logo

ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుల ప్రాణాలు

పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని బల్దియా పాలకులు చెబుతున్నారు. ఏడాదికోసారి కార్మికులకు ఇవ్వాల్సిన పనిముట్లు, ప్రమాదాల నుంచి రక్షణ కోసం ఇచ్చే రేడియం స్టిక్కర్‌ ఉన్న ఆప్రాన్‌లు ఇవ్వడం లేదు.

Published : 27 Apr 2024 03:16 IST

న్యూస్‌టుడే, కార్పొరేషన్‌

పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని బల్దియా పాలకులు చెబుతున్నారు. ఏడాదికోసారి కార్మికులకు ఇవ్వాల్సిన పనిముట్లు, ప్రమాదాల నుంచి రక్షణ కోసం ఇచ్చే రేడియం స్టిక్కర్‌ ఉన్న ఆప్రాన్‌లు ఇవ్వడం లేదు. ఫలితంగా ఇటీవల కాలంలో తెల్లవారుజామున పలువురు కార్మికులు రోడ్డు ప్రమాదాల్లో అసువులు బాస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున కాజీపేట ప్రధాన రహదారిలో చెత్త తరలింపు పనులు చేయిస్తున్న శానిటరీ జవాన్‌ కొమ్ము దేవయ్యను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందారు. గత నెలలో వరంగల్‌ లేబర్‌ కాలనీ గొర్రెకుంట క్రాస్‌ రోడ్‌ వద్ద ఓ మహిళా పారిశుద్ధ్య కార్మికురాలిని లారీ ఢీ కొట్టింది. నిబంధనల ప్రకారం పారిశుద్ధ్య కార్మికులు విధిగా ఆప్రాన్‌ ధరించాలి. రేడియం స్టిక్కర్లు ఉండటంతో దూరం నుంచి వచ్చే వాహనాలు కార్మికులను గుర్తించే వీలుంటుంది. రెండేళ్లుగా ఇవ్వకపోవడంతో చాలా మంది మసకబారిన పాతవే ధరిస్తున్నారు. చీకట్లో రోడ్లు ఊడుస్తున్న కార్మికులను వాహనాలు ఢీకొడుతున్నాయి.

భయంతో విధుల్లోకి..: మహానగర పాలక సంస్థ ప్రజారోగ్యం, అర్బన్‌ మలేరియా విభాగాల్లో సుమారు మూడు వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి ఏడాదికోసారి పనిముట్లు, దుస్తులు ఇవ్వాలి. ఆప్రాన్లు లేక నగరంలోని ప్రధాన రహదారులు శుభ్రం చేస్తున్న కార్మికులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. రాత్రి వేళ పనిచేసే కార్మికులు భయం భయంగా పనిచేస్తున్నారు.  వర్షాకాలంలో రెయిన్‌ కోట్లు, శీతాకాలంలో చలి కోట్లు, ఎండాకాలంలో టోపీˆలు పంపిణీ చేయడం లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు.


విధి నిర్వహణలో జవాను దుర్మరణం

కాజీపేట టౌన్‌: వేకువజాము విధి నిర్వహణలో ఉన్న వరంగల్‌ మహా నగరపాలక సంస్థ జవాన్‌ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటన కాజీపేట చౌరస్తాలో చోటు చేసుకుంది. కాజీపేట ఇన్‌స్పెక్టర్‌ వై.సుధాకర్‌రెడ్డి కథనం ప్రకారం.. రోజు మాదిరిగా.. కాజీపేట రహమత్‌నగర్‌కు చెందిన జవాన్‌ కొమ్ము దేవయ్య(50) శుక్రవారం వేకువజామున విధులకు వెళ్లారు. 4.45 గంటల సమయంలో కాజీపేట చౌరస్తా వద్ద పారిశుద్ధ్య కార్మికులతో చెత్తను ట్రాక్టర్‌లో ఎత్తి వేయిస్తుండగా.. హనుమకొండ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. ఎగిరి పడిన దేవయ్య తలకు బలమైన గాయం కావడంతో కార్మికులు 108 అంబులెన్స్‌ ద్వారా ఎంజీఎం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. అతని కుమారుడు అనుదీప్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివకృష్ణ తెలిపారు. సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలించి, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తిస్తామని చెప్పారు. మృతదేహానికి ఎంజీఎం మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించిన కుటుంబ సభ్యులకు అప్పగించారు. పారిశుద్ధ్య కార్మికుల ప్రాణాలు గాల్లో దీపంలా మారాయని, విధుల్లో ఉన్నవారికి తగిన రక్షణ చర్యలు చేపట్టాలని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.


రూ.60 లక్షలతో ప్రతిపాదనలు

-డాక్టర్‌ రాజేష్‌, ముఖ్య ఆరోగ్యాధికారి

పారిశుద్ధ్య కార్మికులకు రెండేసి ఆప్రాన్లు పంపిణీ చేసేందుకు రూ.60 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేశాం. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ఉండటంతో టెండర్లు పిలవలేదు. జూన్‌ మొదటి వారంలో టెండర్లు పిలిచి, వెంటనే పంపిణీచేస్తాం. పనిముట్లు, మాస్కులు, గ్లౌజులు ఇచ్చేందుకు ప్రతిపాదనలు తయారుచేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని