logo

అక్కంపేట వేదికగా అధికారంపై గురి

తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య జయశంకర్‌ స్వగ్రామం అక్కంపేట వేదికగా కాంగ్రెస్‌ అధికారంపై గురి పెట్టింది. ఈ నెల 6న రాహుల్‌గాంధీ వరంగల్‌ నగరంలో రైతు సంఘర్షణ సభలో పాల్గొని వరంగల్‌ డిక్లరేషన్‌ ప్రకటించారు

Updated : 22 May 2022 05:25 IST

ఈనాడు, వరంగల్, ఆత్మకూరు, న్యూస్‌టుడే: తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య జయశంకర్‌ స్వగ్రామం అక్కంపేట వేదికగా కాంగ్రెస్‌ అధికారంపై గురి పెట్టింది. ఈ నెల 6న రాహుల్‌గాంధీ వరంగల్‌ నగరంలో రైతు సంఘర్షణ సభలో పాల్గొని వరంగల్‌ డిక్లరేషన్‌ ప్రకటించారు. ఇప్పుడు దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు మళ్లీ హనుమకొండ జిల్లాలోనే హస్తం పార్టీ అంకురార్పణ చేసింది. శనివారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని అక్కంపేటలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రైతు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. 

రచ్చబండ వద్దే.. 

అక్కంపేట నడిబొడ్డులోని రావి చెట్టు కింద రచ్చబండ వద్దే ఈ కార్యక్రమం నిర్వహించారు. అక్కంపేట, ఆత్మకూరు మండలంలోని అనేక గ్రామాల నుంచి కాంగ్రెస్‌ శ్రేణులు జనసమీకరణ చేపట్టారు. రేవంత్‌రెడ్డి పర్యటన ఆద్యంతం కార్యకర్తలు, నాయకుల హర్షధ్వానాలు, కేరింతల మధ్య సాగింది. వీరి వెంట నియోజకవర్గ బాధ్యులు ఇనగాల వెంకట్రామరెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర నాయకులు అంజన్‌కుమార్‌యాదవ్, జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి, మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ, ఎంపీపీ భీమగాని సౌజన్య, మండల అధ్యక్షుడు కమలాపురం రమేష్, మీసాల ప్రకాష్, ఎంపీటీసీ సభ్యురాలు పోగుల ఇందిర, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


రచ్చబండలో రేవంత్‌రెడ్డి తన ప్రసంగం కన్నా ముందే పలువురు రైతులను వేదికపై పిలిచి వారితో మాట్లాడించారు. 

రైతుబంధుతో భూస్వాములకే లాభం: వాసల భద్రారెడ్డి

రైతుబంధు కావాలని ఏ రైతు కూడా ప్రభుత్వాన్ని అడగలేదు. రైతుబంధు ఇస్తూ ప్రభుత్వం అనేక రాయితీలు ఎత్తేసింది. ఎరువులు ధరలు పెంచి రైతులను ఇబ్బందులకు గురిచేస్తుంది. పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తే చాలు. 


ఉద్యమం గురించి మాతో చర్చించేవారు: ముద్దం సాంబయ్య

తెలంగాణ ఏర్పడిన తర్వాత జయశంకర్‌ స్వగ్రామానికి ప్రభుత్వం ఏం చేయలేదు. గతంలో జయశంకర్‌ మామిడితోటలో మాతో కూర్చొని తెలంగాణ అంశాలను తెలిపేవారు. పాఠశాల కోసం ఎకరం, యాదవుల కోసం నాలుగు ఎకరాల భూమిని  ఇచ్చారు. 


యాదవులకు మోసం:  ఓదెలు 

యాదవులకు ప్రభుత్వం చేసిందేమీలేదు. గొర్రెల పథకం పెట్టి కడప జిల్లాకు పంపించారు. అక్కడి నుంచి వచ్చే లోపు అవి చనిపోయాయి. 


కేసు వెనక్కి తీసుకోను: హేమలత

దళిత మహిళనైన నాపై గత ఎంపీటీసీ ఎన్నికల్లో తెరాస నాయకులు.. వారికి ఓట్లు వేయలేదని, దాడి చేయగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. కేసును వెనక్కి తీసుకోవాలని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేసును వెనక్కి తీసుకోను.


‘సంతకం చేయొద్దు.. కోర్టుకైనా వెళ్దాం’

ధర్మసాగర్‌: కుడా ల్యాండ్‌ ఫూలింగ్‌తో వందల సంఖ్యలో రైతులు నిరుపేదలుగా మారుతారని ధర్మాపురం గ్రామ బాధిత రైతులు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. తాము తెరాసకు చెందిన వారమే అయినా మా జీవితాలను కోల్పోతున్నందున మీ వద్దకు వచ్చామంటూ మొర పెట్టుకున్నారు. రేవంత్‌రెడ్డి స్పందిస్తూ ల్యాండ్‌ పూలింగ్‌పై రైతులు సంతకం చేయవద్దని, అవసరమైతే కోర్టుకు వెళ్దామని, మద్దతుగా నిలుస్తానని హామీ ఇచ్చారు. 

భీమారం: ల్యాండ్‌ పూలింగ్‌ జీవోను ఎత్తివేయాలని ఆరెపల్లి, పైడిపల్లి, కొత్తపేట గ్రామాల రైతుల ఆందోళనకు రేవంత్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు. తిరుగు ప్రయాణంలో వీరిని కలిశారు. రైతు ఐకాస వరంగల్‌ జిల్లా కన్వీనర్‌ పెద్దన్నతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పర్యటన సాగిందిలా.. 

మధ్యాహ్నం 12:57 : అగ్రంపహాడ్‌ సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు..

1:30 : జయశంకర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

1:50 : అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు.

2:15 : పోచమ్మ గుడి వద్ద కాంగ్రెస్‌ జెండాను ఎగరవేశారు.

2:29 : రచ్చబండకు చేరుకొని రైతుల సమస్యలు తెలుసుకొని మాట్లాడారు.

3:49 : చిలువేరు జాన్, లత దంపతుల ఇంట్లో భోజనం చేశారు.

4:00 తర్వాత:  గీసుకొండ మండలం మొగిలిచర్ల, వరంగల్‌ మండలం  కొత్తపేటలో ల్యాండ్‌పూలింగ్‌ రైతులతో మాట్లాడారు.

5:00 హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని