logo

Mahabubabad: మరణించాక.. కొలువొచ్చింది!

ప్రభుత్వ ఉద్యోగం సాధించి తల్లిదండ్రులకు అండగా ఉండాలనుకున్నాడు ఆ యువకుడు.. తుది ఫలితాల కోసం ఆశగా ఎదురుచూశాడు.. విధివశాత్తు రెండు నెలల కిందట రోడ్డు ప్రమాదంలో కన్నుమూయగా..

Updated : 07 Oct 2023 07:13 IST

వేణు (పాత చిత్రం)

గార్ల (మహబూబాబాద్‌), న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉద్యోగం సాధించి తల్లిదండ్రులకు అండగా ఉండాలనుకున్నాడు ఆ యువకుడు.. తుది ఫలితాల కోసం ఆశగా ఎదురుచూశాడు.. విధివశాత్తు రెండు నెలల కిందట రోడ్డు ప్రమాదంలో కన్నుమూయగా.. ఇటీవల విడుదలైన కానిస్టేబుల్‌ ఉద్యోగ ఎంపిక జాబితాలో అతడి పేరు ఉందని తెలుసుకున్న ఆ యువకుడి తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతంగా మారింది. మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం పినిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన భద్ర, కేవుల్య దంపతులది మధ్యతరగతి కుటుంబం. సెంట్రింగ్‌ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారి కుమారుడు నునావత్‌ వేణు (24) డిగ్రీ పూర్తి చేశారు. పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసిన వేణు ఎంపిక కావాలని పట్టుదలతో చదివి రాత పరీక్షలో అర్హత సాధించారు. సాధన చేసి ఈవెంట్స్‌లోనూ ప్రతిభ కనబరిచారు. పరీక్ష రాని ఫలితాల కోసం ఎదురుచూస్తూనే ఖాళీగా ఉండకుండా తండ్రికి  చేదోడువాదోడుగా ఉంటున్నాడు. జులై 2వ తేదీన తండ్రితోపాటు సెంట్రింగ్‌ పనులకు వెళ్తుండగా సూర్యాపేట రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో వేణు మరణించారు. ఈ నెల నాలుగో తేదీన తెలంగాణ పోలీసు నియమాక మండలి బోర్డు వెలువరించిన కానిస్టేబుల్‌ ఉద్యోగాల ఎంపిక జాబితాలో వేణు పేరు ఉంది. తన కుమారుడు ఉద్యోగాన్ని సాధించినట్లు శుక్రవారం తెలుసుకున్న తండ్రి భద్ర, తల్లి కేవుల్య వేణును తలుచుకుంటూ కన్నీటిపర్యంతమైన సంఘటన బంధువులు, గ్రామస్థులను కదిలించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని