logo

‘భద్రకాళిపై భూబకాసురుల కన్ను’

భూబకాసురుల నుంచి భద్రకాళి చెరువును రక్షించాలని, ఫుల్‌ ట్యాంకు లెవల్‌(ఎఫ్‌టీఎల్‌) నిబంధనలకు విరుద్ధంగా చెరువు స్థలాల్లో మట్టి నింపుతుంటే హనుమకొండ జిల్లా యంత్రాంగం ప్రేక్షకపాత్ర వహిస్తోందని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ఆరోపించారు.

Published : 13 Jun 2023 05:08 IST

  హనుమకొండ పద్మాక్షిగుట్ట వైపు భద్రకాళి చెరువు స్థలాలు పరిశీలిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

రంగంపేట, న్యూస్‌టుడే: భూబకాసురుల నుంచి భద్రకాళి చెరువును రక్షించాలని, ఫుల్‌ ట్యాంకు లెవల్‌(ఎఫ్‌టీఎల్‌) నిబంధనలకు విరుద్ధంగా చెరువు స్థలాల్లో మట్టి నింపుతుంటే హనుమకొండ జిల్లా యంత్రాంగం ప్రేక్షకపాత్ర వహిస్తోందని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ఆరోపించారు. ప్రైవేటు గూండాల పహారాలో 24 గంటలూ  మట్టి నింపుతున్నారన్నారు. సోమవారం హనుమకొండ పద్మాక్షిగుట్ట రోడ్డులో ఆక్రమణకు గురవుతున్న భద్రకాళి చెరువు స్థలాలను కాంగ్రెస్‌ నాయకులు పరిశీలించారు. సుమారు 30- 40 ఎకరాల భూమిని సొంతం చేసుకునేందుకు భారాస నాయకులు యత్నిస్తున్నారని, రెండు, మూడు చోట్ల చెరువు కట్టను తెంచేసి మురుగు నీటిని మళ్లిస్తున్నారని రాజేందర్‌రెడ్డి ఆరోపించారు. హనుమకొండ పోచమ్మకుంటలోని హనుమాన్‌ గుడి స్థలాలు వరంగల్‌లోని వ్యాపారవేత్తలకు ధారాదత్తం చేశారని విమర్శించారు. పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ నాయకత్వంలో విజయ్‌భాస్కర్‌, సోదా కిరణ్‌, రంజిత్‌రెడ్డి విచ్చలవిడిగా కబ్జాలు, ఆక్రమణలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. వరంగల్‌ పోలీసు కమిషనర్‌ వద్ద నమోదవుతున్న ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం భారాస నాయకులవేనని ఆరోపించారు. హనుమకొండ నగరం నడిబొడ్డున చెరువును కొల్లగొడుతుంటే అధికారులు మౌనంగా ఉండటం సరైంది కాదన్నారు. భద్రకాళి చెరువు ఆక్రమణలపై ఫిర్యాదు చేస్తామని రాజేందర్‌రెడ్డి తెలిపారు.


ఎమ్మెల్యే ఇల్లు ముట్టడిస్తాం

ఈనెల 20 లోగా అర్హులైన వారందరికీ రెండు పడకల ఇళ్లు ఇవ్వకపోతే వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ ఇంటిని ముట్టడిస్తామని హనుమకొండ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు. డీసీసీ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ తొమ్మిదేళ్లవుతున్నా ఇంత వరకు వరంగల్‌ నగర పరిధిలో ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలేదన్నారు. ఎమ్మెల్యే అనుచరులు ఇళ్లు ఇప్పిస్తామని పేదల నుంచి డబ్బులు వసూలు చేశారన్నారు. తొమ్మిదేళ్లలో ఏం చేశారని దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని రాజేందర్‌రెడ్డి ప్రశ్నించారు. కాజీపేట బస్టాండ్‌, కొత్త ఆర్వోబీ ఏమైందని నిలదీశారు. రింగు రోడ్డు, వరంగల్‌ మాస్టర్‌ ప్లాన్‌పై ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్‌, కార్పొరేటర్లు తోట వెంకన్న, శ్రీమాన్‌, జిల్లా నాయకులు లక్ష్మణ్‌, సరళాయాదవ్‌, అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు