logo

ముందస్తుగా ఓటేశారు!

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఓ వైపు అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకుల ప్రచారాలు.. మరో వైపు ఈ నెల 13న పోలింగ్‌ నిర్వహించేందుకు అధికారుల ఏర్పాట్లు కొనసాగుతుండగానే ఓటింగ్‌ ప్రక్రియ మొదలైంది.

Published : 06 May 2024 06:07 IST

భూపాలపల్లిలో ఓటేసేందుకు వరసలో నిలబడిన భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, ప్రభుత్వ ఉద్యోగులు

న్యూస్‌టుడే, భూపాలపల్లి : లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఓ వైపు అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకుల ప్రచారాలు.. మరో వైపు ఈ నెల 13న పోలింగ్‌ నిర్వహించేందుకు అధికారుల ఏర్పాట్లు కొనసాగుతుండగానే ఓటింగ్‌ ప్రక్రియ మొదలైంది. సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ముందస్తుగానే ఓటేశారు.. ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు అత్యవసర సేవల్లో పాల్గొనే సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించగా, జిల్లాలో ఆదివారం ఈ ప్రక్రియను ప్రారంభించారు. భూపాలపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రాలు నాలుగు ఏర్పాటు చేయగా, మొదటి 423 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం 2,245 మంది ఉన్నారు. భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావుతో పాటు సీఐలు, ఎస్సైలు, పోలీసులు, రెవెన్యూ, తదితర ప్రభుత్వ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద తాగునీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పించారు. అదేవిధంగా పోలింగ్‌ కేంద్రాల వద్ద భూపాలపల్లి సీఐ నరేష్‌ కుమార్‌ పర్యవేక్షణలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇంటి నుంచి.. 76 మంది

జిల్లాలో హోం ఓటింగ్‌లో 76 మంది పాల్గొన్నారు.. 85 ఏళ్లు దాటిన వృద్ధులు, 40 శాతానికి మించి అంగవైకల్యం గల దివ్యాంగులు మొత్తం 78 మందిని గుర్తించారు. మొదటి రోజు శనివారం 42 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, రెండో రోజు ఆదివారం 34 మంది హోం ఓటింగ్‌లో పాల్గొన్నారు. మొత్తం 76 మంది ఇంటి నుంచి ఓటింగ్‌లో పాల్గొన్నారు. జిల్లాలో మొత్తం 78 మందిని గుర్తించగా, 76 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో దివ్యాంగులు 23 మంది, వృద్ధులు 53 మంది ఇంటి నుంచే ఓటింగ్‌లో పాల్గొన్నారు. మరో ఇద్దరు ఓటు హక్కు వినియోగించుకోలేదు. అయితే పోలింగ్‌ సిబ్బంది వారి ఇళ్లకు వెళ్లినప్పుడు దరఖాస్తు చేసుకున్న ఓటర్లు లేకపోతే ఈనెల 8వ తేదీ వరకు మరో అవకాశం కల్పిస్తారు. ఇంటి నుంచి ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఏదైనా కారణంతో ఓటు హక్కు వినియోగించుకోకుంటే పోలింగ్‌ రోజు కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనర్హులవుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని