logo

ఊయల కట్టిన స్టూల్‌ మీదపడి చిన్నారి మృతి

పొట్టకూటి కోసం వందల కిలోమీటర్లు వలస వచ్చిన ఆ కూలీ కుటుంబంలో విషాదం అలుముకుంది.

Updated : 09 May 2024 06:57 IST

వలస కుటుంబంలో విషాదం

రోషిత ఖర్ష్‌ (6నెలలు)

కాజీపేట టౌన్‌, న్యూస్‌టుడే: పొట్టకూటి కోసం వందల కిలోమీటర్లు వలస వచ్చిన ఆ కూలీ కుటుంబంలో విషాదం అలుముకుంది. ఊయల కట్టిన స్టూల్‌ మీదపడి ఆరు నెలల చిన్నారి ఉసురు తీయడంతో ఆ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ విషాదకర సంఘటన హనుమకొండ నగరం కాజీపేట సోమడిలో చోటు చేసుకొంది. సీఐ వై.సుధాకర్‌రెడ్డి కథనం ప్రకారం... ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం చెంపా జిల్లా కటౌడ్‌ గ్రామానికి చెందిన లోక్‌నాథ్‌ ఖర్ష్‌ తాపీమేస్త్రీగా జీవనం సాగించేవారు. స్వరాష్ట్రంలో ఉపాధి దొరకక పోవడంతో నాలుగేళ్ల కిందట కుటుంబంతో సహా హనుమకొండకు వలస వచ్చారు. ఆయనకు భార్య భారతి ఖర్ష్‌, పిల్లలు ఐదేళ్ల కుమారుడు చంచల్‌, మూడేళ్ల కుమార్తె చాంద్‌, ఆరు నెలల చిన్నారి రోషిత ఉన్నారు. పది రోజుల కిందట సోమిడిలో ఓ ఇంటి నిర్మాణ పని కోసం వచ్చి ఇక్కడే రేకుల షెడ్డులో తాత్కాలికంగా నివాసం ఉంటున్నారు. బుధవారం ఇక్కడ పని లేకపోవడంతో లోక్‌నాథ్‌ ఖర్ష్‌ ప్రశాంత్‌నగర్‌లో ఓ ఇంటి నిర్మాణ పనికి వెళ్లారు. ఆయన భార్య భారతి సోమిడిలో నిర్మాణంలో ఉన్న ఇంటి దర్వాజకు, ఇటువైపు ఐదడుగుల ఇనుప స్టూలుకు చీరతో ఊయల కట్టి చిన్నారి రోషిత (6 నెలలు)ను అందులో పడుకోబెట్టి ఇంట్లో పనులు చేసుకోసాగింది. అయితే స్టూల్‌ సరిగా లేకపోవడంతో అది అదుపు తప్పడంతో ఊయలలో ఉన్న చిన్నారి కిందపడగా.. పైన స్టూల్‌ పడింది. పసిపాప నుదుటికి బలమైన గాయం కావడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. చిన్నారి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై శివకృష్ణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు