logo

కరవు కోరలు.. పశుగ్రాసానికి తంటాలు!

వర్షాలు సరిగా లేక పంటలు వేసినా చాలా వరకు చేతికందలేదు.. దీంతో రైతన్నలు పశుగ్రాసానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. మోరంచవాగుకు ఇరువైపులా పంటలు సాగు చేసుకున్న వారి పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది

Published : 27 Apr 2024 02:50 IST

న్యూస్‌టుడే, భూపాలపల్లి

ర్షాలు సరిగా లేక పంటలు వేసినా చాలా వరకు చేతికందలేదు.. దీంతో రైతన్నలు పశుగ్రాసానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. మోరంచవాగుకు ఇరువైపులా పంటలు సాగు చేసుకున్న వారి పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. మిగిలిన వారు పశుగ్రాసాన్ని కొనుగోలు చేయాల్సి వస్తోంది.  కొరత కారణంగా ఎండుగడ్డి ధరలు పెరిగాయి. మరోవైపు దాణా ధరలు ఆకాశన్నంటుతున్నాయి. గతంలో ఒక కట్టకు రూ.100 ఉండగా ప్రస్తుతం రూ.130 వరకు విక్రయిస్తున్నారు. ఒక వరి గడ్డి కట్ట 30 కిలోల వరకు ఉంటుంది. ఈ లెక్కన ట్రాక్టర్‌ గడ్డి రూ.16 వేల నుంచి రూ.17 వేల వరకు విక్రయిస్తున్నారు. వరి పొలంలో ఎండిన గడ్డి ఒక కట్ట కట్టడానికి కూలీకి రూ.30 చెల్లిస్తున్నారు. దీంతో రైతులు కొనలేకపోతున్నారు. సరిపడా ఆహారం లభించక పశువులు అల్లాడుతున్నాయి. అవసరమైన దాణా పశువులకు పెట్టకపోవడంతో పాల దిగుబడి తగ్గిపోతోందని పలువురు పాడి పశువుల పెంపకందారులు చెబుతున్నారు. పచ్చిగడ్డి వేయడానికి నీటి సౌకర్యం లేదు. నీటి వసతి ఉన్న పొలం కౌలుకు తీసుకొని కొందరు గడ్డి వేస్తున్నారు. గతంలో ఎకరా రూ.10 వేల కౌలుకు దొరికే భూమి ఇప్పుడు రూ.20 వేలకు చేరింది.

పాల దిగుబడి తగ్గింది

- ఎండీ మైనుద్దీన్‌, గొర్లవీడు

ఈ సారి సరైన వర్షాలు లేవు. పంటలు చాలా వరకు ఎండిపోయాయి. ప్రస్తుతం ఎండలకు ఎక్కడా పశుగ్రాసం లభ్యం కావడం లేదు. సరిపడా మేత పెట్టలేకపోతున్న కారణంగా పాల దిగుబడి తగ్గిపోయింది. వరి కోతకు కూలీల కొరత కారణంగా యంత్రాల ద్వారానే వరి కోత చేపట్టడంతో ఎండు గడ్డి కొరత తీవ్రంగా ఏర్పడింది.


అవస్థలు పడుతున్నాం..

- సురేందర్‌, కమలాపూర్‌

పచ్చిగడ్డి వేసుకోవడానికి భూమి తక్కువ కౌలుకు దొరకడం లేదు. పాడి పశువులకు దాణా, పచ్చి మేత పెడితేనే పాల దిగుబడి బాగుంటుంది. ధరలు పెరగడంతో సరైన గ్రాసం అందించడానికి రైతులు అవస్థలు పడుతున్నారు. చాలా మంది రైతులు వ్యవసాయ పనులకు ట్రాక్టర్లపైనే ఆధారపడుతున్నారు. ప్రభుత్వం పశువులకు దాణా రాయితీపై పంపిణీ చేయాలి.


ఏటా విత్తనాలు సరఫరా చేస్తున్నాం

- బి.శ్రీదేవి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి

ఏటా పశువులకు అవసరమైన పచ్చిమేత పెంపకానికి విత్తనాలు సరఫరా చేస్తున్నాం.. ఈ సారి వర్షాలు సరిగా కురవలేదు. చేతికి వచ్చే సమయంలో పంటలు ఎండిపోవడంతో పశుగ్రాసం కొరత ఏర్పడుతోంది. రాయితీపై త్వరలో పశుగ్రాస విత్తనాల పంపిణీకి చర్యలు తీసుకుంటాం. ఆసక్తి ఉన్న రైతులకు బహువార్షిక గడ్డి రకాల విత్తనాలను అందస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని