logo

నెరవేరిన సీరోలు ఆకాంక్ష

గత కొన్నేళ్లుగా మండలం ఏర్పాటు కోసం చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు సఫలమయ్యాయి. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శనివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో మహబూబాబాద్‌ జి

Updated : 24 Jul 2022 05:46 IST

కురవి, న్యూస్‌టుడే: గత కొన్నేళ్లుగా మండలం ఏర్పాటు కోసం చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు సఫలమయ్యాయి. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శనివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో మహబూబాబాద్‌ జిల్లాలోని సీరోలు కూడా ఉంది. 16 మండలాలతో కొనసాగిన జిల్లా ఇకపై 17 మండలాలతో కొనసాగనుంది. కురవి మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీరోలును మండలం చేయాలంటూ ఆ ప్రాంత ప్రజలు తమ డిమాండ్లను ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకుల ముందుంచారు. పలుమార్లు ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ శాసన సభలో మండల ఏర్పాటుకు అనివిధాలుగా అనుకూలతలున్నాయంటూ ప్రస్థావించారు. దీనిపై కురవి మండలంలోని ఐదు రెవెన్యూ, డోర్నకల్‌ మండలంలోని ఒక రెవెన్యూ గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు గ్రామపంచాయతీల ద్వారా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సీరోలు ప్రాంత వాసుల కోరిక ఇప్పుడు నెరవేరడంతో హర్షం వ్యక్తం చేశారు.  
అనుకూలతలు
మండల ఏర్పాటుకు అవసరమైన అనుకూలతలు సీరోలులో ఉన్నాయి. ప్రస్తుతం ఆర్టీసీ బస్టాండ్‌, పశువైద్యశాల, విద్యుతు సబ్‌స్టేషన్‌, బ్యాంకు, పోలీస్‌స్టేషన్‌, గిరిజన బాలికల ఏకలవ్య గురుకులం ఉంది. తహసీల్దార్‌, మండల పరిషత్తు, మండల వ్యవసాయశాఖ, ఇతర మండలస్థాయి కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశాలున్నాయి. వాటికి శాశ్వత భవనాల నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ భూమి కూడా ఉంది.
  రెవెన్యూ గ్రామాలు
సీరోలు, కాంపల్లి, తాళ్ళసంకీస, చింతపల్లి, ఉప్పరగూడెం, మన్నెగూడెం
పంచాయతీలు
సీరోలు, కొర్లకుంటతండా, రేకులతండా, కాంపల్లి, ఉప్పరగూడెం, కాంలపల్లితండా, బీల్యానాయక్‌తండా, గోపతండా, తాళ్ళసంకీస, వస్రాంతండా, బూరుగుచెట్టుతండా, చింతపల్లి, కొత్తూరు(సి), మన్నెగూడెం, చిలుకోయలపాడు, అందనాలపాడు, మోదుగడ్డతండా
మరింత అభివృద్ధికి అవకాశం
వెడవెల్లి వెంకట్‌రెడి, మాజీ ఎమ్మెల్సీ, సీరోలు
గత కొన్నేళ్లుగా వేచి చూస్తున్న ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. సీరోలు కొత్త మండలంగా ఏర్పడితే మరింత అభివృద్ధి జరిగే అవకాశాలున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల కోసం వసతుల కల్పనకు ప్రతి ఒక్కరు సహకరించాలి. సీరోలు ప్రాంత ప్రజల కోరిక తీర్చిన సీఎం కేసీఆర్‌, మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యే రెడ్యానాయక్‌లకు కృతజ్ఞతలు.
మండలం కావడం ఆనందంగా ఉంది
శ్యామల రంగమ్మ, సర్పంచి సీరోలు
మారుమూలన ఉన్నప్పటికి మండలానికి కావలసిన అన్ని వసతులున్నాయి. సీరోలును మండలంగా చేయాలని పలుమార్లు ప్రజా ప్రతినిధుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు గ్రామపంచాయతీల నుంచి తీర్మానం చేశాం. సీరోలును మండలం  చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తాం.    
ఎన్నికల్లో ఇచ్చిన మాట నెరవేరింది
డోర్నకల్‌, న్యూస్‌టుడే: సీరోలు కేంద్రంగా నూతన మండలం ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పచ్చజెండా ఊపడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడి ప్రజలకు తానిచ్చిన మాట నెరవేరినట్లయిందని డోర్నకల్‌ ఎమ్మెల్యే ధరంసోతు రెడ్యానాయక్‌ పేర్కొన్నారు. డోర్నకల్‌ మున్సిపల్‌ కార్యాలయంలో ఆయన వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యులతో సమావేశమై మాట్లాడారు. కొత్త మండలం మంజూరు కావడంతో సీరోలు పరిసర గ్రామాల ప్రజల కల సాకారమైందంటూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల విన్నపం మేరకు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ గురించి పలుమార్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఒప్పించానన్నారు. సీరోలు మండలం ఏర్పాటు చేసినందుకు కేసీఆర్‌కు రెడ్యానాయక్‌ కృతజ్ఞతలు తెలిపారు. తెరాస మండలాధ్యక్షుడు నున్నా రమణ, మున్సిపల్‌ ఛైర్మన్‌ వాంకుడోతు వీరన్న, పార్టీ పట్టణాధ్యక్షుడు కత్తెరశాల విద్యాసాగర్‌, వైస్‌ ఛైర్మన్‌ కోటిలింగం, ఎంపీపీ బాలునాయక్‌, జడ్పీటీసీ సభ్యురాలు పొడిశెట్టి కమల పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని