logo

గంజాయి మత్తు.. యువత చిత్తు

మంచి భవిషత్తు ఉన్న యువతను కొందరు అక్రమార్కులు చెడు మార్గం వైపు మరలుస్తున్నారు. ధనార్జన కోసం గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలను చేస్తున్నారు.

Published : 30 Jun 2022 05:52 IST

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, భూపాలపల్లి టౌన్‌, న్యూస్‌టుడే: మంచి భవిషత్తు ఉన్న యువతను కొందరు అక్రమార్కులు చెడు మార్గం వైపు మరలుస్తున్నారు. ధనార్జన కోసం గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలను చేస్తున్నారు. సరదాగా అలవాటై అది వ్యసనంగా మారుతోంది. ఈ విష సంస్కృతి పల్లెలకూ పాకుతోంది. జిల్లా మీదుగా అక్రమంగా రవాణా అవుతోంది. గుట్టు చప్పుడు కాకుండా తీసుకొచ్చి విక్రయిస్తున్నారు.

గుట్టుగా విక్రయాలు..

కొంతకాలంగా భూపాలపల్లి పట్టణంలో గంజాయి గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. అలవాటున్న వ్యక్తులు రహస్యంగా విక్రయదారుల వద్ద కొని.. శివారు ప్రాంతాలకు వెళ్లి సేవిస్తున్నారు. చాలా మంది డబ్బు సంపాదనే ధ్యేయంగా ఈ దందాలోకి దిగుతున్నారు. గంజాయికి బానిసైనవారు అది దొరక్కపోతే ప్రత్యామ్నాయంగా మత్తునిచ్చే రసాయన, జిగురు పదార్థాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇవెంతో ప్రమాదకరం.

ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి.. : ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశ నుంచి రహస్యంగా వస్తోంది. ఇటీవల బ్యారేజీ వద్ద పట్టుబడిన వ్యక్తులు ఒడిశ నుంచి తెస్తున్నట్లు పేర్కొన్నారు. కాటారంలో పట్టుబడిన వారు మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చినట్లు చెప్పారు. తక్కువ ధరకు తెచ్చి, పొట్లాలుగా తయారు చేసి గ్రాముల చొప్పున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

పట్టుబడుతున్నా..: పోలీసు, ఆబ్కారీ శాఖ వారు కూడా గంజాయి నివారణ కోసం కృషి చేస్తున్నారు. ఐదేళ్లలో 14 కేసులు నమోదు చేసి 46 మందిని అదుపులోకి తీసుకొన్నారు. రూ. 93.90 లక్షల విలువైన సరకును స్వాధీనం చేసుకున్నారు. యువతకు అవగాహన కల్పిస్తున్నారు. అయినా వ్యసనాన్ని మానుకోలేకపోతున్నారు.

* ఆర్నెళ్ల క్రితం మహాముత్తారం మండలం యామన్‌పల్లి వద్ద నలుగురు యువకులు గంజాయితో పట్టుపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో ముగ్గురు మైనర్లున్నారు.

* మల్హర్‌ మండలంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. పెద్దపల్లి, గోదావరిఖని, రామగిరి ప్రాంతాల నుంచి తీసుకువస్తున్నట్లు సమాచారం.

* రేగొండ మండలంలో పలుసార్లు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మండలానికి చెందిన పలువురు ఈ వ్యాపారం చేస్తూ పట్టుబడ్డారు.

* గణపురం, చెల్పూరు, తదితర గ్రామాల్లో విక్రయాలు చేపడుతున్నారు. వలస కూలీలు సేవిస్తున్నారు. ఆర్నెళ్ల క్రితం గాంధీనగర్‌ క్రాస్‌ వద్ద సుమారు 200 కేజీల సరకును పట్టుకున్నారు.

* కాటారంలోని చింతకాని క్రాస్‌ వద్ద ఇద్దరు యువకులు గంజాయితో దొరికారు. ఇందులో ఒకరు మైనర్‌. అంతకు ముందు కూడా ముగ్గురు పట్టుబడ్డారు. సిరోంచ నుంచి తెస్తున్నట్లు విచారణలో తేలింది.

* ఏప్రిల్‌ 25వ తేదీన టేకుమట్ల మండలానికి చెందిన ఓ వ్యక్తి, ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలానికి చెందిన ఇద్దరితో కలిసి భద్రాచలం నుంచి గంజాయి తీసుకొస్తూ పోలీసులకు దొరికారు. వారి నుంచి 65 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. రహస్య ప్రాంతంలో నిల్వ చేసి అవసరమున్న వారికి విక్రయిస్తామని నిందితులు విచారణలో అంగీకరించారు.


ఏప్రిల్‌ 4న మహదేవపూర్‌ మండలం మేడిగడ్డ బ్యారేజీ వద్ద పోలీసుల తనిఖీల్లో రెండు కార్లలో 4.130 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్టు చేశారు. ఒడిశా నుంచి మహారాష్ట్ర ఔరంగాబాద్‌కు తరలిస్తుండగా పట్టుబడ్డారు. జిల్లా మీదుగా రవాణా జరుగుతోందని ఈ ఘటన ద్వారా రుజువైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని