01 May 2024 06:46 IST

ఎన్నికల వేళ చక్రం తిప్పుతున్న నేతలు
రూ.వంద కోట్ల విలువైన భూమిపై కన్ను
సర్వే పేరుతో చెట్లు కొట్టి, యంత్రాలతో కొండవాలు చదును
కళ్లప్పగించి చూస్తున్న దేవాదాయశాఖ అధికారులు

ఈనాడు-విశాఖపట్నం, అక్కయ్యపాలెం-న్యూస్‌టుడే: ఎన్నికల వేళ గుట్టుచప్పుడు కాకుండా సింహాచల దేవస్థాన భూముల ఆక్రమణకు పావులు కదిలాయి. వైకాపా పెద్దలు కొందరు ఇక్కడ చక్రం తిప్పుతున్నారు. స్థానికులు ప్రశ్నిస్తే సర్వే పేరుతో హడావుడి చేస్తున్నారు. నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ పనుల వద్దకు వైకాపా నాయకులు, కార్పొరేటర్లు కొందరు వచ్చివెళుతుండటంతో ఓ కీలక నేత అండ ఉందన్న చర్చ సాగుతోంది. ఆక్రమణదారులు కన్నేసిన దాదాపు ఏడు ఎకరాల భూమి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.100కోట్లపైమాటే.

నేతల అండతో: ఉత్తర నియోజకవర్గ పరిధిలోని గణేశ్‌నగర్‌ పక్కన ఉన్న సత్యవతి లే-అవుట్‌ ఆనుకుని కొండను కొందరు చదును చేస్తున్నారు. సర్వే నెంబరు 275లోని సింహాచలం దేవస్థానానికి చెందిన ఈ కొండవాలును రెండు భారీ యంత్రాలతో తవ్వేస్తున్నారు. తవ్వి తీసిన గ్రావెల్‌తో దిగువన లోతట్టు ప్రాంతం చదును చేస్తున్నారు. దేవస్థానం ఏర్పాటు చేసిన రక్షణ గోడ దాటి ఈ తంతంగం అంతా జరుగుతోంది. అక్కడ ఉన్న చెట్లను పూర్తిగా నరికేశారు. వాటిని రంపాలతో ముక్కలుగా కోసి ఆటోల్లో అక్కడి నుంచి తరలించేస్తున్నారు. పునాదుల్లో వేయడానికి రాళ్లు లారీల్లో తెచ్చి సిద్ధం చేశారు.30 అడుగుల రోడ్డుకూ ప్రణాళిక వేశారు.

ఈనాం పట్టాతో కథ నడుపుతూ: విజయనగర రాజుల ద్వారా సత్యవతమ్మ అనే మహిళకు ఈనాం పట్టా ఉన్నట్లు 7.05 ఎకరాలకు ఆర్డర్‌ గతంలో తెచ్చుకున్నారు. ఆ భూమిని అమ్మకాలు జరపగా, నిర్మాణాలు సైతం జరిగాయి. ఈనాం పట్టా కింద ఇచ్చిన భూమితోపాటు మరికొంత ఆక్రమించి అమ్మకాలు చేశారన్న ఆరోపణలు గతంలో వచ్చాయి. దేవాదాయశాఖలో కొందరు అధికారుల సహకారంతోనే అప్పట్లో ఈ వ్యవహారం చక్కబెట్టారనే ఫిర్యాదులందడంతో దేవాదాయశాఖ ఉన్నతాధికారి ఆదేశాలతో సర్వే చేశారు. ఈనాం ఆర్డర్‌ కంటే ఎక్కువ భూమి అమ్మేసినట్లు గుర్తించినట్లు సమాచారం. ఆ ప్రదేశంలో ఎలాంటి పనులు, నిర్మాణాలు చేపట్టకుండా అప్పటి నుంచి అడ్డుకుంటున్నారు. మళ్లీ ప్రస్తుతం కొందరు అదే ఏడు ఎకరాలు ఈనాం పట్టా తెరపైకి తెచ్చి కథ నడిపిస్తున్నట్లు సమాచారం.

సర్వే పేరుతో: ఈనాం ఆర్డర్‌ చూపించి గతంలో దాదాపు 5 వేల గజాలు ఓ సంస్థకు విక్రయించారు. ఆ సంస్థకు ఇవ్వడానికి అక్కడ భూమి లేదు. దీంతో హద్దులు మార్చేసి ఇంకా తమ భూమి కొండవాలులో మిగిలి ఉందని చూపించడానికి సర్వే పేరుతో భారీ ప్రణాళిక రూపొందించారు. ఆ ఐదు వేల గజాల స్థలం అందులో కట్టబెట్టేందుకు చక్రం తిప్పారు. ఇందులో భాగంగా వైకాపా కీలక నాయకుడి అండతోపాటు, కొందరు అధికారులను ప్రసన్నం చేసుకుని సర్వేకు ఆర్డర్‌ తెచ్చుకున్నట్లు విమర్శలున్నాయి. దీనిపై దేవాదాయశాఖ ఏఈవో రమణమూర్తిని వివరణ కోరగా... 1994లో ఈనాంకు ఎన్వోసీ ఇచ్చామని, ఆ స్థలాలు అమ్మేసి ఇష్టమొచ్చినట్లు చేస్తున్నారని పేర్కొన్నారు. అందుకే హద్దుల గుర్తింపునకు సర్వే నోట్‌ ఇచ్చామని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని