logo

గ్రేటర్‌ చుట్టూ రాజకీయం..!

ఓవైపు వరంగల్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచార హోరు.. మరోవైపు శుక్రవారం రాత్రి ఖిలావరంగల్‌ కోటలో కాంగ్రెస్‌, భారాస కార్పొరేటర్లు రహస్య సమావేశం.

Published : 27 Apr 2024 03:22 IST

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

ఓవైపు వరంగల్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచార హోరు.. మరోవైపు శుక్రవారం రాత్రి ఖిలావరంగల్‌ కోటలో కాంగ్రెస్‌, భారాస కార్పొరేటర్లు రహస్య సమావేశం. గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌, ఉపమేయర్లపై అవిశ్వాసానికి వ్యూహ రచన.. రెండు రోజులుగా వరంగల్‌ తూర్పు రాజకీయాలు గ్రేటర్‌ వరంగల్‌ చుట్టూ తిరుగుతున్నాయి. వరంగల్‌ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల విలీన గ్రామాల్లోని డివిజన్లలో అలజడి లేకున్నా రాజకీయాలు మాత్రం వేడెక్కాయి.  

తెర వెనుక ఎవరు.?

  • మేయర్‌ గుండు సుధారాణి స్థానిక నాయకులతో సంబంధం లేకుండా నేరుగా గాంధీ భవన్‌కెళ్లి హస్తం కండువా కప్పుకొన్నారు. వరంగల్‌ తూర్పు కాంగ్రెస్‌ కార్పొరేటర్లు ఆమె చేరికను వ్యతిరేకిస్తూ గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో తెర వెనుక ఎవరున్నారనే దానిపై నిఘా వర్గాలు, టీపీసీసీ నాయకులు శుక్రవారం ఆరా తీశాయి.
  • కార్పొరేటర్లు పైకి మాత్రం సుధారాణి రాకపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా తెరవెనుక మేయర్‌, ఉపమేయర్లపై అవిశ్వాసానికి అడుగులేస్తున్నట్లుగా తెలుస్తోంది. మేయర్‌ సుధారాణి రెండేళ్ల పదవి కాపాడుకునేందుకు కాంగ్రెస్‌లో చేరారనేది బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. హస్తం గూటికి చేరిన సుధారాణిపై అవిశ్వాసానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం అంగీకరిస్తుందా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

కోటలో కార్పొరేటర్ల సమావేశం

మేయర్‌ను గద్దె దించే లక్ష్యంగా శుక్రవారం రాత్రి ఖిలావరంగల్‌ కోటలోని ప్రైవేటు రిసార్ట్‌లో వరంగల్‌ తూర్పు కార్పొరేటర్లు అంతర్గతంగా సమావేశమయ్యారు. కాంగ్రెస్‌, భారాసకు చెందిన 16-17 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో భారాసకు చెందినవారు పాల్గొనడం విశేషం. సమావేశంలో అవిశ్వాసం పెట్టడం, మేయర్‌ పదవికి ఎవరు పోటీ? అనేది చర్చించారు. కాంగ్రెస్‌కు చెందిన ఓ సీనియర్‌ కార్పొరేటర్‌ మేయర్‌ పదవికి తాను సిద్ధమని ప్రకటించారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం అనుమతి ఉంటే మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని భారాస కార్పొరేటర్లు హామీ ఇచ్చారు. భారాసకు చెందిన ఉపమేయర్‌ రిజ్వానా షమీమ్‌ పదవి కాపాడేందుకు తూర్పునకు చెందిన భారాస కార్పొరేటర్లు మరో షరతు విధించినట్లుగా తెలిసింది.


సుధారాణి రాజీనామా చేయాలి

కరీమాబాద్‌: మేయర్‌గా అవకాశం కల్పించిన  భారాసని, కార్పొరేటర్లను కాదని కాంగ్రెస్‌ పార్టీలో చేరిన గుండు సుధారాణి తక్షణమే కార్పొరేటర్‌, మేయర్‌ పదవులకు రాజీనామా చేయాలని వరంగల్‌ తూర్పు భారాస కార్పొరేటర్లు డిమాండ్‌ చేశారు. సుధారాణి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం  కార్పొరేటర్‌ పల్లం పద్మ నివాసంలో వారు విలేకరులతో మాట్లాడారు. డిప్యూటీ మేయర్‌ రిజ్వానాషమిమ్‌, కార్పొరేటర్లు దిడ్డి కుమారస్వామి, ప్రవీణ్‌, సిద్దం రాజు, సువర్ణ, మాజీ కార్పొరేటర్‌ పల్లం రవి, కార్పొరేటర్‌ గందె కల్పన భర్త నవీన్‌ మాట్లాడుతూ సుధారాణి పార్టీ మారడం అనేది భారాస పార్టీని, కార్పొరేటర్లను మోసం చేయడమే అవుతుందన్నారు.ఆమె వైఖరితోనే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఓటమి చెందారని ఆరోపించారు.  


మేయర్‌ను కలిసిన కార్పొరేటర్లు

కాంగ్రెస్‌లో చేరిన తర్వాత మేయర్‌ గుండు సుధారాణి శుక్రవారం సాయంత్రం నగరానికి వచ్చారు. రామన్నపేటలోని మేయర్‌ నివాసంలో కార్పొరేటర్లు గుండు చందన, అరుణ విక్టరి, పలు డివిజన్లకు చెందిన కాంగ్రెస్‌, నాయకులు, కార్యకర్తలు కలిసి అభినందనలు తెలిపారు. రామన్నపేట, రంగశాయిపేట, కొత్తవాడ ప్రాంతాల నుంచి చాలామంది డివిజన్‌ స్థాయి నాయకులు మేయర్‌ సుధారాణిని కలిశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని