logo

రేవులో తేలిన జగన్‌ హామీలు..!

తూర్పు తీరంలో విశాఖ చేపలరేవు అతి పెద్దది. వేలాది మంది మత్స్యకారులు, బోటు ఆపరేటర్లు దీనిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీరికి కష్టాలు మొదలయ్యాయి.

Updated : 08 May 2024 06:05 IST

బోటు ఆపరేటర్లకు అందని పరిహారం
ముందుకుసాగని నవీకరణ పనులు
వైకాపా సర్కారుపై మత్స్యకారుల తీవ్ర ఆగ్రహం
వన్‌టౌన్‌, న్యూస్‌టుడే

తూర్పు తీరంలో విశాఖ చేపలరేవు అతి పెద్దది. వేలాది మంది మత్స్యకారులు, బోటు ఆపరేటర్లు దీనిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీరికి కష్టాలు మొదలయ్యాయి. వీరికిచ్చిన హామీల్లో అధికశాతం అమలు కాలేదు. ఏడాదిగా చేపలరేవు అభివృద్ధి ఒక అడుగు ముందుకు..నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతోంది. మరో పక్క మత్స్య ఉత్పత్తుల ఎగుమతులు తగ్గిపోవడంతో గిట్టుబాటు ధర లభించక మత్స్యకారులు నష్టపోతున్నారు.

నిర్మాణంలో ఉన్న భవనాలు

ఖాతాలకు జమకాని పరిహారం

చేపలరేవు విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో ఉంది. మాజీ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్‌కుమార్‌ రెండు సార్లు ప్రాతినిధ్యం వహించారు. అయినా రేవులో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని మత్స్యకారులు వాపోతున్నారు. సొంత సామాజిక వర్గానికి చెందిన వాసుపల్లి తమను విస్మరించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తుపాన్లు, ఇతర వైపరీత్యాలు, అగ్నిప్రమాదాల్లో 36 బోట్లు మునిగిపోవడంతోపాటు దగ్ధమయ్యాయి. బాధితులకు పరిహారం అందజేస్తామని వాసుపల్లి హామీ ఇచ్చినా అందలేదు. ఇటీవల అగ్నిప్రమాదంలో దగ్ధమైన బోట్లకు రూ.1.36కోట్లు మంజూరైందని చెప్పారు. అయితే ఇంత వరకు బాధితుల బ్యాంకు ఖాతాలకు జమకాలేదు.

చేపలరేవులో 2019 మార్చి నుంచి అక్టోబరు వరకు బోటు ఆపరేటర్లకు ఆయిల్‌ రాయితీ నిధులు దాదాపు రూ.కోటి విడుదల కాలేదు. ఆయా నిధులు ప్రభుత్వం నుంచి వచ్చేలా చూస్తానని పలుమార్లు వాసుపల్లి హామీల వర్షం కురిపించారు. అయితే నిధులు ఇంత వరకు రాలేదని బాధితులు వాపోతున్నారు.

చేపలరేవులో మునిగి ఉన్న బోటు

ఆధునిక చేపలమార్కెట్‌ మూలకు..

చేపలరేవులో 2019లో రూ.2.78కోట్లు ఖర్చు చేసి ఆధునిక చేపలమార్కెట్‌ను నిర్మించారు. 100 మంది వర్తకుల అవసరాలకు తగ్గట్టుగా వసతులు కల్పించారు. మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజుతో కలిసి ఏడాది క్రితం వాసుపల్లి మార్కెట్‌ను ప్రారంభించారు. ఇంతవరకు అది వినియోగంలోకి రాలేదు. దీంతో చేపలరేవు ఆరుబయటే విక్రయాలు సాగుతున్నాయి. పరిశుభ్ర వాతావరణంలో అమ్మకాలు సాగించేందుకు మార్కెట్‌ను నిర్మిస్తే దాన్ని వినియోగంలోకి తేవడంలో వాసుపల్లి నిర్లక్ష్యం వహించారని ఆయా వర్గాలు మండిపడుతున్నాయి.


‘ఉపాధి’ మాటలు..నీటి మూటలు

  • చేపలరేవులో ఎండు చేపలు ఆరబెట్టేందుకు అనువైన స్థలం కేటాయించాలని మత్స్యకార మహిళలు పలుమార్లు వాసుపల్లిని కోరారు. అదీ అమలు కాలేదు. కంటైనర్‌ టెర్మినల్‌ కార్పొరేషన్‌లో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించే హామీ నెరవేరలేదు. ఇవే కాకుండా గత అయిదేళ్లలో మత్స్యకారులకు అవసరమైన వలలు, వేటకు ఉపయోగించే పరికరాలను అందజేయలేదు.
  • చేపలరేవు నవీకరణ పనులు ఏడాది నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు రహదారులు, షెడ్ల నిర్మాణ పనులే పూర్తి కాలేదు. జెట్టీల నవీకరణ పనులు చేపట్టాల్సి ఉంది. ఆయా పనులు ముందుకు సాగకపోవడంపై మత్స్యకార వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి సిద్ధమవుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు