logo

భాజపా ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్‌కు మద్దతు

భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 27 Apr 2024 02:44 IST

సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి

ఈనాడు, పెద్దపల్లి: భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. పెద్దపల్లిలో శుక్రవారం కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు సంఘీభావంగా నిర్వహించిన రెండు పార్టీల సంయుక్త సమావేశంలో వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దేశంలో భాజపా నియంతృత్వ పోకడలతో పదేళ్లు పాలించిందని విమర్శించారు. అంబానీ, అదానీ వంటి కార్పొరేట్‌ సంస్థల చేతిలో మోదీ సర్కారు కీలుబొమ్మగా మారిందన్నారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లోనూ తాము కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చామని, కలిసి పోటీ చేసి విజయం సాధించామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం చేస్తారన్నారు. రాష్ట్రంలో భాజపా, భారాసలకు కాలం చెల్లిందని, కాంగ్రెస్‌ పార్టీకి ఈ సారి 14 ఎంపీ సీట్లు వస్తాయన్నారు. పెద్దపల్లి పరిధిలోని 7 నియోజకవర్గాల్లో సింగరేణితో పాటు వివిధ సంస్థల్లో తమ పార్టీ అనుబంధ కార్మిక సంఘాలు కాంగ్రెస్‌కే మద్దతునిస్తాయని తెలిపారు.


కొప్పుల విమర్శలు అర్థ రహితం

చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ వెంకటస్వామి మాట్లాడుతూ తన కుమారుడు, ఎంపీ అభ్యర్థి వంశీని వారాంతపు రాజకీయవేత్త(వీకెండ్‌ పొలిటీషియన్‌) అంటూ భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ విమర్శించడం అర్థ రహితమన్నారు. మంత్రిగా ఉండగా ఆయన ఎన్నిసార్లు పెద్దపల్లికి వచ్చారని ప్రశ్నించారు. గోదావరిఖనిలో సొంత నిధులతో కట్టించిన ఆలయానికి రావడం తప్ప ఇక్కడి సమస్యలు పట్టించుకోలేదన్నారు. తమకు ఎమ్మార్పీఎస్‌ నాయకులతో పాటు నేతకాని వర్గీయుల మద్దతు ఉందని తెలిపారు. భాజపా అభ్యర్థి గోమాసె శ్రీనివాస్‌ 2009లో తన చేతిలో ఓడిన తర్వాత నియోజకవర్గంలో ఎక్కడా కనిపించలేదని విమర్శించారు. ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ భాజపా ఎజెండాతో ముందుకెళ్తున్నారని ఆరోపించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్‌ విజయరమణారావు మాట్లాడుతూ కాంగ్రెస్‌, సీపీఐ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పని చేసి గడ్డం వంశీని గెలిపిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో సీపీఐ పెద్దపల్లి, కరీంనగర్‌ జిల్లాల కార్యదర్శులు తాండ్ర సదానందం, వెంకటస్వామి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కలవేన శంకర్‌, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర సమన్వయకర్త కొండి సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని