logo

అంతు చూసేలా.. అన్యాయం చేసేలా..!!

ఉద్యమాలపై పూర్తి నిరంకుశ వైఖరి ప్రదర్శించారు. ఉపాధ్యాయులు, స్టీల్‌ప్లాంట్‌, సమగ్రశిక్ష, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు.. ఇలా అందరినీ అణచివేసేందుకు ప్రయత్నించారు. ‘నా అక్కచెల్లెమ్మలు’ అంటూ ప్రేమ నటించే జగన్‌..

Updated : 08 May 2024 06:03 IST

ఉద్యమాలపై జగన్‌ ఉక్కుపాదం
వైకాపా పాలనలో ఉద్యోగులపై నిరంకుశ వైఖరి
ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం

‘ఉద్యోగులకు కాళ్లు పట్టుకునే నేర్పు ఉండాలి’ ఉపాధ్యాయ ఉద్యమం సందర్భంగా బాధ్యత గల పదవిలో ఉన్న ఓ సీనియర్‌ మంత్రి అన్న మాటలివి.


హక్కుల కోసం ప్రశ్నిస్తే అరెస్టులు.. డిమాండ్ల సాధనకు పోరాడితే నిర్బంధాలు.. ఎదురు తిరిగితే దాడులు.. వైకాపా అయిదేళ్ల పాలన ఇలాగే సాగింది.


ద్యమాలపై పూర్తి నిరంకుశ వైఖరి ప్రదర్శించారు. ఉపాధ్యాయులు, స్టీల్‌ప్లాంట్‌, సమగ్రశిక్ష, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు.. ఇలా అందరినీ అణచివేసేందుకు ప్రయత్నించారు. ‘నా అక్కచెల్లెమ్మలు’ అంటూ ప్రేమ నటించే జగన్‌.. మహిళలపైనా కనీసం జాలి చూపలేదు. ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, మధ్యాహ్న భోజన కార్మికులనూ అవస్థలకు గురి చేశారు. వారికి మద్దతు తెలిపిన ప్రతిపక్షాలు, వామపక్ష, అఖిలపక్ష కార్మిక, ప్రజాసంఘాల నాయకులనూ అరెస్టు చేశారు.

ఉపాధ్యాయులపై దమనకాండ: కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) రద్దు, పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌) పునరుద్ధరణ, బకాయిల విడుదల, తదితర డిమాండ్లను ఉపాధ్యాయులు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. దీంతో ఏటీఎఫ్‌, యూటీఎఫ్‌ తదితర సంఘాల ఆధ్వర్యంలో పలుమార్లు శాంతియుత ఆందోళన చేపట్టారు. సీపీఎస్‌ రద్దు చేయాలంటూ 2022లో ముఖ్యమంత్రి కార్యాలయ ముట్టడికి  యూటీఎఫ్‌ పిలుపునిచ్చింది. ఆందోళనకు వెళ్లకుండా పాఠాలు చెప్పే సమయంలోనూ పోలీసులు కాపలా ఉన్నారు. ఆ కార్యక్రమానికి బయలుదేరిన జిల్లాకు చెందిన ఉపాధ్యాయులను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించారు.

పారిశుద్ధ్య కార్మికులపై కాఠిన్యం: డిమాండ్ల సాధనకు సమ్మెకు దిగిన పారిశుద్ధ్య కార్మికులపైనా అధికారులు బెదిరింపులకు దిగారు. విధుల్లో చేరకపోతే ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని నోటీసులిచ్చారు. పీఎం పాలెంలో అధికారులు చెత్త తరలింపు వాహనాలను తీసుకెళ్తుండగా.. మనస్తాపానికి గురైన ఓ కార్మికుడు ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

నిరసన శిబిరంలో ఉద్యోగులు

మళ్లీ గెలిస్తే...:  ‘ధరలు పెరిగాయి వేతనాలు పెంచాలని కోరితే సీఎం పట్టించుకోలేదు. అయిదేళ్లలో వినతి పత్రం ఇచ్చేందుకూ జగన్‌ అనుమతించలేదు. మళ్లీ వైకాపా అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమ్మేసే ప్రమాదముంది. పోరాటం అనే పదం వినిపించకుండా అన్ని వర్గాలను అణచివేస్తారు’ అని సీఐటీయూ జిల్లా గౌరవాధ్యక్షురాలు పి.మణి పేర్కొన్నారు.

‘ఆశా’లపై ఆక్రోషం: వేతనాలు పెంచాలని, పని భారం తగ్గించాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరుతూ ఆశా కార్యకర్తలు ఫిబ్రవరిలో ‘చలో విజయవాడ’కు పిలుపునిచ్చారు. వారిపై పోలీసులు జులుం ప్రదర్శించారు. విజయవాడ వెళ్లకుండా ముందస్తు అరెస్టులు చేశారు. మహిళలను ఈడ్చి పడేశారు. వివిధ మార్గాల్లో జిల్లా నుంచి విజయవాడ రైల్వేస్టేషన్‌, బస్టాండ్లకు వెళ్లిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. బస్సులో నూజివీడు తరలించి ఓ కళాశాలలో నిర్బంధించారు. తాగేందుకు మంచినీరు, కాలకృత్యాలు తీర్చుకునేందుకూ అవకాశమివ్వకుండా ఇబ్బంది పెట్టారు. జీవీఎంసీ కార్యాలయం ఎదుట శాంతియుతంగా నిరసన తెలిపిన కార్యకర్తలనూ పోలీసులు ఇబ్బంది పెట్టారు.

‘అంగన్‌వాడీ’లపై ఎస్మా ప్రయోగం: జీతాల పెంపు, సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని అంగన్‌వాడీ కార్యకర్తలు గతేడాది డిసెంబరులో సమ్మె చేపట్టారు. సమ్మె విరమించకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరికలు జారీ చేశారు. జనవరిలో కలెక్టరేట్‌ ముట్టడికి పిలుపునిస్తే.. ఎక్కడికక్కడ పోలీసులు రోప్‌ పార్టీలతో అడ్డుకున్నారు.వ్యానుల్లో ఎక్కించి, స్టేషన్‌కు తీసుకెళ్లారు. సమ్మె అణిచివేయడానికి ఎస్మా చట్టాన్ని ప్రయోగించగా రద్దు చేయాలని ఆందోళన చేపట్టిన అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జవనరిలో ‘చలో విజయవాడ’కు పిలుపునిస్తే.. ముందు రోజు రాత్రి పోలీసులు ప్రతి అంగన్‌వాడీ ఇంటికి వెళ్లి తనిఖీలు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు