logo

కేఎంసీ స్పందన.. గుండెకు రక్షణ

వరంగల్‌ కాకతీయ వైద్య కళాశాలలోని ప్రధానమంత్రి స్వస్థ్య యోజన ప్రత్యేక సేవల(సూపర్‌ స్పెషాలిటీ) ఆసుపత్రిలో మొదటిసారి ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ  విజయవంతంగా నిర్వహించారు. 2004లో ఎంజీఎం ఆసుపత్రిలో

Published : 29 Sep 2022 02:03 IST

18 ఏళ్ల తర్వాత ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ

ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: వరంగల్‌ కాకతీయ వైద్య కళాశాలలోని ప్రధానమంత్రి స్వస్థ్య యోజన ప్రత్యేక సేవల(సూపర్‌ స్పెషాలిటీ) ఆసుపత్రిలో మొదటిసారి ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ  విజయవంతంగా నిర్వహించారు. 2004లో ఎంజీఎం ఆసుపత్రిలో అమరావతి ప్రభాకరాచారి ఈ శస్త్రచికిత్స చేశారు. ఆయన వెళ్లాక 18 సంవత్సరాల తర్వాత తిరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో విజయవంతంగా నిర్వహించడం ద్వారా ఓరుగల్లులో గుండె చప్పుడు పసిగట్టగల వైద్యులున్నారని నిరూపించారు. ఎంజీఎం ఆసుపత్రి సూపరిండెంటెంట్ డాక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన వడ్డెపల్లి స్వప్న(31) గుండె సమస్యతో ఈ నెల 8న కేఎంసీ ఆసుపత్రిలో చేరగా వైద్యులు పరీక్షలు నిర్వహించి ఆమె గుండె ఎగువ గదుల(అట్రియా) మధ్య గుండెలో రంధ్రం(కర్ణిక సెప్టల్‌)తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. అన్ని పరీక్షలు నిర్వహించిన అనంతరం బుధవారం కేఎంసీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ మోహన్‌దాసు, పీఎంఎస్‌ఎస్‌వై హృద్రోగ శస్త్రచికిత్స విభాగాధిపతి డాక్టర్‌ గోపాల్‌రావు, డిప్యూటీ నోడల్‌ అధికారి డాక్టర్‌ నర్సింగరావు ఆధ్వర్యంలో శస్త్రచికిత్స చేశారు. హృదయ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్‌ జె.సృజన్‌, డాక్టర్‌ బి.రిషిత్‌, అనస్తిషియా విభాగాధిపతి డాక్టర్‌ నాగార్జునరెడ్డి, ప్రొఫెసర్‌ డాక్టర్‌ జి.శ్రావణ్‌కుమార్‌, అసోసియేట్ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బి.చంద్రశేఖర్‌, డాక్టర్‌ స్ఫూర్తి, డాక్టర్‌ ప్రవల్లిక, ఆర్‌ఎంవో డాక్టర్‌ మురళి, డాక్టర్‌ హీనా, డాక్టర్‌ రహియా, నర్సింగ్‌ సూపరిండెంటెంట్ సుశీల ఆమెకు హార్ట్‌ లంగ్‌ బైపాస్‌ యంత్రం ద్వారా 29 నిమిషాల పాటు హృదయ స్పందనను నిలిపివేసి పెరికార్డియం ప్రక్రియ ద్వారా ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ నిర్వహించారు. ఎంజీఎం అనుబంధ కేఎంసీ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలో ఇంత పెద్ద సర్జరీ జరగడం ఇదే ప్రథమమని సూపరిండెంటెంట్ డాక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. ఈ విజయంలో వెన్నంటి ప్రోత్సహించిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, పంచాయితీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు సూపరింటెండెంట్ కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రి హరీశ్‌రావు ట్వీట్‌: హైదరాబాద్‌ నగరం వెలుపల వరంగల్‌లోని కేఎంసీ ఆసుపత్రిలో తొలిసారిగా ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేయడం అభినందనీయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్వీట్‌ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైద్యశాఖకు ఇస్తున్న ప్రాధాన్యానికి ఇది నిదర్శనం అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని