logo

వారు అడగరనే..

తాడేపల్లిగూడెం పట్టణంలో అక్రమ నిర్మాణాలు నానాటికి పెరిగిపోతున్నాయి. అడ్డుకోవాల్సిన అధికారులే అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కింది స్థాయి సిబ్బంది నుంచి పైస్థాయి అధికారుల వరకు మామూలు...

Published : 16 Aug 2022 05:38 IST

పరదాల మాటున యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు

తాడేపల్లిగూడెం అర్బన్‌, న్యూస్‌టుడే

తాడేపల్లిగూడెం పట్టణంలో అక్రమ నిర్మాణాలు నానాటికి పెరిగిపోతున్నాయి. అడ్డుకోవాల్సిన అధికారులే అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కింది స్థాయి సిబ్బంది నుంచి పైస్థాయి అధికారుల వరకు మామూలు అందిస్తే చాలు ఎలాంటి ప్రాంతాల్లోనైనా నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లభిస్తాయి. పట్టణ ప్రణాళిక అధికారుల నిర్లక్ష్యం కారణంగా అక్రమ కట్టడాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఫలితంగా పురపాలక ఆదాయానికి భారీ మొత్తంలో గండి పడుతోంది. కొంత మంది ఏకంగా ప్రభుత్వ స్థలాలను సైతం ఆక్రమించుకుని గుట్టుచప్పుడు కాకుండా నిర్మాణాలు చేపడుతున్నారు.

ప్రణాళిక మార్చి..  పట్టణ పరిధిలో నిర్మాణాలు చేపట్టాలంటే పట్టణ ప్రణాళిక అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చాలా మంది లైసెన్సుడు సర్వేయర్‌ ద్వారా ప్లానింగ్‌ తీసుకుని అనుమతులు పొందుతున్నారు. అయితే ప్లానింగ్‌లో ఉన్నవిధంగా కాకుండా తమకు నచ్చిన విధంగా నిర్మాణాలు చేపడుతున్నారు. కడకట్ల వంటి ప్రాంతాల్లో గృహ నిర్మాణాల పేరిట అనుమతులు తీసుకుని వాణిజ్య సముదాయాలను నిర్మిస్తున్నారు. అదే విధంగా ఎఫ్‌సీఐ కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌కు సంబంధించి అక్రమంగా పెంట్‌హౌస్‌ నిర్మాణం జరుగుతోంది. ఎక్కడికక్కడ ఇలా అక్రమ నిర్మాణాలు సాగుతున్నప్పటికీ అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు.

‘అక్రమ కట్టడాలపై కఠినంగా వ్యవహరిస్తాం. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని కమిషనర్‌ బాలస్వామి తెలిపారు.


అధికారుల అండతో

పట్టణంలోని డీఎస్‌ చెరువు హంస మేడ సమీపంలో బహుళంతస్తుల భవన నిర్మాణం జరుగుతోంది. నిబంధనల ప్రకారం సెట్‌బ్యాక్‌, పార్కింగ్‌ వంటి సదుపాయాలు లేకపోయినా అధికారులు అనుమతులు మంజూరు చేశారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో రోడ్డుకు ఆనుకుని నిర్మాణం జరగడంతో పాఠశాలల బస్సులు, కార్లు, ఇతర భారీ వాహనాలు వెళ్లేందుకు ఇబ్బంది పడాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం 30 అడుగుల రోడ్డు ఉండాలనే నిబంధనను సైతం అధికారులు తుంగలో తొక్కారు. ఈ మార్గంలో ఇప్పటి వరకు డ్రెయిన్‌ నిర్మాణం జరగలేదు. భవిష్యత్తులో ఇక్కడ పక్కా డ్రెయిన్‌ నిర్మించాలంటే అసాధ్యమనే చెప్పాలి. చివరకు భవనానికి అడ్డుగా ఉందని స్తంభాన్ని సైతం తొలగించడం గమనార్హం. ఈ భవన నిర్మాణానికి సంబంధించి అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు అందాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


కనిపించని ప్రభుత్వ స్థలం  

పట్టణంలోని ఎస్వీఆర్‌ సర్కిల్‌ వద్ద ఓ వ్యక్తి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతున్నారు. లోపల జరుగుతున్న పనులు కనిపించకుండా బరకాలు కట్టి గుట్టుచప్పుడు కాకుండా భవన నిర్మాణం చేపడుతున్నారు. దీనికి ఆనుకుని ఉన్న ప్రధాన మురుగు బోదె సైతం ఆక్రమణకు గురైంది. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని