logo

నడవలేక.. అడగలేక.. అలసిపోతున్నాం..!

ఉమ్మడి వరంగల్‌వ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో రవాణా కష్టాలు తీరడం లేదు. అటవీ ప్రాంతాల గుండా రహదారుల నిర్మాణాలకు అటవీశాఖ అభ్యంతరాలు చెబుతోంది.

Published : 16 Apr 2024 04:36 IST

అటవీశాఖ అభ్యంతరాలతో ముందుకు సాగని రహదారుల నిర్మాణాలు

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ఏటూరునాగారం, కొత్తగూడ, మహాముత్తారం, న్యూస్‌టుడే:  ఉమ్మడి వరంగల్‌వ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో రవాణా కష్టాలు తీరడం లేదు. అటవీ ప్రాంతాల గుండా రహదారుల నిర్మాణాలకు అటవీశాఖ అభ్యంతరాలు చెబుతోంది. దీంతో నిధులున్నా నిర్మాణాలు చేపట్టలేని పరిస్థితి.   దీంతో గ్రామీణులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తూ గతుకులు, మట్టి రోడ్ల వెంట అవస్థలు పడుతూ రాకపోకలు సాగిస్తున్నారు.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో..

  • భూపాలపల్లి మండలం దూదేకులపల్లి-పందిపంపుల గ్రామాల మధ్య 8.5 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి ఎనిమిదేళ్ల కిందట రూ.5 కోట్లు మంజూరయ్యాయి. అటవీశాఖ అనుమతులు రాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు.
  • చిట్యాల మండలం వెంచరామి నుంచి పూరేడుగుట్ట వరకు రహదారి నిర్మాణానికి 2016లో రూ.34 లక్షలు మంజూరైనా.. అటవీశాఖ అభ్యంతరాలతో పనులు నిలిచిపోయాయి. పూరేడుగుట్ట వద్ద సమ్మక్కసారలమ్మ జాతర నిర్వహిస్తారు.
  • మహాముత్తారం మండలం నిమ్మగూడెం-యత్నారం- కనుకునూరు రహదారి మరమ్మతులకు గురైంది. 16 కిలోమీటర్ల రహదారి పునరుద్ధరణకు రూ.16 కోట్లు మంజూరయ్యాయి. అటవీశాఖ అభ్యంతరాలతోనే పనులు ఆగిపోయాయి. దీంతో పలు అటవీ గ్రామాల ప్రజలు రవాణా సౌకర్యం లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.
  • మహాముత్తారం మండలం పెగడపల్లి-భూపాలపల్లి మండలం ఆజంనగర్‌ వరకు 3.5 కిలోమీటర్ల రహదారికి కూడా రూ.2.64 కోట్లు మంజూరయ్యాయి. దీని పనులు కూడా ఆరంభం కాలేదు.
  • మహాముత్తారం మండలం స్తంభంపల్లి(పి.కె)-మద్దిమడుగు వరకు 6.15 కిలోమీటర్ల రహదారికి రూ.5.59 కోట్లు మంజూరయ్యాయి. అటవీ అనుమతులు రావాల్సి ఉంది.

మంత్రులు దృష్టి సారించాలి..

ఉమ్మడి జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు దృష్టి సారించి అటవీ అనుమతులు వచ్చేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. అటవీ శాఖ మంత్రిగా కొండా సురేఖ వ్యవహరిస్తున్నారు. మారుమూల ప్రాంత వాసుల రవాణా కష్టాలు తెలిసిన వీరు అటవీ శాఖకు చెల్లించాల్సిన నిధులు మంజూరుకు కృషి చేయాలి. అటవీ స్థలాలకు బదులుగా ప్రభుత్వ స్థలాలు కేటాయించి అనుమతులు వచ్చేలా చూడాలి.


ఈ రహదారి తాడిచర్ల-భూపాలపల్లి వరకు నిర్మించాల్సి ఉంది. అటవీ అనుమతులు రాకపోవడంతో అర్ధంతరంగా నిలిచిపోయింది. రూ.23 కోట్ల నిధులున్నా.. పనులు పట్టాలెక్కడం లేదు. ఏడాది కిందటే మొదటి దశ అనుమతులు వచ్చాయని అధికారులు చెప్పినా మిగతా ప్రక్రియ పూర్తికాలేదు. ఈ రహదారి పూర్తయితే పెద్దపల్లి జిల్లా మంథనికి దాదాపు 30 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది.


అటవీ అనుమతుల ప్రక్రియ కొనసాగుతోంది

- వెంకటేశ్‌, ఈఈ ఆర్‌అండ్‌బీ

అటవీ ప్రాంతాల గుండా వెళ్లే రహదారుల నిర్మాణానికి అటవీశాఖను అనుమతి కోరాం. కొన్నింటికి మొదటి దశ అనుమతులు వచ్చాయి. అటవీశాఖకు చెల్లించేందుకు నిధులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాం. మిగతా వాటికోసం ప్రక్రియ కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని