logo

‘స్కూల్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌’ పోటీలకు విద్యార్థుల ఎంపిక

విద్యార్థుల సృజనాత్మకత పెంచేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న స్కూల్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ తుది దశ పోటీలకు ఎంపికైన విద్యార్థుల ఆలోచనల వివరాలను ప్రభుత్వం ప్రకటించింది.

Published : 10 Jun 2023 02:49 IST

దేవరుప్పుల (జనగామ జిల్లా), న్యూస్‌టుడే:  విద్యార్థుల సృజనాత్మకత పెంచేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న స్కూల్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ తుది దశ పోటీలకు ఎంపికైన విద్యార్థుల ఆలోచనల వివరాలను ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల నుంచి వందల సంఖ్యలో ఆలోచనలు రాగా తుది పోటీకి 70 ఎంపిక చేశారు. వీరిలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన పన్నెండు పాఠశాలల విద్యార్థుల ఆలోచనలు ఉన్నాయి. వాటికి మరింత మెరుగులు దిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఆలోచనలకు మెరుగులు

విద్యార్థులకు ఎదురయ్యే కొన్ని సమస్యల పరిష్కారానికి వారిలో ఆలోచనలు వస్తుంటాయి. సొంతంగా ప్రయోగం చేసే వనరులు, శక్తి లేని విద్యార్థులకు ఇలాంటి ఆలోచనలు ఉంటే తమతో పంచుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ ఆహ్వానించింది.  రాష్ట్ర ఇన్నోవేషన్‌ సెల్‌,  ఇంక్విలాబ్‌ ఫౌండేషన్‌, యూనిసెఫ్‌,  విద్యాశాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన వేదిక విద్యార్థుల ఆలోచనలను ఆహ్వానించింది. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఒక సీనియర్‌ ఉపాధ్యాయుడిని గైడ్‌ టీచర్‌గా ఎంపిక చేసుకొని తమ ఆలోచనలు వివరించాలని కోరింది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల విద్యార్థులు పలు ఆలోచనలు పంపించారు.

ఇప్పుడేం చేస్తున్నారంటే..

తుది పోటీకి ఎంపికైన ఆలోచనలు పంపించిన విద్యార్థులతో గురువారం నుంచి దృశ్యమాధ్యమం ద్వారా సంభాషిస్తున్నారు. తమ ఆలోచనలను ఇంకా ఎలా మెరుగుపరిస్తే సమాజానికి ఉపయోగపడుతుందో నిపుణులు వివరిస్తున్నారు. విద్యార్థులకు  ఆ ఆలోచనలు ఎలా వచ్చాయో తెలుసుకొని త్వరలో నిర్వహించే కార్యశాలకు రావాలని సూచిస్తున్నారు. సభాకంపాన్ని పోగొట్టేందుకు వారితో సన్నిహితంగా మాట్లాడుతున్నారు. వీరికోసం త్వరలో కార్యశాల, నిపుణులతో  మేధోమథనం నిర్వహించనున్నారు. విద్యార్థులు, వారి గైడ్‌ టీచర్‌ను ఆహ్వానించి రెండు రోజులపాటు వారి ఆలోచనలకు మరింత మెరుగులు దిద్దనున్నారు. వీటికి కార్యరూపం కల్పించాక మేధోసంపత్తి హక్కు (పేటెంట్‌) కూడా ఆపాదించే యోచనలో ప్రభుత్వం ఉంది.


విజేతల సమాచారమందిస్తాం

- గౌసియాబేగం, జిల్లా సైన్సు అధికారిణి, జనగామ

స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ విడుదల చేసిన విజేతల జాబితా ఆధారంగా విద్యార్థులకు సమాచారమిచ్చాం. వీరికి ఈ నెలాఖరులోగా మరోసారి నిపుణులతో భేటీ ఉంటుందని, వారి ఆలోచనలకు మరింత సమాచారం సేకరించి అందుబాటులో ఉంచుకోవాలని అప్రమత్తం చేశాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని