ఐఎఫ్‌ఎస్‌లో మెరిసిన పల్లె బిడ్డలు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మారుమూల పల్లెలకు చెందిన ఇద్దరు యువకులు ఐఎఫ్‌ఎస్‌ సాధించారు.

Updated : 09 May 2024 05:51 IST

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి- న్యూస్‌టుడే, చిట్యాల : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మారుమూల పల్లెలకు చెందిన ఇద్దరు యువకులు ఐఎఫ్‌ఎస్‌ సాధించారు. బుధవారం యూపీఎస్సీ వెల్లడించిన ఫలితాల్లో చిట్యాల మండలం గుంటూరుపల్లికి చెందిన మన్నెం అజయ్‌కుమార్‌ 44వ ర్యాంకు, భూపాలపల్లి మండలం గుర్రంపేట రామ్‌నాయక్‌తండాకు చెందిన పోరిక లవకుమార్‌ 130వ ర్యాంకు సాధించి ఇండియన్‌ ఫారెస్టు సర్వీసుకు ఎంపికయ్యారు.


తొలి ప్రయత్నంలోనే..

తల్లిదండ్రులు, తమ్ముడితో అజయ్‌కుమార్‌

చిట్యాల మండలం గుంటూరుపల్లికి చెందిన మన్నెం వాసు, భూ లక్ష్మీ దంపతులకు ఇద్దరు సంతానం కాగా అజయ్‌కుమార్‌ మొదటివాడు. మొదటి ప్రయత్నంలో ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికయ్యాడు. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు వరంగల్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో పూర్తి చేశారు. 6 నుంచి ఇంటర్మీడియట్‌ వరకు కోరుకొండ సైనిక్‌ పాఠశాలలో చదివారు. ఇంజినీరింగ్‌ విద్యను హైదరాబాద్‌లోని శంషాబాద్‌ వర్ధమాన్‌ కళాశాలలో, జార్ఖండ్‌ రాష్ట్రంలోని ధన్‌బాద్‌ ఐఐటీలో ఎంటెక్‌ పూర్తి చేశారు. 2022 నుంచి హైదరాబాద్‌లో ఉంటూ సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. ఎలాంటి కోచింగ్‌ లేకుండా మొదటి ప్రయత్నంలోనే ఐఎఫ్‌ఎస్‌ సాధించారు. ‘ఈ సంవత్సరం మళ్లీ సివిల్స్‌కు సన్నద్ధమవుతున్నాను.. ఐఏఎస్‌ సాధించడమే లక్ష్యమని’ అజయ్‌కుమార్‌ తెలిపారు.


తండ్రి బీట్‌ ఆఫీసర్‌.. తనయుడు ఐఎఫ్‌ఎస్‌

లవకుమార్‌ , సూరిదాస్‌

తండ్రి కష్టం వృథా పోలేదు.. ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ అటవీ శాఖలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ పిల్లలను చదివించారు. ఫలితంగా తనయుడు ఐఎఫ్‌ఎస్‌ సాధించాడు. భూపాలపల్లి మండలం గుర్రంపేట గ్రామానికి చెందిన పోరిక సూరిదాస్‌, ప్రమీల దంపతుల కుమారుడైన లవకుమార్‌ పట్టువీడని విక్రమార్కుడిలా సివిల్స్‌ లక్ష్యంగా ఏడేళ్లుగా శ్రమిస్తున్నారు. తన ఆరో ప్రయత్నంలో ఐఎఫ్‌ఎస్‌ సాధించారు. 1 నుంచి పదోతరగతి వరకు హనుమకొండలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివారు. ఇంటర్‌ హైదరాబాద్‌లో, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. 2017 నుంచి సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో సివిల్స్‌ 5 మార్కులతో చేజారింది. గతేడాది ఎస్‌ఎస్‌సీ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణుడై టెలీ కమ్యూనికేషన్‌లో జూనియర్‌ అకౌంటెంట్‌గా చెన్నైలో ఉద్యోగం సంపాదించారు. దిల్లీలో శిక్షణలో ఉండగానే.. బుధవారం  ఐఎఫ్‌ఎస్‌ ఫలితంలో ర్యాంకు రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. లవకుమార్‌ తండ్రి సూరిదాస్‌ 1989లో అటవీశాఖలో రిజర్వ్‌ వాచర్‌గా నియామకయ్యారు. 2002లో ఎఫ్‌బీవోగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో ఎఫ్‌బీఓగా పనిచేస్తున్నారు. తాను పనిచేసే శాఖలో తన  కుమారుడు ఉన్నతోద్యోగం సాధించడం గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. లవకుమార్‌ మాట్లాడుతూ. ‘ఐఎఫ్‌ఎస్‌ రావడం ఎంతో సంతోషంగా ఉంది. సివిల్స్‌కు 7 సార్లు ప్రయత్నం చేశాను. ఒక్కోసారి వదిలేద్దామనుకున్నాను. తల్లిదండ్రులు వెన్నంటి ఉండి సహకరించారని’ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని