logo

కూటమికి స్వతంత్ర అభ్యర్థి శిరీష మద్దతు

విశాఖ ఉత్తరం, తూర్పు నియోజకవర్గాల నుంచి గాజుగ్లాసు గుర్తుపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వడ్డి శిరీష కూటమి అభ్యర్థులకు తన మద్దతు ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం తెదేపా కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.

Published : 08 May 2024 03:31 IST

మాట్లాడుతున్న స్వతంత్ర అభ్యర్థి వడ్డి శిరీష.. చిత్రంలో పి.విష్ణుకుమార్‌రాజు, వెలగపూడి రామకృష్ణబాబు, మహమ్మద్‌ నజీర్‌ తదితరులు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: విశాఖ ఉత్తరం, తూర్పు నియోజకవర్గాల నుంచి గాజుగ్లాసు గుర్తుపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వడ్డి శిరీష కూటమి అభ్యర్థులకు తన మద్దతు ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం తెదేపా కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన సాగుతోందని, కూటమితోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్నట్లు తెలిపారు. ఈ కారణంగా తాను సాంకేతికంగా ఎన్నికల బరిలో ఉన్నప్పటికీ భాజపా, తెదేపా అభ్యర్థులు విష్ణుకుమార్‌రాజు, వెలగపూడి రామకృష్ణబాబుకు మద్దతు ఇస్తున్నానని, వారి విజయానికి తన వంతు ప్రచారం చేస్తానని తెలిపారు. తనకు కేటాయించిన గాజుగ్లాసు గుర్తుపై ఎవరూ ఓట్లు వేయద్దని విజ్ఞప్తి చేశారు. తూర్పు తెదేపా అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ సహృదయంతో కూటమికి మద్దతు తెలిపిన శిరీషకు ధన్యవాదాలు తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో గాజుగ్లాసు గుర్తుపై ఓటు వేయాలనుకొనే వారు సైకిల్‌కు వేయాలన్నారు. ఉత్తరం భాజపా అభ్యర్థి పి.విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ ఉత్తరం, తూర్పు నియోజకవర్గాల్లో జనసేన గుర్తు గాజుగ్లాసును స్వతంత్ర అభ్యర్థి శిరీషకు కేటాయించారన్నారు. దీనివల్ల కూటమికి ఇబ్బంది కలుగుతుందని భావించిన ఆమె పోటీ నుంచి తప్పుకోవడంపై అభినందించారు. తెదేపా ఉత్తర నియోజకవర్గ బాధ్యులు మహమ్మద్‌ నజీర్‌, తెదేపా రాష్ట్ర కార్యదర్శి చోడె వెంకట పట్టాభి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు