logo

ఎవరిదో హస్తవాసి!

ఓరుగల్లు రాజకీయ ముఖచిత్రంలోని పార్టీల్లో రగడ రోజురోజుకు పెరుగుతోంది. కర్ణాటక ఎన్నికల తర్వాత ఊపు మీదున్న హస్తం పార్టీలో ఆశావహుల సంఖ్య ఎక్కువైంది.

Published : 18 Jul 2023 05:27 IST

పది స్థానాల్లో పోటాపోటీ

ఈనాడు, వరంగల్‌: ఓరుగల్లు రాజకీయ ముఖచిత్రంలోని పార్టీల్లో రగడ రోజురోజుకు పెరుగుతోంది. కర్ణాటక ఎన్నికల తర్వాత ఊపు మీదున్న హస్తం పార్టీలో ఆశావహుల సంఖ్య ఎక్కువైంది. డజను నియోజకవర్గాల్లో తాజా సమీకరణాలను పరిశీలిస్తే కాంగ్రెస్‌ టికెట్‌ కోసం కొన్ని చోట్ల ఇద్దరేసి పోటీ పడుతుండగా మరికొన్ని చోట్ల త్రిముఖ పోరు తప్పేలా లేదు. బలమైన అభ్యర్థులు లేని చోట్లా     అధికార భారాసకు దీటుగా అంగ, ఆర్థిక బలాలున్న అభ్యర్థులు రంగంలోకి దిగడానికి పావులు కదుపుతున్నారు.

వరంగల్‌ పశ్చిమలో కాంగ్రెస్‌ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి.. తాను పోటీ చేస్తానంటూ పదేపదే ప్రకటిస్తున్నా.. ఇదే స్థానం నుంచి బరిలోకి దిగుతానంటూ జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే జంగాపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఇది పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించడమే అని ఆయన చెబుతున్నా రాఘవరెడ్డి మాత్రం వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పశ్చిమ నుంచే పోటీ చేస్తానంటూ స్పష్టం చేయడం ఆసక్తికరంగా మారింది.  

వరంగల్‌ తూర్పులో ఇద్దరు మహిళా నేతల మధ్య పోటీ నెలకొంది. గతంలో వరంగల్‌ తూర్పు నుంచి గెలిచిన కొండా సురేఖ.. మళ్లీ పోటీ చేస్తానంటూ ఇప్పటికే స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాదయాత్రలో సైతం సురేఖ పోటీ చేయడం ఖాయమన్నట్టు సంకేతాలు ఇచ్చారు. ఇటీవల డీసీసీ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టిన మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ తూర్పుపైనే గురి పెట్టారు.

వర్ధన్నపేట నుంచి బరిలో దిగేందుకు మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, నియోజకవర్గ సమన్వయకర్త నమిండ్ల శ్రీనివాస్‌ పోటీ పడుతున్నారు. ఇద్దరి మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు ఇటీవల వర్ధన్నపేటలో జరిగిన ఒక కార్యక్రమంలో బహిర్గతమైంది. పరస్పరం బహిరంగ ఆరోపణలు చేసుకోవడం చర్చనీయాంశమైంది. నియోజకవర్గంలో ఎవరికివారు పర్యటిస్తూ తమ వర్గం కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరో విశ్రాంత పోలీసు అధికారి సైతం వర్ధన్నపేట నుంచి అవకాశం వస్తే పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

పరకాలలో టికెట్ల కోసం ఇరు వర్గాల మధ్య పోటీ నెలకొంది. గతంలో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఇనుగాల వెంకట్రాంరెడ్డ్డి మరోసారి బరిలో నిలవాలని ప్రయత్నిస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు సైతం పరకాల నుంచి అవకాశం ఇస్తే బరిలో నిల్చుంటానంటూ వెల్లడించారు. రెండు నెలల కిందట వరంగల్‌లో కొండా, ఇనుగాల వర్గీయుల మధ్య గొడవ జరిగింది. పరకాలలో బీసీ ఓట్లు అధిక సంఖ్యలో ఉండడంతో వచ్చేసారి అవసరమైతే బీసీ అభ్యర్థిని బరిలో నిలపాలని అధిష్ఠానం ఆలోచిస్తున్నట్టు సమాచారం.

జనగామ నుంచి ఇద్దరు సీనియర్‌ నేతలు పోటాపోటీగా ఉన్నారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఎవరికి వారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో సైతం తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించే క్రమంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. పార్టీ ఆందోళన కార్యక్రమాలను సైతం విడివిడిగానే చేపడుతున్నారు.

పాలకుర్తి: గత ఎన్నికల్లో పోటీ చేసిన జంగారాఘవరెడ్డి ఈసారి వరంగల్‌ పశ్చిమపై దృష్టిసారించడంతో పాలకుర్తిలో మరో ఇద్దరు పోటీలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. వరంగల్‌ జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్‌ ధన్వంతి భర్త టీపీసీసీ సభ్యుడు డాక్టర్‌ లక్ష్మీనారాయణ నాయక్‌ తాను పాలకుర్తి నుంచి పోటీ చేస్తానంటూ ఇప్పటికే ప్రకటించారు. ప్రవాస భారతీయురాలైన హనుమండ్ల ఝాన్సీ రెడ్డి రంగ ప్రవేశం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆమె భారీ ప్రదర్శన నిర్వహించి ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు.

ఈ రెండు చోట్లా ఒక్కొక్కరే..

భూపాలపల్లి నుంచి గండ్ర సత్యనారాయణరావు బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. ఇక్కడ ఆయనకు పోటీ లేదు.

ములుగు నుంచి ఎమ్మెల్యే సీతక్కే మళ్లీ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సైతం అవసరమైతే సీతక్కే సీఎం అవుతారని అనడం ప్రాముఖ్యం సంతరించుకుంది.

మహబూబాబాద్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్‌ కోసం మాజీ ఎంపీ పోరిక బలరాంనాయక్‌, ఎల్‌హెచ్‌పీఎస్‌ వ్యవస్థాపకులు, టీపీసీసీ అధికార ప్రతినిధి బెల్లయ్యనాయక్‌, డాక్టర్‌ భూక్యా మురళీనాయక్‌లు పోటీపడుతున్నారు. ఈ ముగ్గురూ తమకే టికెట్‌ వస్తుందంటూ నియోజకవర్గంలో వేర్వేరుగా పర్యటిస్తున్నారు. ఇటీవల బలరాంనాయక్‌, బెల్లయ్యనాయక్‌ కలిసి ఒకే వేదికగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించి ఇద్దరిలో టికెట్ ఎవరికి వచ్చినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తామని ప్రకటించారు. మురళీనాయక్‌ జిల్లా అధ్యక్షుడు భరత్‌చంద్‌రెడ్డి ద్వారా తనకు టికెట్‌ వస్తుందనే భరోసాతో ఉన్నారు.

డోర్నకల్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న డాక్టర్‌ జాటోతు రాంచంద్రునాయక్‌, నెహ్రూనాయక్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. రెండు వర్గాలుగా ఏర్పడి పర్యటిస్తున్నారు. రాంచంద్రునాయక్‌ 2014లో తెదేపా, 2018లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓడిపోయారు. ఈసారి అధిష్ఠానం టికెట్‌ తనకే ఇస్తుందని  నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నెహ్రూనాయక్‌  తొలిసారి బరిలో నిలిచేందుకు ఆసక్తితో ఉన్నారు. నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజలకు దగ్గరవుతున్నారు.

నర్సంపేట నుంచి మాజీ ఎమ్మెల్యే దొంతిమాధవరెడ్డి టికెట్ తనదేనని గట్టి ధీమాతో ఉన్నారు. నెల రోజుల నుంచి జోడో యాత్ర నిర్వహిస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన కత్తి వెంకటస్వామి సైతం టికెట్ ఆశిస్తున్నారు.

స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన సింగారపు ఇందిర ఈసారీ సిద్ధమవుతున్నారు. గతంలో వరంగల్‌ ఎంపీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో దిగిన టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొమ్మటి సాంబయ్య ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గడపగడపనకు కాంగ్రెస్‌ పేరుతో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని