logo

విశాఖ యువతకు.. లక్ష ఉద్యోగాలు

‘వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయింది. యువతకు ఉపాధి లేకుండా పోయింది. కొత్త పరిశ్రమలు రాకపోగా.. ఉన్నవి కూడా మూతపడ్డాయి.  డిగ్రీలతో బయటకొస్తున్న యువతకు  తగిన ఉద్యోగాలు లేవు.

Updated : 08 May 2024 06:00 IST

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రద్దు చేస్తాం
మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే
50 ఏళ్లకే పింఛను రూ. 4000
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం
ప్రశాంత నగరంగా విశాఖను తీర్చిదిద్దుతా
‘ఈనాడు’ ముఖాముఖి’లో తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌
ఈనాడు, విశాఖపట్నం

‘వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయింది. యువతకు ఉపాధి లేకుండా పోయింది. కొత్త పరిశ్రమలు రాకపోగా.. ఉన్నవి కూడా మూతపడ్డాయి.  డిగ్రీలతో బయటకొస్తున్న యువతకు  తగిన ఉద్యోగాలు లేవు.

కూటమి అధికారం చేపట్టగానే చంద్రబాబు మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే ఉంటుంది. ఏటా జాబ్‌క్యాలెండర్‌, బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేస్తాం. 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. విశాఖలోని నిరుద్యోగ యువతకు లక్ష ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళిక ఉంది. ప్రభుత్వం మారిన వెంటనే పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తామని ఇప్పటికే కొందరు పెట్టుబడిదారులు సంప్రదించారు’

- అని విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ కూటమి తెదేపా ఎంపీ అభ్యర్థి మతుకుమిల్లి శ్రీభరత్‌ పేర్కొన్నారు. ప్రచారంలో దూసుకుపోతున్న శ్రీభరత్‌ ‘ఈనాడు’ ముఖాముఖిలో
పలు అంశాలు వెల్లడించారు. అవి ఆయన మాటల్లోనే.


ప్రతి మహిళకు నెలకు రూ. 1500

కూటమి మ్యానిఫెస్టో మహిళల అభివృద్ధికి దోహదపడుతుంది. 19 నుంచి 59 ఏళ్ల వయసున్న ప్రతి మహిళకు నెలకు రూ.1500లు ఇస్తాం. అయిదేళ్లకు రూ.90 వేల సాయం అందుతుంది. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేల చొప్పున అయిదేళ్లకు రూ.75 వేలు అందిస్తాం. ఆయా కుటుంబాల్లో ఎంతమంది ఉంటే ఆ విద్యార్థులంతా అర్హులే. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో రాష్ట్ర ఆర్థిక ప్రగతి మెరుగవుతుంది. ఖర్చు లేకపోవడంతో మహిళలు ఉద్యోగాలు, వివిధ రకాల పనులు చేయడానికి ఆసక్తి  చూపుతారు. డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంతో మహిళలు స్వయం సమృద్ధి సాధిస్తారు. అంగన్‌వాడీలకు గ్రాట్యుటీ చెల్లింపు, ఆశాకార్యకర్తలకు కనీస వేతనాన్ని పెంచుతాం. అలాగే ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్‌ వసతి, విద్యార్థినులకు ‘కలలకు రెక్కలు’ పథకం ద్వారా వారికి నచ్చిన ఉన్నత చదువులు చదివేందుకు వీలుగా రుణ సాయం అందిస్తాం.


చెత్త పన్ను రద్దుపై సమీక్ష: వైకాపా పాలనలో ప్రజలపై పన్నుల భారం విపరీతంగా పెరిగింది. ఆస్తి పన్నుతో పాటు చెత్త పన్నుతో బాదేశారు. విద్యుత్తు బిల్లులు రెట్టింపయ్యాయి. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే ధరల నియంత్రణ మీద దృష్టిసారిస్తుంది. చెత్త పన్ను రద్దుతో పాటు ఆస్తి పన్ను విధానాన్ని సమీక్షిస్తాం. వాస్తవంగా రాష్ట్రానికి పెట్టుబడులు రాక.. కొత్త పరిశ్రమలు లేక.. ఉపాధి దొరక్క ప్రజలకు కొనుగోలు శక్తి పడిపోయింది. బ్యాడ్జి ఉన్న డ్రైవర్లకు రూ.15 వేలు ఇస్తాం. జరిమానా, హరితపన్ను భారం తగ్గిస్తాం. ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేదల మీద చాలా భారాన్ని తగ్గిస్తాయి. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తాం.


ముస్లిం మైనార్టీలకు పట్టణాల్లోని ఈద్గా, ఖబరస్తాన్‌లకు స్థలాల కేటాయింపు, మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, ఇమామ్‌లకు ప్రతి నెలా రూ.10 వేలు, మౌజన్‌లకు రూ.5 వేలు గౌరవవేతనం, మసీదుల నిర్వహణకు ప్రతి నెలా ఆర్థిక సాయం చేస్తాం. క్రిస్టియన్‌ మిషనరీల ఆస్తుల అభివృద్ధికి బోర్డు ఏర్పాటు చేస్తాం. జెరూసలెం, హజ్‌ యాత్రికులకు సాయం అందిస్తాం.


వైకాపాకు ఓటేస్తే ఆస్తులకు రక్షణ ఉండదు: ప్రజల ఆస్తులకు ప్రమాదకారైన ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తుంది.  చంద్రబాబు రెండో సంతకం దాని మీదే చేస్తారు. ప్రజలు వైకాపాకు ఓటేస్తే వారి ఆస్తులను దొంగల చేతిలో పెట్టినట్లే. మన తాతతండ్రుల నుంచి వచ్చిన ఆస్తుల మీద జగన్‌ బొమ్మ అనేది అసంబద్ధం. ఈ చట్టం రాకముందే విశాఖలోని అనేక మంది ఆస్తులు వైకాపా పెద్దల చేతిల్లోకి వెళ్లిపోయాయి.


రైతులకు రూ. 20 వేలు: అన్నదాతలను ఆదుకునేందుకు ఏటా 20 వేల రూపాయలను అందిస్తాం. ఇది వారికెంతో భరోసాగా ఉంటుంది. కర్షకులకు మేలు చేసే నిర్ణయాలు అమలు చేస్తాం.


నిరుద్యోగ భృతి రూ. 3 వేలు:  యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళికలు అమలు చేస్తాం. యువత నిరాశలో కూరుకుపోకుండా నిరుద్యోగ భృతిగా  నెలకు  రూ. 3 వేల చొప్పున అందిస్తాం.


విశాఖకు ప్రత్యేకంగా..

వాల్తేరు డివిజన్‌తో కూడిన రైల్వేజోన్‌ కల సాకారానికి కృషి చేస్తా. దీనివల్ల కొత్త రైళ్లతో పాటు యువతకు ఉద్యోగాలు వస్తాయి. స్టీలుప్లాంటు ప్రైవేటీకరణను అడ్డుకొని నిర్వాసితులు, కార్మికుల పక్షాన పోరాడుతా. పార్లమెంటులో గట్టిగా ప్రశ్నించి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెడతా. విశాఖను ఐటీ, పర్యాటక, పారిశ్రామికనగరంగా తీర్చిదిద్దుతా. సైబర్‌సిటీగా  కొత్త రూపు తీసుకొస్తా. పోలవరం ద్వారా విశాఖ దాహార్తిని తీర్చేందుకు సాయ పడతా. స్మార్ట్‌ టెక్నాలజీతో పోర్టు కాలుష్యాన్ని నియంత్రిస్తా. ఆనందపురం-అగనంపూడి మధ్య ప్రయాణం సులభతరం అయ్యేలా పైవంతెనలు, అండర్‌పాసులు నిర్మిస్తాం. పెందుర్తి-అరకు వరకు నాలుగు వరుసల రహదారి నిర్మిస్తాం. వైకాపా పాలనలో ఇప్పటికే విశాఖ డ్రగ్స్‌, గంజాయి కేంద్రంగా మారిపోయింది. హత్యలు, దోపిడీలు, కిడ్నాప్‌లు పెరిగిపోయాయి. మళ్లీ ప్రశాంత విశాఖ నగరాన్ని మనమంతా చూస్తాం. ఎంపీ అయ్యాక నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తా.


మత్స్యకారులకు రూ. 20 వేలు.. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం: బీసీల రక్షణకు తెదేపా ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తుంది. వివిధ బీసీ వర్గాలకు రూ.5 వేల కోట్లతో ఆదరణ కల్పిస్తాం. మత్స్యకారులకు వేట విరామ సమయంలో రూ.20 వేల ఆర్థిక సాయం, సెలూన్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో పది శాతం కేటాయింపు, క్వారీల్లో వడ్డెరలకు 15 శాతం రిజర్వేషన్‌, రాయల్టీ, సీనరేజ్‌ ఛార్జీల్లో మినహాయింపు, రజకుల ధోబీ ఘాట్ల నిర్మాణాలకు ప్రోత్సాహం, విద్యుత్తు ఛార్జీల్లో రాయితీ ఇస్తాం.


చంద్రన్న బీమాతో పేదలకు అండ: పింఛను లబ్ధిదారులపై వైకాపా కత్తికట్టినట్లు వ్యవహరించింది. ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని తెదేపా మీద నెట్టి పబ్బం గడుపుకోవాలని చూసింది. తెదేపా అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే రూ.4 వేల పింఛను ఇచ్చి ఆదుకుంటాం. దివ్యాంగుల పింఛను రూ.6 వేలకు, తలసేమియా, కిడ్నీ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు రూ.10 వేలకు పెంచి ఇస్తాం. అర్చకులకు కనీస వేతనం రూ.15 వేలు, దేవాలయాల్లో పనిచేసే నాయీబ్రాహ్మణులకు రూ.25 వేలు ఇస్తాం. చంద్రన్న బీమా పథకం కింద సహజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల బీమా ఆయా కుటుంబాలకు ఆసరాగా ఉంటుంది.


ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు..

జగన్‌  ప్రభుత్వంలో ఉద్యోగులు, పింఛనర్లు చాలా ఇబ్బంది పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వారందరికీ ఒకటో తేదీన జీతాలు పడేలా చేస్తాం.  ఐఆర్‌ ప్రకటిస్తాం. బకాయిల చెల్లింపునకు ఏర్పాట్లు చేస్తాం. పెన్షనర్లకు ప్రత్యేక కార్పొరేషన్‌ దిశగా చర్యలు తీసుకుంటాం. తక్కువ వేతనాలు పొందే పొరుగుసేవలు, కాంట్రాక్టు, కన్సాలిడేటెడ్‌ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు