logo

పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ

లోక్‌సభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సాధారణ ఎన్నికల పరిశీలకురాలు బండారి స్వాగత్‌ రణ్వీర్‌చంద్‌ సంబంధిత అధికారులకు సూచించారు.

Published : 27 Apr 2024 03:10 IST

వరంగల్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సాధారణ ఎన్నికల పరిశీలకురాలు బండారి స్వాగత్‌ రణ్వీర్‌చంద్‌ సంబంధిత అధికారులకు సూచించారు. వరంగల్‌ పార్లమెంట్‌ పరిధిలో పోలింగ్‌ కేంద్రాలు, భద్రత, పోస్టల్‌ బ్యాలెట్‌, ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ వివరాలు, తదితర ఎన్నికలకు సంబంధించిన అంశాలపై శుక్రవారం వరంగల్‌ కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. రిటర్నింగ్‌ అధికారి ప్రావీణ్య వరంగల్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో సిద్ధంచేసిన పటిష్ఠ ప్రణాళికను దృశ్యశ్రవణ మాధ్యమం ద్వారా వివరించారు. 247 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్‌తోపాటు పటిష్ఠ పోలీస్‌ భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై 355 కేసులు నమోదు చేశామన్నారు. స్వీప్‌ కార్యక్రమాల ద్వారా పట్టణ ఓటరు నమోదు శాతం పెంచేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, వచ్చే నెల 3 నుంచి ఇంటి వద్దే ఓటు నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. నగర పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ఝా మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. హనుమకొండ, జనగామ, భూపాలపల్లి జిల్లాల ఎన్నికల అధికారులు సిక్తా పట్నాయక్‌, షేక్‌ రిజ్వాన్‌ బాషా, భవేశ్‌ మిశ్రా, ఎన్నికల పోలీస్‌ పరిశీలకుడు నవీన్‌ సైనీ, వ్యయపరిశీలకులు ధీలిబన్‌, ధీరజ్‌ సింగా, డీసీపీలు బారీ, రవీందర్‌, సీతారాం, ఏసీపీలు, నోడల్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని