logo

కక్షిదారులకు ఈ-న్యాయ సేవలు

వివిధ న్యాయస్థానాల్లో కక్షిదారులకు వారి కేసులకు సంబంధించిన సమాచారం, ధ్రువపత్రాలు, న్యాయసహాయం తదితర సేవలు మరింత సులభతరం కానున్నాయి.

Published : 27 Apr 2024 02:46 IST

న్యూస్‌టుడే, భూపాలపల్లి

వివిధ న్యాయస్థానాల్లో కక్షిదారులకు వారి కేసులకు సంబంధించిన సమాచారం, ధ్రువపత్రాలు, న్యాయసహాయం తదితర సేవలు మరింత సులభతరం కానున్నాయి.. ఇందుకు న్యాయ శాఖ రాష్ట్రంలోని 32 న్యాయస్థానాల్లో ‘ఈ -సేవా కేంద్రాలను’ అందుబాటులోకి తీసుకొచ్చింది.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవల హైదరాబాద్‌లో పర్యటించిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు జయశంకర్‌ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి పి.నారాయణబాబు ప్రధాన కోర్టు ఆవరణలో గత నెల క్రితం ఈ-సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రత్యేకంగా తయారు చేసిన క్యాబిన్‌లో ఈ-సేవలను మరికొద్ది రోజుల్లోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు కోర్టు సిబ్బంది ద్వారా తెలిసింది. న్యాయస్థానంలో అవసరమైన ధ్రువపత్రాలు, కేసులకు సంబంధించి సమాచారం, జిల్లా, రాష్ట్ర జాతీయ న్యాయ సేవా అధికార సంస్థల ద్వారా న్యాయ సహాయం, సలహాలు పొందేలా వీలు కల్పించారు. ప్రస్తుతం కక్షిదారులు కేసు వివరాలను తెలుసుకోవాలంటే నేరుగా ఆయా న్యాయస్థానాలకు వెళ్లి సంబంధిత సెక్షన్‌లను తీసుకోవాల్సి వస్తోంది. ఇలా తీసుకునేటప్పుడు ఆ సెక్షన్‌లో ఉండే అధికారి పని ఒత్తిడిలో ఉంటే.. అవసరమైన సమాచారం తీసుకోవడానికి కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చేది.. ఒకవేళ హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో కేసులున్నా వాటికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలంటే కక్షిదారులు విధిగా అక్కడికి వెళ్లాల్సి వచ్చేది. దీంతో కక్షిదారులు వ్యయ ప్రయాసలకు గురి కావాల్సి వచ్చేది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ‘ఈ-సేవా కేంద్రం’ ద్వారా కక్షిదారులకు చాలా వరకు ఇబ్బందులు దూరం కానున్నాయి. ఏ కోర్టుకు సంబంధించిన కేసుల సమాచారం కావాలన్నా ఈ కేంద్రం ద్వారా సులభంగా పొందవచ్చు. కేసులకు సంబంధించిన ధ్రువపత్రాలు, సర్టిఫైడ్‌ కాపీలు కావాలనుకుంటే మాత్రం నిర్ణీత రుసుము చెల్లించి పొందాల్సి ఉంటుంది.


కేంద్రం ఉపయోగాలివే..

  • కేసుల స్థితిగతులు, తదుపరి విచారణ తేదీ, సర్టిఫైడ్‌ కాపీలకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ
  • హార్డ్‌కాపీ పిటిషన్ల స్కానింగ్‌, ఈ-సంతకం, వీటిని సీఐఎస్‌లోకి దాఖలు చేయడం, ఫైలింగ్‌ నంబరును జనరేట్‌ చేయడం వంటి వాటితో పిటిషన్ల ఈ-ఫైలింగ్‌ చేయడం..
  • ఈ- స్టాంప్‌ పేపర్ల కొనుగోలులో కక్షిదారులకు సహాయపడటం, ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ఆధారిత చరవాణుల్లో ఈ-కోర్ట్సు అనుసంధానం చేయడం, తద్వారా సమాచారం డౌన్లోడ్‌ చేసుకోవడంలో సహాయపడటం..
  • ఈ-ములాఖత్‌ అపాయింట్‌మెంట్‌ ద్వారా జైలులో ఉన్న బంధువులను కలపడానికి సహాయపడటం, సెలవుపైనున్న న్యాయాధికారులకు సంబంధించిన విచారణలకు సమాధానం ఇవ్వడం..
  • జిల్లా, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయ సేవాధికార సంస్థల నుంచి ఉచిత ఉచిత న్యాయ సేవలను ఎలా పొందాలనే విషయంలో మార్గనిర్దేశం చేయడం.
  • ట్రాఫిక్‌ చలాన్లు, చిన్న నేరాలకు సంబంధించిన జరిమానా చెల్లింపులను ఆన్‌లైన్‌లో చెల్లించేందుకు ఈ- సేవా కేంద్రాల్లో వీలు కల్పించారు. అదేవిధంగా ఈ-కోర్టు సేవల ద్వారా డిజిటల్‌ రూపంలో అందుబాటులో ఉన్న ఇతర సేవల గురించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని