icon icon icon
icon icon icon

వైకాపాది మాఫియా రాజ్యం

ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకం వైకాపాను పూర్తిగా తిరస్కరిస్తోంది. వైకాపాకు 5 ఏళ్ల పాటు పాలించే అవకాశం ఇచ్చారు. వాళ్లు ఆ అవకాశాన్ని వృథా చేశారు.ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిని వెనక్కి మళ్లేలా చేశారు. ఖజానాను ఖాళీ చేసి, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారు.

Updated : 07 May 2024 07:10 IST

భూమి, ఇసుక, మద్యం పేరుతో దోచేస్తున్నారు
సర్కారులోనే మద్యం సిండికేట్‌
నిధులిచ్చినా పోలవరం నిర్మించలేకపోయారు
మూడు రాజధానులన్నారు... ఒక్కటీ నిర్మించలేదు
వారి మంత్రం అవినీతి.. అవినీతి.. అవినీతి
ఏపీలో అభివృద్ధి పట్టాలు తప్పింది
వైకాపాను సాగనంపండి
జగన్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ప్రధాని
చంద్రబాబు హయాంలో రాష్ట్రానిది ఉత్తమ స్థానం
మళ్లీ ఎన్డీయే ప్రభుత్వంతోనే పనులు ప్రారంభం
ప్రధాని మోదీ వ్యాఖ్యలు
ఈనాడు-రాజమహేంద్రవరం, అనకాపల్లి


ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకం వైకాపాను పూర్తిగా తిరస్కరిస్తోంది. వైకాపాకు 5 ఏళ్ల పాటు పాలించే అవకాశం ఇచ్చారు. వాళ్లు ఆ అవకాశాన్ని వృథా చేశారు.ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిని వెనక్కి మళ్లేలా చేశారు. ఖజానాను ఖాళీ చేసి, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారు.

రాష్ట్రంలో అభివృద్ధి గాడిలో పడాలంటే తిరిగి ఎన్డీయే డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఏర్పాటు కావాలి. మోదీ గ్యారంటీ, చంద్రబాబు నాయకత్వం, పవన్‌కల్యాణ్‌ విశ్వాసం రాష్ట్రానికి ఎంతో అవసరం. ఆంధ్రప్రదేశ్‌లోను, కేంద్రంలోను ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. 

ప్రధాని మోదీ


ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ప్రభుత్వంపై ప్రధాని నరేంద్రమోదీ నిప్పులు చెరిగారు. ఐదేళ్ల పాలనలో అభివృద్ధి పట్టాలు తప్పిందన్నారు. వైకాపా సర్కారు భూ మాఫియా, ఇసుక మాఫియా, మద్యం మాఫియాను నడిపిస్తోందని విరుచుకుపడ్డారు. ప్రభుత్వమే మద్యం సిండికేట్‌ ఏర్పాటు చేసిందన్నారు. కేంద్రప్రభుత్వం ఇక్కడ ఎన్నో అభివృద్ధి పనులు చేయగలిగినప్పుడు రాష్ట్రంలో ఉన్న జగన్‌ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయిందని నిలదీశారు. ‘‘పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.15,000 కోట్లు ఇస్తే ఆ ప్రాజెక్టు పనులకు ప్రభుత్వమే ఆటంకంగా నిలిచింది. మూడు రాజధానులు అని హామీ ఇచ్చి ఒక్కటీ నిర్మించలేదు. వైకాపా ప్రభుత్వ మంత్రం అవినీతి.. అవినీతి.. అవినీతి అయితే ఎన్డీయే ప్రభుత్వ మంత్రం అభివృద్ధి.. అభివృద్ధి.. అభివృద్ధి. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ను ఎంతో ఉన్నతస్థాయిలో నిలబెడితే జగన్‌ పూర్తిగా దిగజార్చారు. వైకాపా ప్రభుత్వానికి అవినీతి నిర్వహణ తప్ప ఆర్థిక నిర్వహణ తెలియదు. ఖజానాను ఖాళీ చేసి, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారు. రాష్ట్రంలో అభివృద్ధి గాడిలో పడాలంటే తిరిగి ఎన్డీయే డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఏర్పాటు కావాలి. మోదీ గ్యారంటీ, చంద్రబాబు నాయకత్వం, పవన్‌కల్యాణ్‌ విశ్వాసం రాష్ట్రానికి ఎంతో అవసరం. ఆంధ్రప్రదేశ్‌లోను, కేంద్రంలోను ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి’’ అని ఏపీ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, అనకాపల్లి జిల్లా కేంద్రంలో ఆయన సోమవారం ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్‌ పార్టీపైనా ధ్వజమెత్తారు. ఝార్ఖండ్‌లో కాంగ్రెస్‌ మంత్రి వద్ద కార్యదర్శిగా ఉన్న అధికారి వద్ద పనిచేసే ఒక చిరుద్యోగి ఇంట్లో రూ.30 కోట్ల నల్లధనాన్ని స్వాధీనం చేసుకున్న అంశాన్నీ ప్రస్తావించారు. కాంగ్రెస్‌ నేతలు దోచుకున్న ఈ నల్లధనాన్ని పేదల చెంతకు చేర్చేలా ఒక చట్టం తీసుకువచ్చేందుకు న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లు రాజమహేంద్రవరం సభలో ప్రకటించారు. మోదీ ఈ సభల్లో ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే..

అభివృద్ధి పట్టాలు తప్పింది

‘‘ఈ ఎన్నికల్లో రెండు ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్‌ పార్టీ. మరొకటి వైకాపా. ఫలితాలకు ముందే కాంగ్రెస్‌ నాయకులు పరాజయాన్ని అంగీకరించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకం వైకాపాను పూర్తిగా తిరస్కరిస్తోంది. వైకాపాకు 5 ఏళ్ల పాటు పాలించే అవకాశం ఇచ్చారు. వాళ్లు ఆ అవకాశాన్ని వృథా చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిని వెనక్కి మళ్లేలా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాల కన్నా ముందుకు తీసుకువెళ్లింది. వైకాపా అధికారంలోకి వచ్చి ఈ అభివృద్ధిని పట్టాలు తప్పించింది. వారు ప్రజాహితం కోసం పని చేయడానికి బదులు ఆంధ్రప్రదేశ్‌ను భారీగా అప్పుల్లో ముంచారు. ఒక ప్రాంతమైనా, రాష్ట్రమైనా, దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఏకైక గ్యారంటీ ఎన్డీయే పాలనే. ఆంధ్రప్రదేశ్‌ యువరాష్ట్రం. ఇక్కడ యువతకు మంచి సామర్థ్యం ఉంది. రాష్ట్ర యువకుల సాంకేతిక నైపుణ్యాన్ని ప్రపంచం అంతా గుర్తించింది. ఈ దేశం అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందాలి. ఇక్కడ ఉన్న వైకాపా ప్రభుత్వం నుంచి అలాంటిది ఆశించడం వృథా. రాష్ట్రంలో అభివృద్ధి పనులు జీరో. మొత్తం అంతా అవినీతే. రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీయే డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం ఏర్పాటయితేనే ఆగిన పనులు అన్నీ మళ్లీ మొదలవుతాయి.

కేంద్రం ఇచ్చే వాటిని వైకాపా సర్కారు అందుకోలేదు

కేంద్రం అందించే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికీ ఇక్కడ ఆటంకాలు కల్పిస్తున్నారు. విశాఖకు దక్షిణకోస్తా ప్రత్యేక రైల్వేజోన్‌ మంజూరుచేశాం. రైల్వేజోన్‌ ముఖ్య కార్యాలయం కోసం కావాల్సిన భూమిని రాష్ట్రప్రభుత్వం ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్‌లో పేదల కోసం 24 లక్షల ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన ఇళ్లు మంజూరు చేశాం. వైకాపా సర్కారు వాటిలో సగం కూడా పేదలకు నిర్మించి ఇవ్వలేకపోయింది. వైకాపా ప్రభుత్వానిది అవినీతి ఎజెండా. అవినీతి ఎక్కడ ఉంటుందో అక్కడ పని ఉండదు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి జలవనరుల ప్రాజెక్టు ఇక్కడి ప్రభుత్వ పనితీరుకు చాలా పెద్ద ఉదాహరణ. జగన్‌ రెడ్డి తండ్రి వైఎస్సార్‌ దీన్ని మొదలుపెట్టారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని తీసుకున్నా ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారు. రైతుల గురించి వైకాపా ప్రభుత్వానికి పట్టింపు లేదు. అనకాపల్లి చెరకు సాగుకు పెద్ద కేంద్రం. రాష్ట్రప్రభుత్వ విధానాల వల్ల చెరకు రైతులు ఆ పంట మానుకున్నారు. చక్కెర పరిశ్రమలు మూతపడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడే డబుల్‌ ఇంజిన్‌ సర్కారు చెరకు రైతుల జీవితాల్లో తిరిగి మాధుర్యం నింపుతుంది. పెట్రోలులో ఇథనాల్‌ కలపడాన్ని ప్రోత్సహిస్తున్నాం. అందువల్ల చెరకు రైతులకు రూ.80వేల కోట్ల లబ్ధి కలుగుతోంది. మత్స్యకారులకు కిసాన్‌ క్రెడిట్‌ సౌకర్యం కల్పిస్తున్నాం. బీమా పరిధిని పెంచుతున్నాం. మత్స్యరంగానికి అనుబంధ ప్రాసెసింగ్‌ సంబంధిత ఉత్పత్తులు పెంచే క్లస్టర్లు ఏర్పాటుచేస్తున్నాం. ఇవన్నీ ఏపీ మత్స్యకారులకూ ఎంతో ఉపయోగపడతాయి.

రాష్ట్రానికి ఏం చేశామో ఆ చిట్టా ఇదిగో...!

ఇంతకుముందు నాయకులు ఓట్లు అడిగితే ఏం పనులు చేశారని ప్రజలు చిట్టా అడిగేవారు. రాష్ట్రానికి మేం ఏం చేశామో ఆ చిట్టా ఇదిగో... అనంతపురం నుంచి అనకాపల్లి వరకు ఆరువరుసల రహదారి నిర్మించాం. రాయపూర్‌-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం జరుగుతోంది. కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారి ఈ ప్రాంతం మీదుగానే వెళ్తుంది. 2014లో మొత్తం జాతీయ రహదారులు 4వేల కిలోమీటర్లే ఉండేవి. ప్రస్తుతం 9వేల కిలోమీటర్లు అయ్యాయి. కర్నూలులో ట్రిపుల్‌ ఐటీ, తిరుపతిలో ఐఐటీ, ఐసర్‌, విశాఖలో ఐఐఎం ఏర్పాటుచేశాం. పెట్రోలియం యూనివర్సిటీ ఏర్పాటయింది. పూడిమెరకలో గ్రీన్‌ ఎనర్జీ పార్కు మంజూరుచేశాం. మంగళగిరిలో ఎయిమ్స్‌ వచ్చింది. నక్కపల్లిలో బల్క్‌డ్రగ్‌ పార్కు కోసం రూ.వెయ్యి కోట్ల సాయం అందిస్తున్నాం. దీనివల్ల ఫార్మారంగం అభివృద్ధి చెందుతుంది. పెట్టుబడులు వస్తాయి. విజయవాడ-అనంతపురం రోడ్డు ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకువెళ్తున్నాం. హైదరాబాద్‌తో అనుసంధానం చేసే రహదారులన్నీ నిర్మిస్తున్నాం. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ పనులు జరుగుతున్నాయి. జాతీయ రహదారి పనులు పూర్తయితే విశాఖ పోర్టుకు అనుసంధానం పెరుగుతుంది. మత్స్య ఉత్పత్తుల వ్యాపారం పెరుగుతుంది. కేంద్రమే ఇంత చేస్తుంటే రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతోంది?

ఎన్డీయేతో జతకట్టండి

కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ట్యాంకర్‌ మాఫియా నడుపుతోంది. వైకాపా ప్రభుత్వమూ మాఫియా రాజ్‌లా ఉంది. భారతదేశం గురించి యావత్‌ ప్రపంచం సానుకూలంగా ఆలోచిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కాంగ్రెస్‌, వైకాపా అనే ప్రతికూల శక్తులకు దూరం కావాలి. ఎన్డీయేతో జతకట్టి రావాలి. వికసిత్‌ భారత్‌ అనే స్వప్నంలో వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌ కూడా ఒక భాగం. మే 13న మీ ఓటుతో అభివృద్ధి యాత్రలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో రాబోయే ఐదేళ్లు ఎన్డీయే డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఏర్పాటవుతోంది. ఒడిశా శాసనసభతో పాటు ప్రస్తుతం ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల శాసనసభల్లోనూ ఎన్డీయే ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయని నాకు స్పష్టంగా కనిపిస్తోంది. రిఫామ్‌, ఫెర్‌ఫామ్‌, ట్రాన్స్‌ఫామ్‌ అనే మంత్రం పఠిస్తూ ముందడుగు వేద్దాం’’ అని ప్రధాని మోదీ చెప్పారు.

రాజమహేంద్రవరంలో తల్లి గోదావరికి నమస్కారాలు చెప్పారు. ఆదికవి నన్నయ్య ఆదికావ్యం రాసినచోట నుంచే తెలుగు ప్రజలు కొత్త చరిత్ర లిఖించబోతున్నారని అన్నారు. అనకాపల్లి నూకాలమ్మను స్మరించారు. అనకాపల్లి బెల్లం గొప్పతనాన్ని ప్రస్తావించారు. అల్లూరి సీతారామరాజుకు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌ శ్రీరాముడి పాత్రను ధరించి, రాముడిని ప్రజలకు దగ్గరకు చేశారన్నారు. రెండు సభల్లోనూ లోక్‌సభ, శాసనసభ ఎన్డీయే అభ్యర్థులను పరిచయం చేసి ఓటు వేయాలని కోరారు. ఎన్డీయే అభ్యర్థులకు వేసే ఓటు దిల్లీలో నేరుగా తన ఖాతాకు చేరుతుందన్నారు. ఇక్కడి అభ్యర్థులలో కూడా ప్రతి ఒక్కరూ ప్రజలను కలిసి మోదీ వచ్చారని, నమస్కరించారని చెప్పి వారి ఆశీస్సులు తనకు అందేలా చూడాలని కోరారు. అందరూ చేతులెత్తి ఇందుకు సమ్మతి తెలియజేయాలని కోరగా, అంతా చేతులు ఎత్తి ఆయనకు మద్దతు పలికారు.


లోకేశ్‌ను ప్రత్యేకంగా పిలిచి..

తూర్పుగోదావరి జిల్లా వేమగిరి సభలో తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ను మోదీ ప్రత్యేకంగా పిలిచి, పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడారు. ఆ తర్వాత మోదీని లోకేశ్‌ శాలువాతో సన్మానించి, శ్రీవేంకటేశ్వరుడి ప్రతిమను అందించారు. రాజమహేంద్రవరం తెదేపా అభ్యర్థి ఆదిరెడ్డి వాసు, సిటింగ్‌ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీలను ప్రధాని మోదీకి లోకేశ్‌ పరిచయం చేశారు.


అవినీతి సొమ్ము పేదలకు పంచేలా చట్టం

దేశంలో కాంగ్రెస్‌ నాయకులు, ఇండియా కూటమి నాయకులు మాట్లాడితే చాలు ఈడీ ఈడీ అని గోల చేస్తుంటారు. దేశం మొత్తం ఈ రోజు ఏం జరిగిందో టీవీల్లో చూస్తోంది. ఝార్ఖండ్‌లో ఒక కాంగ్రెస్‌ మంత్రి వద్ద పనిచేసే సెక్రటరీ నౌకరు ఇంట్లో డబ్బుల కొండ దొరికింది. అంతకుముందు ఒక కాంగ్రెస్‌ ఎంపీ ఇంట్లో కూడా పెద్దమొత్తంలో నల్లధనం దొరికింది. ఎంత డబ్బు అంటే, నోట్లకట్టలు లెక్కించే యంత్రాలూ వాటిని లెక్కించలేకపోయాయి. కాంగ్రెస్‌ నాయకులు తమ ఇళ్లలో నల్లధనం దాచుకునే గోదాములు పెట్టుకున్నారు. ఎందుకు కాంగ్రెస్‌ నాయకుల ఇళ్లలోనే నోట్ల కట్టలు బయటపడుతున్నాయి? ఎవరికైనా ఈ నోట్లు సరఫరా చేసేందుకు దాచారా లేక ఆ కాంగ్రెస్‌ మొదటి కుటుంబానికి (నెహ్రూ కుటుంబం) సంబంధించిన సంపదా ఇదంతా? కాంగ్రెస్‌ రాకుమారుడి నుంచి జాతి సమాధానం కోరుకుంటోంది. దేశంలో ఇలా నల్లధనం ఉన్నవాళ్లే నన్ను తిడుతుంటారు. శాపనార్థాలు పెడుతుంటారు. కానీ నేను తిట్లకు భయపడే వ్యక్తిని కాను.. పేదల కోసం పని చేసే వ్యక్తిని. ఈడీ దాడి చేసి పట్టుకున్న మొత్తం అంతా కలిపితే లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ విషయంపై నేను న్యాయనిపుణులతో చర్చిస్తున్నా. ఒక చట్టం తీసుకురాబోతున్నా. దోచుకున్న సంపదనంతా ఎలా తీసుకురావాలో ఆలోచిస్తున్నా. ఆ డబ్బు పేదలకు ఎలా ఇవ్వచ్చో ఆలోచిస్తున్నా. పేదల హక్కులను ఎవరూ లాక్కోవడానికి వీల్లేదు. ఇది మోదీ గ్యారంటీ.


ఇక్కడో పెద్ద మద్యం సిండికేట్‌

మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి వైకాపా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేస్తోంది. అవినీతికి పాల్పడుతోంది. ఇక్కడ మద్యానికి సంబంధించి పెద్ద సిండికేట్‌ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో ఇసుక మాఫియా, మద్యం మాఫియా, భూ మాఫియా నడుస్తున్నాయి. ఈ ప్రభుత్వంలో అవినీతి ఫుల్‌, అభివృద్ధికి అంతరాయం. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఒక్కటీ నిర్మించలేకపోయింది. మూడు రాజధానుల పేరుతో భారీ ఎత్తున లూటీకి ప్రయత్నించింది. ఇంతలో ఖజానా ఖాళీ అయిపోయింది. వీళ్లు కేవలం అవినీతినే మేనేజ్‌ (నిర్వహణ) చేయగలరు. ఆర్థిక నిర్వహణ అలవాటు లేదు. పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.15వేల కోట్లు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును వైకాపా ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లలేకపోయింది. రాష్ట్ర రైతులు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. వరికి రాష్ట్రంలో సరైన ధర లభించడం లేదు. జూన్‌ 4 తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఇలాంటి సమస్యలన్నింటినీ దూరం చేస్తామని భరోసా ఇస్తున్నా కాంగ్రెస్‌, వైకాపా రాజకీయాల వల్ల రాష్ట్రంలో సంస్కృతిపై దాడి జరుగుతోంది. ఇక్కడి దేవాలయాలపైనా దాడులు జరుగుతున్నాయి. అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మించాం. భక్తితో కాంగ్రెస్‌ నాయకులెవరైనా ఆ ఆలయాన్ని సందర్శిస్తే కాంగ్రెస్‌ పార్టీ వారిని సస్పెండ్‌ చేస్తోంది. ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్ర సంస్కృతిని కాపాడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img